ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు రవీంద్రనాథరెడ్డి
వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే ప్రభుత్వంలో విలీనం
చిత్తూరు : పైసా నిధులివ్వకుండా ఆర్టీసీని ఇప్పటికే నిర్వీర్యం చేసిన చంద్రబాబు త్వరలోనే ఆర్టీసీని కేశినేని ట్రావెల్స్‌కో, జేసీ బ్రదర్స్‌కో అమ్మేస్తారని వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథరెడ్డి ఆరోపించారు. చిత్తూరులో కొత్త బస్టాండు ఆవరణలో శుక్రవారం వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ ఎన్నికల బహిరంగ సభ జరిగింది. రవీంద్రనాథరెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ పుట్టిందే ప్రజల కోసమని, అది మనుగడ సాగించాలంటే ప్రభుత్వ సాయం తప్పనిసరని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వల్లే ఆర్టీసీ అభివృద్ధి చెందిందన్నారు. 10 వేల మంది కార్మికులను రెగ్యులర్ చేసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. చంద్రబాబు గతంలో తొమ్మిదేళ్ల పాలనలో ఆర్టీసీ అభివృద్ధికి పైసా ఇవ్వకపోగా, ఆర్టీసీని ఏకంగా రిలయన్స్‌కు అమ్మజూపారన్నారు. సీఎంగా అనుభవం లేని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికులకు 44 శాతం జీతాలు పెంచడంతో పాటు వెయ్యి కోట్ల రూపాయలు నిధులు ఇచ్చారన్నారు. అనుభవం ఉన్న చంద్రబాబు 43 శాతం జీతాలు పెంచినట్లు ప్రకటించి పైసా నిధులు ఇవ్వక మోసం చేశారన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే హమీ ఇచ్చారన్నారు. ఆర్టీసీ బతకాలంటే కార్మికులు ఈ నెల 18న జరిగే ఎన్నికల్లో వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్‌కు మద్దతు పలకాలని కోరారు.
ఆర్టీసీ మనుగడ కోసం వైఎస్‌ఆర్‌సీపీని గెలిపించండి
ఆర్టీసీ మనుగడ సాగించాలంటే వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్‌ను గెలిపించాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజారెడ్డి అన్నారు. అన్ని యూనియన్ల కార్మికులు పార్టీలకతీతంగా వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్‌కు మద్దతు పలకాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్‌రెడ్డి కోరారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఆర్టీసీని పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు. పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను వంచించిందన్నారు. ఆర్టీసీ కార్మికులు వైఎస్‌ఆర్ చేసిన మేలును మరవకూడదని జీడీనెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి అన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయితే ఆర్టీసీకి పూర్వ వైభవం వస్తుందన్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు గాయత్రీదేవి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆర్టీసీ మహిళా కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. వారికి కనీసం విశ్రాంతి గదులు కూడా లేవన్నారు.
చిత్తూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ జేఎంసీ శ్రీనివాసులు మాట్లాడుతూ ఆర్టీసీ అభివృద్ధి కోసం వైఎస్సారీసీపీ చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. సత్యవేడు నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆదిమూలం మాట్లాడుతూ జగన్మోహన్‌రెడ్డి ఆర్టీసీ అభివృద్ధి సాధ్యమన్నారు. సమావేశంలో నాయకులు చక్రపాణిరెడ్డి, భాగ్యలక్ష్మీ, జయరామిరెడ్డి, నారాయణ, శేఖర్, సయ్యద్, జగదీష్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబు ఆర్టీసీని అమ్మేస్తారు
Published Sat, Feb 13 2016 1:46 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM
Advertisement
Advertisement