చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలన నరకాసురుని పాలనను తలపించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు తోట చంద్రశేఖర్ విమర్శించారు.
చంద్రబాబుది నరకాసుర పాలన
Published Mon, Feb 17 2014 2:01 AM | Last Updated on Sat, Sep 2 2017 3:46 AM
జంగారెడ్డిగూడెం, న్యూస్‌లైన్ :చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలన నరకాసురుని పాలనను తలపించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు తోట చంద్రశేఖర్ విమర్శించారు. సమైక్య శంఖారావంలో భాగంగా ఆదివారం జంగారెడ్డిగూడెంలోని తాండ్ర పాపారాయుడి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో కరువు విలయతాండవం చేసిందన్నారు. వర్షాలు లేక తాగునీరు, సాగునీరు కోసం రైతులు, ప్రజలు అల్లాడిపోయారన్నారు. తానేదో గొప్ప పాలన సాగించినట్లు నేడు ప్రజాగర్జనలు పెట్టి ప్రజలను మళ్లీ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆచరణ సాధ్యంకాని వాగ్దానాలు గుప్పిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు.
తాడేపల్లిగూడెంలో జరిగిన ప్రజాగర్జన సమయంలో జగన్‌మోహన్‌రెడ్డిని సైకోగా వర్ణించారని, అయితే విపరీత స్వభావం కలిగిన భయంకరమైన సైకో చంద్రబాబే అన్నారు. విద్యుత్ చార్జీలను తగ్గించాలని ఆందోళన చేస్తున్న రైతులను తుపాకులతో కాల్పించారని, అలాగే సమస్యల పరిష్కారం కోసం అంగన్‌వాడీ కార్యకర్తలు ఆందోళన చేస్తుంటే గుర్రాలతో తొక్కించిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానిదేనన్నారు. అలాగే దగ్గరకు చేరదీసి ఎంతో నమ్మకంతో తన కూతురినిచ్చి పెళ్లి చేసిన మామ ఎన్‌టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన మహాఘనుడు చంద్రబాబు అన్నారు. చంద్రబాబు తన తొమ్మిదేళ్ల పాలనలో ఏం అభివృద్ధి చేశారో, రైతులకు, పేదలకు ఏం మేలు చేశారో నిజాయితీతో చెప్పాలని డిమాండ్ చేశారు.
విశ్వసనీయతకు మారుపేరు వైఎస్సార్ అయితే, నమ్మకద్రోహానికి మారుపేరు చంద్రబాబు అన్నారు. రెండుకళ్ల సిద్దాంతంతో నేటి రాష్ట్ర పరిస్థితికి కారణమయ్యారన్నారు. కిరణ్‌కుమార్ రెడ్డి తుగ్లక్ పాలన చేస్తూ ప్రజలపై పన్నుల మీద పన్నులు విధిస్తున్నారన్నారు. వైసీపీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు మాట్లాడుతూ కాంగ్రెస్ వల్లే రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. దీనికి చంద్రబాబు కూడా కారకుడే అన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రజల మధ్యకు వస్తే తరిమికొట్టేందుకు సిద్దంగా ఉన్నారని బాలరాజు విమర్శించారు. వైఎస్సార్ పాలనలో అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి పథకాలు రాష్ట్రంలో అందని వారు ఎవరూ లేరన్నారు. కాని కిరణ్‌పాలనలో పథకాలకు కొత్తపేర్లు పెడుతూ, తానేదో ప్రజాకర్షణ పథకాలను అమలు చేస్తున్నానని ప్రచారం చేసుకుంటున్నారన్నారు.
చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త మద్దాల రాజేష్‌కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్‌కు జవసత్వాలు అందించిన వైఎస్సార్ కుటుంబాన్ని ఇబ్బందులు పాల్జేసింది టీడీపీతో కుమ్మక్కైన నేటి కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. సోనియా అనాలోచిత చర్యల వల్లే రాష్ట్రం విడిపోయే దుస్థితి దాపురించిందన్నారు. రాష్ట్రాన్ని సమైఖ్యంగాఉంచేందుకు జగన్‌మోహన్‌రెడ్డి అలుపెరుగని పోరాటం చేస్తున్నారన్నారు. పట్టణ కన్వీనర్ చనమాల శ్రీనివాసరావు, మండల కన్వీనర్ నులకాని వీరాస్వామినాయుడు అధ్యక్షతన జరిగిన సభలో నాయకులు పోల్నాటి బాబ్జి, బీవీఆర్‌చౌదరి, కొయ్యరాజారావు రెడ్డి, రావూరి కృష్ణ, అచ్యుత రామయ్య, మిడతా రమేష్, బాలస్వామి, బి.వెంకటేశ్వరరావు, కేమిశెట్టిమల్లిబాబు, మంగా రామకృష్ణ, రాఘవరాజు ఆదివిష్ణు, పాములపర్తి శ్రీనివాసరావు, ముప్పిడి అంజి, పాటిబండ్ల సుదర్శనం పాల్గొన్నారు.
Advertisement
Advertisement