
9న చంద్రబాబు ప్రమాణం!
* ఆరోజున 9 లేదా 18 మంది ప్రమాణం
* యనమల, గంటా, నిమ్మకాయల, కళాల్లో ఇద్దరికి డిప్యూటీ సీఎం పదవి
* మంత్రివర్గం, ఇతర పదవుల కోసం 45 మందితో జాబితా రూపొందించిన బాబు
సాక్షి, హైదరాబాద్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జూన్ 9న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. విజయవాడ, గుంటూరుల మధ్యన ఉన్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న స్థలంలోనే ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు. ముఖ్యమంత్రితో పాటు.. మరో ఎనిమిది మంది లేదంటే 17 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. శుక్రవారం సీమాంధ్ర సచివాలయ ఉద్యోగుల సంఘం చైర్మన్ మురళీకృష్ణ నేతృత్వంలో ఉద్యోగుల ప్రతినిధి బృందం చంద్రబాబును కలిసింది. ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం, సచివాలయం నుంచి విధుల నిర్వహణ అంశం ప్రస్తావనకు రాగా.. జూన్ ఏడు, ఎనిమిది తేదీల వరకూ మంచి రోజులు లేవని.. ఆ తర్వాతే ప్రమాణ స్వీకారం చేస్తానని చంద్రబాబు వారితో పేర్కొన్నారు.
9న ఏకాదశి కావటంతో ఆ రోజునే ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. ప్రమాణం చేసిన వెంటనే సచివాలయానికి వచ్చి కార్యకలాపాలు ప్రారంభిస్తానని ఉద్యోగ సంఘాల నేతలకు చెప్పారు. బాబు తన మంత్రివర్గంలో ఇద్దరిని ఉప ముఖ్యమంత్రులుగా నియమించనున్నారు. కిమిడి కళావెంకట్రావు, గంటా శ్రీనివాసరావు, యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, కె.ఇ.కృష్ణమూర్తిల్లో ఎవరైనా ఇద్దరికి డిప్యూటీ సీఎం అవకాశం లభిస్తుంది. హోంశాఖను కె.ఇ.కృష్ణమూర్తి లేదా పల్లె రఘునాథరెడ్డిల్లో ఒకరికి ఇస్తారని తెలిసింది. ఒకవేళ కేఈకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే మోదుగుల వేణుగోపాలరెడ్డికి హోంశాఖ ఇచ్చే అవకాశాలున్నాయి. రెవెన్యూ శాఖకు కిమిడి కళా వెంకట్రావు పేరు పరిశీలిస్తున్నారు. స్పీకర్ పదవికి ధూళిపాళ్ల నరేంద్రకుమార్, డాక్టర్ కోడెల శివప్రసాదరావుల పేర్లు పరిశీలిస్తున్నారు.
45 మందితో బాబు జాబితా...
మంత్రివర్గంలో స్థానం కల్పించటంతో పాటు సభాపతి, ఉప సభాపతి, చీఫ్ విప్, విప్‌ల పదవులు ఇచ్చేందుకు చంద్రబాబు సుమారు 45 మందితో కూడిన ఒక జాబితాను తయారు చేశారు. పార్టీ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు ఈ జాబితాలో యనమల రామకృష్ణుడు, కాలువ శ్రీనివాసులు, కె.ఇ.కృష్ణమూర్తి, బి.కె.పార్థసారథి, కిమిడి కళావెంకట్రావు, గంటా శ్రీనివాసరావు, నిమ్మకాయల చినరాజప్ప, తోట త్రిమూర్తులు, మండలి బుద్ధప్రసాద్, బోండా ఉమామహేశ్వరరావు, డి.కె.సత్యప్రభ, వనమాడి వెంకటేశ్వరరావు, గౌతు శ్యామసుందర శివాజీ, కాగిత వెంకట్రావు, పితాని సత్యనారాయణ, ముడియం శ్రీనివాస్, పీతల సుజాత, నక్కా ఆనందబాబు, గొల్లపల్లి సూర్యారావు, కె.ఎస్.జవహర్, రావెల కిషోర్‌బాబు, యామినీ బాల, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, చింతమనేని ప్రభాకర్, దేవినేని ఉమామహేశ్వరరావు, యరపతినేని శ్రీనివాసరావు, ప్రత్తిపాటి పుల్లారావు, ధూళిపాళ్ల నరేంద్రకుమార్, ఆలపాటి రాజేంద్రప్రసాద్, పరిటాల సునీత, దామచర్ల జనార్థన్, సిద్ధా రాఘవరావు, కురుగొండ రామకృష్ణ, మోదుగుల వేణుగోపాలరెడ్డి, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, బి.సి.జనార్దనరెడ్డి, మేడా మల్లికార్జునరెడ్డి, ఎస్.వి.సతీష్‌రెడ్డి, పల్లె రఘునాథరెడ్డి, కె.అచ్చన్నాయుడు, ఎన్.ఎం.డి.ఫారూఖ్, కలవపూడి శివల పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది.
చంద్రబాబును కలిసిన ఆమంచి
ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ శుక్రవారం చంద్రబాబును కలిశారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆయన నవోద యం పార్టీ తరఫున గెలుపొందారు. బాబుతో భేటీ అనంతరం ఆమంచి మీడి యాతో మాట్లాడుతూ తాను టీడీపీ అనుబంధ సభ్యుడిగా కొనసాగుతానని చెప్పారు.