'లోకేష్ రాజ్యాంగేతర శక్తిగా మారాడు'
హైదరాబాద్ : టీడీపీ చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ రాజ్యాంగేతర శక్తిగా మారారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇటీవలే టీడీపీలో చినబాబును పార్టీ ఎఫైర్స్ ఇన్ఛార్జ్గా నియమించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ రంగ సంస్థలను చంద్రబాబు నాయుడు నిర్వీర్యం చేశారని శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. ఆయన సోమవారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ నష్టాలను బూచిగా చూపి ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అర్టీసీ, జెన్కోలను ప్రైవేటీకరించే కుట్ర జరుగుతోందని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.
దేశవ్యాప్తంగా 84 ప్రభుత్వరంగ సంస్థలు మూతపడితే వాటిలో 54 చంద్రబాబు హయాంలోనే మూతపడ్డాయని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. తనవారికి కట్టబెట్టేందుకు కమిటీలు ఏర్పాటు చేస్తారన్నారు. పాలేరు షుగర్స్‌ను చంద్రబాబు మధుకాన్ సంస్థకు కారుచౌకగా కట్టబెట్టారని ఆయన ధ్వజమెత్తారు. ప్రభుత్వపరంగా సంస్థలను పచ్చ చొక్కాలను అప్పజెప్పారన్నారు. మళ్లీ ఇప్పుడు అదే పంథా కొనసాగుతోందన్నారు.
ఇందులో భాగంగానే జీఓ నెంబర్ 289,290 పేరుతో కోవూరు షుగర్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరించే ప్రయత్నాలు చేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వరంగ సంస్థల్లో పందికొక్కుల్లా దోచుకు తింటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ప్రయివేటీకరణను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుందన్నారు. ప్రైవేటీకరణను అలా గొప్పగా చెప్పుకోవటం దారుణమన్నారు.