దాతృత్వ, సౌభ్రాతృత్వాలకు ప్రతీక రంజాన్ | Chandrababu naidu wishes muslim community on Ramazan | Sakshi
Sakshi News home page

దాతృత్వ, సౌభ్రాతృత్వాలకు ప్రతీక రంజాన్

Published Wed, Jul 6 2016 8:25 PM | Last Updated on Tue, Oct 16 2018 6:01 PM

Chandrababu naidu wishes muslim community on Ramazan

విజయవాడ : రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముస్లిం సోదరులకు ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. దాతృత్వానికి, సర్వమత సౌభ్రాతృత్వానికి ఈ రంజాన్ పండుగ  ప్రతీక అని ఆయన అభివర్ణించారు. ‘సర్వ మానవాళి శ్రేయోదాయకంగా ఉండాలన్న గొప్ప సందేశం రంజాన్‌ ఒక పర్వదినాన ముస్లిం సోదరుల ప్రార్థనలలో మనకు ద్యోతకమవుతుంది. సాటివారికి సాయపడాలనే స్ఫూర్తిని ప్రవక్త మహమ్మద్‌ ఆదేశానుసారం కొనసాగించడం రంజాన్ పండుగలో ఒక విశిష్టమైన ఆనవాయితీగా వస్తోంది’-అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

రాష్ట్రంలోని ముస్లింల సంక్షేమానికి ఈ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపిన ముఖ్యమంత్రి వారి అభివృద్ధికి రూ.710 కోట్లు బడ్జెట్‌ను కేటాయించామని గుర్తుచేశారు. మైనారిటీల సంక్షేమానికి అన్నివిధాలుగా కృషి చేస్తున్నామని పేర్కొంటూ, ముఖ్యంగా ముస్లిం మైనారిటీ వర్గాలకు ఇప్పుడు అమలుచేస్తున్నన్ని కార్యక్రమాలు, పధకాలు గతంలో ఎన్నడూ, ఎవరూ చేయలేదని అన్నారు. హజ్ హౌస్‌ల నిర్మాణం, ఉర్దూ యూనివర్శిటీ ఏర్పాటు, దుల్హాన్ పథకం, రంజాన్ తోఫా వంటి అంశాలు మైనారిటీల్లో ప్రభుత్వం పట్ల విశ్వాసాన్ని పెంచాయని చెప్పారు. దుల్హాన్ పథకం కింద పేద ముస్లిం యువతి వివాహానికి రూ.50 వేలు అందిస్తున్న ప్రభుత్వం తమదేనని అన్నారు.

రాష్ట్రంలో మసీదుల మరమ్మతులకు రూ.5 కోట్లు నిధులు విడుదల చేశామని ముఖ్యమంత్రి చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో మసీదుల మరమ్మతులకు రూ.10 వేలు, మండల కేంద్రాల్లో రూ.15 వేలు, మున్సిపాలిటీల్లో ఉన్న మసీదులకు రూ.20 వేలు చొప్పున మరమ్మతుల నిమిత్తం మంజూరు చేశామని వివరించారు. మసీదులలో పనిచేసే ఇమామ్‌లకు రూ.5 వేలు చొప్పున ప్రభుత్వం గౌరవ వేతనం ఇస్తుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రతి ముస్లిం సోదరుడి ఇంటా రంజాన్ పండుగ ఘనంగా చేసుకోవాలనే ఉద్దేశంతో మొత్తం 11 లక్షల ముస్లీం కుటుంబాలకు రంజాన్ చంద్రన్న తోఫా పంపిణీ చేశామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement