
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబుకు టీడీపీ అభ్యర్థుల ఖరారు కంటే చినబాబు లోకేశ్‌ను ఎక్కడి నుంచి బరిలో దింపాలన్న అంశం కత్తిమీద సాములా మారింది. సురక్షిత స్థానంలో కొడుకు లోకేశ్‌ను పోటీ చేయించే విషయంలో రోజుకో లీకులిస్తూ తెగ హైరానా పడిపోతున్నారు. ఇప్పటికీ దాదాపు 10 నియోజకవర్గాల పేర్లు తెరపైకి రాగా.. ఏ సీటిస్తే ఎలాంటి ఫలితమొస్తుందోనన్న భయంతో ఉన్న చంద్రబాబుకు ఈ ఒక్క టికెట్ వ్యవహారం పెద్ద తలనొప్పిగా తయారైంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడినా లోకేశ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో స్పష్టం చేయకపోవడం ఆయనలోని ఆందోళనకు అద్దం పడుతుందని టీడీపీ వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి. గెలుపుపై భయంతోనే నియోజకవర్గం ఖరారుపై చంద్రబాబు దోబూచులాడుతున్నారని చెపుతున్నారు. ఇక లోకేశ్ బాబు కోసం తమ సీటుకు ఎసరు పెడితే కుదరదని, ఎక్కడైనా చినబాబే కానీ తమ సీటు వద్ద కాదని టీడీపీ నేతలు చెప్పడంతో ఈ గండం గట్టెక్కేదెలా అని చంద్రబాబు తలపట్టుకుంటున్నారు.
కుప్పం టు భీమిలి
తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నికల బరిలో దిగుతున్న లోకేశ్ కోసం తన నియోజకవర్గం కుప్పం సురక్షితమైందిగా చంద్రబాబు భావించారు. ఆ నియోజకవర్గాన్ని చినబాబుకు విడిచిపెట్టి తిరుపతి నుంచి చంద్రబాబు పోటీ చేస్తారని టీడీపీ వర్గాల్లో ప్రచారం సాగింది. ఇంతలో చంద్రబాబు పెద్ద యూటర్న్ తీసుకున్నారు. భీమిలి నియోజకవర్గం నుంచి లోకేశ్‌ను పోటీ చేయించే అంశాన్ని పరిశీలిస్తున్నామని లీకులిచ్చారు. అందుకు తగ్గట్లుగా అనుకూల మీడియాలో కాస్త హడావుడి చేశారు.
ప్రత్యక్ష ఎన్నికల్లో లోకేశ్ పోటీపై జంకుతున్న బాబు
2014 ఎన్నికల్లో లోకేశ్‌ను ఎమ్మెల్యేగా పోటీ చేయించేందుకు చంద్రబాబు సాహసించలేదు. అధికారంలోకి వచ్చిన రెండేళ్ల అనంతరం లోకేశ్‌ను మంత్రివర్గంలోకి తీసుకున్నా ఎమ్మెల్యేగా పోటీ చేయించే ఆలోచనే చేయలేదు. ఎమ్మెల్సీగా దొడ్డిదారిన చట్టసభల్లోకి పంపించి ఊపిరి పీల్చుకున్నారు. ఈ సారైనా ప్రత్యక్ష ఎన్నికల్లో తలపడకపోతే జనాల్లో పరువుపోతుందని భయపడి.. 2019 ఎన్నికల్లో లోకేశ్ పోటీ చేస్తారని లీకులిస్తూ వచ్చారు. లోకేశ్ కోసం రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున సర్వేలు చేయించారు. చంద్రగిరి, బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపూర్‌తోపాటు గుంటూరు జిల్లాలో మంగళగిరి, పొన్నూరు, పెదకూరపాడు, కృష్ణా జిల్లాలో పెనమలూరు, గుడివాడ ఇలా పలు నియోజకవర్గాల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఇంతలో నెల్లూరు జిల్లా సర్వేపల్లి టిక్కెట్ ఖరారు కావడంతో మంత్రి సోమిరెడ్డితో ఎమ్మెల్సీకి రాజీనామా చేయించగా.. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానన్న రామసుబ్బారెడ్డిని ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయమన్నారు. మరైతే 2019 ఎన్నికల్లో పోటీ చేయించాలని నిర్ణయించాక.. లోకేశ్ కూడా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలి. ముందు జాగ్రత్తో ఏమో.. చినబాబు విషయంలో ఆ నీతి వర్తించలేదు.
నొచ్చుకున్న లోకేశ్ తోడల్లుడు భరత్
మరోవైపు అదే అంశం చంద్రబాబు – బాలకృష్ణ కుటుంబాల్లోనూ ఇంటిపోరుకు తెరతీసింది. విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి హఠాన్మరణంతో ఆయన మనవడు భరత్ రాజకీయ అరంగేట్రం చేశారు. బాలకృష్ణ రెండో అల్లుడు, లోకేశ్ తోడల్లుడైన భరత్ తనకు టిక్కెట్టు వస్తుందన్న ధీమాతో విశాఖపట్నం ఎంపీగా పోటీకి కొన్ని నెలలుగా సన్నాహాలు చేసుకుంటున్నారు. లోకేశ్‌ను భీమిలి బరిలో దింపాలనుకున్న చంద్రబాబు భరత్‌కు హ్యాండిచ్చారు. తోడల్లుళ్లు ఇద్దరిలో ఒకరు భీమిలిలో, మరొకరు విశాఖపట్నంలో పోటీచేస్తే రాజకీయంగా ప్రతికూలతని సందేహించారు. లోకేశ్, భరత్‌లు ఇద్దరికీ అవకాశం ఇస్తే విశాఖపట్నం తూర్పు అభ్యర్థి వెలగపూడి రామకృష్ణతో కలిపి విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో కమ్మ సామాజికవర్గానికి చెందిన ముగ్గురికి టిక్కెట్లు ఇచ్చినట్లవుతుంది. విశాఖపట్నంలో అతి తక్కువుగా ఉండే ఆ సామాజికవర్గానికి అంత ప్రాధాన్యమిస్తే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని వెనక్కితగ్గారు
– వడ్డాది శ్రీనివాస్
సాక్షి, అమరావతి