చంద్రబాబు నిలువెత్తు ఫొటో ఉన్న పింఛను పుస్తకం
రాష్ట్ర ప్రభుత్వాలు అందించే దాదాపు మూడొంతుల సంక్షేమ పథకాలు కేంద్ర ప్రభుత్వం సమకూర్చే నిధులతో అమలయ్యేవే. చాలా పథకాల అమలులో కేంద్ర ప్రభుత్వం తన వంతు నిధులు విడుదల చేసినా రాష్ట్ర ప్రభుత్వాలు తన వంతు విడుదల చేయకపోవడం వల్ల పంపిణీలో తాత్సారం కావడం, కొన్నిసార్లు పూర్తిగా విఫలమవడం జరుగుతూ ఉంటుంది. ఇదే కోవలోకి వస్తాయి పలు పింఛన్ల పథకాలు. కేంద్ర ప్రభుత్వం అందించే పథకాల గుర్తింపు పత్రాలపై సైతం ‘అన్నీ నావల్లే’ అని డబ్బాలు కొట్టుకునే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన నిలువెత్తు ఫొటోలను ముద్రించేసుకున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు ఎన్నికల కోడ్ అమలును అపహాస్యం చేస్తోంది. పింఛను లబ్ధిదారుల గుర్తింపు కార్డులపై ఉండే చంద్రబాబు ఫొటోలు ఓటర్లను ప్రభావితం చేస్తాయని విపక్షాలు వాదిస్తున్నాయి.
రాజమహేంద్రవరం రూరల్: ప్రతి నెలా వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, చేనేత, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు, ట్రాన్స్‌జెండర్స్, ఫిషర్‌మన్, పాపులర్స్ ఇలా అనేకమంది పింఛన్‌దారులు ప్రతి నెలా సామాజిక ఫించన్లు తీసుకుంటున్నారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకూ తీసుకునే పింఛన్లకు మాత్రం ఓ ప్రత్యేకత ఉంది. పింఛన్లు తీసుకునే నాటికి ఎన్నికలకు ఐదు రోజులు మాత్రమే సమయం ఉంటుంది. మరి చంద్రబాబు పింఛన్లు ఇస్తున్నట్లు పింఛన్ పుస్తకాలపై ప్రచారం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. మరి దీనిపై ఎన్నికల కమిషన్ ఎటువంటి చర్యలు తీసుకోనుందనే సందేహం విపక్షాలతో పాటు ప్రజల్లో నెలకొంది.
జిల్లాలో 5,86,808 మంది పింఛనర్లు
జిల్లాలో అన్నిరకాల పింఛనర్లు కలిపి 5,86,808 మంది ఉన్నారు. వారి కుటుంబాల్లోని వ్యక్తులను కలిపితే దాదాపు 18 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. పింఛన్లు ఇచ్చే సమయంలో చంద్రబాబు నేనే ఇస్తున్నానని ప్రకటించడంతో పాటు ఆయన అనుకూల మీడియా ద్వారా ప్రచారం హోరెత్తిస్తే ఓటర్లపై తీవ్ర ప్రభావం ఉండే అవకాశం ఉంది. మరి దీనిపై ఇతర పార్టీల నాయకులు అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు ఈఅంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పింఛన్ పుస్తకం ఎప్పుడూ ఇంటిలోనే ఉంటుందని, అప్పుడు గుర్తురాదా అని కొందరు వాదిస్తున్నారు.
కానీ నెలంతా పనిచేసినా ఒకటో తేదీన జీతం వస్తుంది. ఆ సమయంలో మాత్రమే యజమాని జీతం ఎప్పుడిస్తాడా అని గుర్తు చేసుకుంటారు. మిగిలిన సమయంలో మాత్రం పనిలోనే నిమగ్నమవుతారు. అలాగే ఒకటి నుంచి ఐదో తేదీ లోపు మాత్రమే లబ్ధిదారులు పింఛన్ పుస్తకాన్ని గుర్తుచేసుకుంటారు తప్ప నెలంతా పుస్తకాన్ని ముందు పెట్టుకుని కూర్చునే పరిస్థితి ఉండదని కొందరి వాదన. ఎందుకంటే పింఛన్ తీసుకున్న ఐదు రోజులకే ఎన్నికలు జరగనున్నాయి. అందువల్ల పింఛన్ పుస్తకాలు ఎన్నికల్లో ప్రభావం చూపించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. దీనిపై మాత్రం ఎన్నికల అధికారులు సరైన చర్యలు తీసుకోవాలంటూ పలు పార్టీల నాయకులు డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. దారిలో కనిపించే విగ్రహాలనే తొలగిస్తున్నప్పుడు వీటిని ఎలా అనుమతిస్తారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
టీడీపీ కరపత్రంగా పింఛన్ పుస్తకం
పింఛన్లు నమోదు చేసే పుస్తకాలు పసుపురంగుతో, చంద్రబాబు ఫొటోతో టీడీపీ కరపత్రాల్లా ఉంటాయి. మరి ఎన్నికల అధికారులు వాటిని ఏరకంగా పరిగణనలోనికి తీసుకుంటారనే అనుమానం కలుగుతుంది. చంద్రబాబు ఏపనిచేసినా తన ప్రచారం, తన స్వార్థం లేనిదే ఏ పనీ తలపెట్టరనే విషయం అందరికి తెలిసిందే. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం హయాంలో వృద్ధాప్య పింఛన్లు అందించే వారు. కానీ ఎక్కడా ఎటువంటి ప్రచారం కనిపించలేదు. ఆ పింఛన్ పుస్తకాలపై ప్రభుత్వ ముద్రలేకుండా ఇచ్చేవారు. చంద్రబాబు మాత్రం కేంద్రం నిధులతో ఇస్తున్న పింఛన్లను కేంద్రం పెద్దల ఫొటోలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు. మొన్నటి వరకూ పింఛన్లు వెయ్యి రూపాయలే ఇచ్చేవారు.
అయితే వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాల్లో పింఛన్ మొత్తాన్ని రూ.రెండువేలకు పెంచుతామని ప్రకటించారు. దీంతో ఆ పథకాన్ని కాపీ కొట్టిన చంద్రబాబు ఎన్నికల్లో ప్రజల ఓట్లు దండుకునేందుకు మూడు నెలల క్రితం రూ.రెండు వేలకు పెంచారు. నాలుగున్నరేళ్లుగా పింఛన్‌దారులను పట్టించుకోని చంద్రబాబు ఎన్నికల్లో ప్రజల ఓట్లు దండుకునేందుకు ఈ ఏడాది జనవరి నుంచి పింఛన్‌ను రూ.రెండు వేలకు పెంచారు. ఆ తరువాత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత పింఛన్ మొత్తాన్ని రూ.మూడు వేలకు పెంచుతామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment