ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో అన్నా హజారే ఫొటోను పెట్టుకుని ఊరూరా తిరిగిన చంద్రబాబుకు ఇప్పుడు హజారే దీక్ష ఎందుకు గుర్తుకు రాలేదో సమాధానం చెప్పాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ ప్రశ్నించారు.
- సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ
నెల్లూరు (సెంట్రల్): ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో అన్నా హజారే ఫొటోను పెట్టుకుని ఊరూరా తిరిగిన చంద్రబాబుకు ఇప్పుడు హజారే దీక్ష ఎందుకు గుర్తుకు రాలేదో సమాధానం చెప్పాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ ప్రశ్నించారు. నెల్లూరులో శుక్రవారం జరిగిన సీపీఐ 23వ జిల్లా మహాసభల్లో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు అన్నాహజారేను ఆదర్శంగా తీసుకోవాలి, ఆయన మద్దతు చాలా అవసరమంటూ నిత్యం డాబు మాటలు చెప్పే చంద్రబాబు.. ఇప్పుడు భూసేకరణ వ్యతిరేకంగా ఉద్యమం చేస్తుంటే ఎందుకు చంద్రబాబు మద్దతు ఇవ్వటం లేదో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
హజారే చేస్తున్న ఉద్యమానికి మద్దతివ్వాలి.. లేకుంటే కేంద్రంలో ఉన్న మీ ఇద్దరు మంత్రులతో రాజీనామా అయినా చేయించాలని డిమాండ్ చేశారు. అధికారం కోసం ఎన్ని అడ్డదారులైనా తొక్కడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని తీవ్రస్థాయిలో విమర్శించారు. రాజధాని కోసం రైతుల వద్ద భూములు బలవంతంగా లాక్కోవాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్రానికి రావాల్సిన నిధులు తేలేక కేంద్రంలో అడుక్కుంటూ..రాష్ట్రంలోకి వచ్చి మీసాలు తిప్పుతూ చంద్రబాబు కాలం వెల్లతీస్తున్నారని ఎద్దేవా చేశారు.