రామానాయుడు రోడ్డులో గుంత పక్కనే నాటకుండా వదిలేసిన మొక్కలు
ఆయన వస్తారని చెట్లకు, గోడలకు రంగులు పూశారు... రోడ్లపై పడిన గుంతల్లో క్రషర్ బుగ్గి కుమ్మరించారు... నెలల తరబడి రోడ్డు పక్కన పేరుకుపోయిన మట్టి దిబ్బలు తొలగించారు... కాలువల్లో పూడికలు తొలగించారు... అదే కాలువలపై పలకలు వేయించారు... ఇవే గాకుండా పాత రోడ్లపై కొత్త తారు వేయించేందుకు సంకల్పించటం... రోడ్ల మధ్య డివైడర్లలో మొక్కలు నాటించటంలాంటి పనులు చేపట్టేందుకు నిర్ణయించారు. ఇంత వరకు బాగానే ఉన్నా ఈ నెల 14న జిల్లాకు రావాల్సిన ముఖ్యమంత్రి పర్యటన రద్దు అయిందన్న ప్రకటన అనంతరం చేపట్టిన పనులన్నీ ఎక్కడివి అక్కడే వదిలేశారు. ఇప్పుడవే పట్టణ ప్రజలకు ఇబ్బందులుగా మారాయి.
విజయనగరం మున్సిపాలిటీ : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాకు వస్తారని... ఆయన వద్ద మార్కులు కొట్టేయడానికి పట్టణంలో అభివృద్ధి పనుల పేరిట హడావుడి చేసిన యంత్రాంగం సీఎం పర్యటన రద్దు అనంతరం ఆ పనులను పట్టించుకోకుండా వదిలేయడం విమర్శలకు తావిస్తోంది.
ముఖ్యమంత్రి వస్తేనే పనులు చేపడతారా అన్న ప్రశ్నలు పట్టణ ప్రజల నుంచి తలెత్తుతున్నాయి. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మున్సిపాలిటీలో అభివృద్ధి పనుల ప్రగతి, ప్రజా సమస్యల పరిష్కారంపై పట్టించుకోని పాలకులు, అధికార యంత్రాం గం చంద్రబాబు పర్యటన ప్రకటన వెలువడినప్పటి నుంచి చేసిన హడావుడి చర్యలు చూసి పట్టణ ప్రజలే నిర్ఘాంత పోయారు.
అర్ధంతరంగా ఆగిన రూ. 3కోట్ల పనులు
ఎన్నడూ లేని విధంగా విజయనగరం మున్సిపాలిటీ చేపట్టే అభివృద్ధి పనుల కోసం రూ.3 కోట్లు నిధులు కేటాయించారు. ఈ నిధులతో కేవలం ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాల్లో పలు ఆర్భాటపు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా గల మీసేవా కేంద్రానికి బీటీ రోడ్డు నిర్మాణం నాణ్యత ప్రమాణాలకు తిలోదకాలు ఇచ్చి జోరు వర్షంలో మమ అనిపించేశారు.
ఇక ఎల్‌ఐసీ కార్యాలయం ఎదురుగా ఉన్న పెద్ద చెరువుకు గట్టు ఎక్కేందుకు మెట్ల మార్గం నిర్మాణం అసంపూర్తిగా వదిలేయగా... రామానాయుడు రోడ్డులో నాటేందుకు కడియం నుంచి తెచ్చిన మొక్కలు ఇప్పటికీ తవ్విన గుంతల పక్క నే పడి ఉన్నాయి. ఎత్తుబ్రిడ్జిపై సంతకాల వంతెనకు ఆనుకుని వేయతలపెట్టిన నూతన రోడ్డు నిర్మాణం పనులు మధ్యలోనే నిలిచిపోయాయి.
అవస్థలు పడుతున్న నగరవాసులు
ఆర్‌అండ్‌బీ ఆధ్వర్యంలో చేపడుతున్న పనులు మెటల్ వేసిన అనంతరం పట్టించుకోకపోవటం తో ఆ మార్గంలో ప్రయాణం నరకప్రాయంగా మారింది. నిత్యం వందల సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగించే అంతర్రాష్ట్రీయ రహదారి కావటంతో వాహనాల తాకిడికి క్రషర్ ధూళి ఎగసిపడుతుండటం వాహనచోదకులకు ఇబ్బందికరంగా మారుతోంది. ఇదిలా ఉండగా ఎత్తుబ్రిడ్జి నుం చి ముఖ్యమంత్రి బస చేసే ప్రాంగణ సమీపం కలెక్టరేట్ జంక్షన్ వరకు గుంతలు పడిన రోడ్లలో వేసిన క్రషర్ బుగ్గి అప్పుడే తేలిపోయింది.
నాలు గు రోజులుగా కురిసిన వర్షాలకు క్రషర్ బుగ్గి పోయి యథావిధిగా గుంతలు దర్శనమిస్తున్నాయి. చేపట్టిన పనులపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా ఇదే అభివృద్ధి పనులపై ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రత్యక్షంగానే ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రి ఒక్కపూట పర్యటన కోసం కేటాయించిన రూ. 3 కోట్లు నిధుల పనుల్లో భారీ అవినీతి దాగి ఉందని విమర్శిస్తున్నారు.
కొద్ది పనులు పెండింగ్‌లో ఉన్నాయి
ముఖ్యమంత్రి పర్యటన రద్దు అనంతరం కొద్ది పనులు ముగిసిపోయాయి. డివైడర్లలో మొక్కలు నాటేందుకు లేబర్ దొరకటం లేదు. పెద్ద చెరువు గట్టుపై నూతనంగా నిర్మించిన మెట్ల మార్గం అభివృద్ధి పనుల ప్రణాళిక మారటంతో పనులు నిలిపివేశాం. అచంటా గార్డెన్స్‌గా పిలుచుకుంటున్న గట్టును పూర్తి స్థాయిలో అభివృద్ధికి నిర్ణయించాం. ఇక ఎత్తుబ్రిడ్జిపై రోడ్డు పునఃనిర్మాణం పనులు, గుంతలు కప్పటం ఆర్‌అండ్‌బీ అధికారులు చూస్తున్నారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన పనులు రెండు మూడు రోజుల్లో పూర్తి చేస్తాం.
– టి.వేణుగోపాల్, కమిషనర్, విజయనగరం మున్సిపాలిటీ
Comments
Please login to add a commentAdd a comment