బాబు బౌలింగ్ చేయరు.. కిరణ్ బ్యాటింగ్ చేయరు!
-
వైఎస్ విజయమ్మ విమర్శ
-
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి
-
తుదికంటా పోరాడతామని ఉద్ఘాటన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు అసలు బౌలింగే చేయరని, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బ్యాటింగ్ చేయరని, అయినప్పటికీ ఇద్దరూ క్రీజ్‌లో ఉంటారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజన అంశాన్ని సీఎం క్రికెట్ ఆటతో పోల్చుతున్నారని విలేకరులు ప్రస్తావించినప్పుడు విజయమ్మ పైవిధంగా స్పందించారు. అసెంబ్లీలోని వైఎస్సార్ సీఎల్పీ కార్యాలయంలో గురువారం ఆమె విలేకరులతో ముచ్చటించారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే సమైక్యంగా ఉండాలని, అందుకే తమ పార్టీ సమైక్యంగా ఉంచాలని బలంగా కోరుకుంటోందని చెప్పారు. సమైక్యంగా ఉంచే విషయంలో చివరి వరకు పోరాటం చేస్తామన్నారు. అసెంబ్లీని సమావేశపరచి సమైక్య తీర్మానం చేయాలని తమ పార్టీ తొలి నుంచీ కోరుతోందని, అయినా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పెడచెవిన పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇపుడు విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చిన తరుణంలో కూడా తీర్మానం పెట్టడం లేదన్నారు. కృష్ణా జలాల పంపిణీలో రాష్ట్రానికి తీరని అన్యాయం జరగడానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే ప్రధాన కారణమని, ఆయన చరిత్రహీనుడిగా మిగిలిపోతారని ఆనాడే దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హెచ్చరించారని గుర్తుచేశారు. బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలను విలేకరులు ప్రస్తావించగా ‘చంద్రబాబు పరిస్థితులను బట్టి తన సిద్ధాంతాలను మార్చుకుంటూ ఉంటారు. గతంలో.. బీజేపీతో పొత్తు పెట్టుకుని తప్పు చేశానని అనేకసార్లు చెప్పిన బాబు ఇపుడు అదే బీజేపీతో పొత్తు కోసం వెంట పడుతున్నారు’ అని వ్యాఖ్యానించారు. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌పై ఢిల్లీకి వెళుతున్న అఖిలపక్షంలో తమ పార్టీ తరఫున పార్టీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎం.వి.ఎస్.నాగిరెడ్డి (రైతు విభాగం కన్వీనర్) ఉంటారని విజయమ్మ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
సమైక్య తీర్మానం ప్రవేశపెట్టాకే బిల్లుపై చర్చ చేపట్టాలి: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు
శాసన మండలిని తిరిగి ఎప్పుడు సమావేశపరిచినా.. ముందు సమైక్య తీర్మానం ప్రవేశపెట్టిన తరువాతనే విభజన బిల్లుపై చర్చ చేపట్టాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు మేకా శేషుబాబు, ఆదిరెడ్డి అప్పారావు డిమాండ్ చేశారు. వారు గురువారమిక్కడ మాట్లాడుతూ.. సమైక్య తీర్మానం ప్రవేశపెట్టే వరకూ.. సభను అడ్డుకుంటూనే ఉంటామని స్పష్టం చేశారు.