
ఆ శాసనాలు వెనక్కి రప్పిస్తాం
ఆంధ్రప్రదేశ్ ప్రాంతం నుంచి దేశ విదేశాలకు తరలిపోయిన శిలాశాసనాలను వెనక్కి రప్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.
సీనియర్ పాత్రికేయుడు పొత్తూరి పుస్తకావిష్కరణ సభలో సీఎం
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రాంతం నుంచి దేశ విదేశాలకు తరలిపోయిన శిలాశాసనాలను వెనక్కి రప్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. రాష్ట్రానికి చెందిన శిలాశాసనాలు, కళాఖండాలు లండన్, చెన్నై, హైదరాబాద్ మ్యూజియాల్లో ఉన్నాయని, వాటిని తెప్పించి అమరావతిలో మ్యూజియం నిర్మించి అక్కడ వాటిని ఉంచుతామని చెప్పారు. శుక్రవారం విజయవాడలోని శేషసాయి కల్యాణమండపంలో సీనియర్ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వరరావు రచించిన ‘అమరావతి ప్రభువు వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు’ పుస్తకాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. జపాన్‌లో తాను పర్యటించినపుడు అమరావతి నుంచే బౌద్ధం తమ దేశానికి వచ్చిందని జపనీయులు చెప్పారని తెలిపారు. రాష్ట్ర విభజన తరువాత కొత్త రాజధానికి పలు పేర్లు పరిశీలించామని, అమరావతి అనే పేరు పెట్టాలని ఈనాడు అధినేత రామోజీరావు సూచించారని వెల్లడించారు. అమరావతిపై పొత్తూరి వెంకటేశ్వరరావు సహా అనేకమంది సూచనలు చేశారన్నారు. పుస్తక రచయిత పొత్తూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. వెంకట్రాదినాయుడిపై దుష్ర్పచారం జరిగిందని, తాను పుస్తకం రాసేటప్పుడు అనేక చారిత్రక ఆధారాలను పరిశీలించి, ఎన్నో అధ్యయనాలు చేశానని తెలిపారు.
బ్యాంకింగ్ కరస్పాండెంట్లుగా డ్వాక్రా మహిళలు
స్వయం సహాయక సంఘాలకు చెందిన 27 వేల మందిని బ్యాంకింగ్ కరస్పాండెంట్లుగా నియమించుకునేందుకు ఆంధ్రాబ్యాంకు ముందుకొచ్చినట్లు సీఎంవో మీడియా విభాగం తెలిపింది. శుక్రవారం సీఎంతో జరిగిన సమావేశంలో ఆంధ్రాబ్యాంకు ప్రతినిధులు ఈ మేరకు వారు అంగీకరించినట్లు పేర్కొంది.