
చంద్రబాబుపై అట్రాసిటీ కేసు
పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి డిమాండ్
కులాల మధ్య చిచ్చు పెట్టేలా సీఎం వ్యాఖ్యలు చేయడం దారుణం
పాడేరు : దళితులను కించపరిచే విధంగా అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి డిమాండ్ చేశారు. మంగళవారం ఆమె ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ‘ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారని’ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వివక్ష పూరిత వ్యాఖ్యలను ఆమె ఖండించారు. ఎస్సీ, ఎస్టీలపై చంద్రబాబు వివక్షకు ఆయన వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. ఎస్సీ, ఎస్టీలను సీఎం మనుషులుగా చూడడం లేదని, కులాల మధ్య చిచ్చుపెట్టవ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమంపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు.
బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తూ జీవో 97ను రద్దు చేయాలని చింతపల్లిలో జరిగిన బహిరంగ సభలో డిమాండ్ చేస్తే తన వ్యాఖ్యలను వక్రీకరించి కేసులు బనాయించారని ధ్వజమెత్తారు. ప్రజాభీష్టాన్ని, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తుంగలోకి తొక్కి చంద్రబాబు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. కాపులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా బీసీలకు, కాపులకు మధ్య చిచ్చు పెట్టేలా ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఎస్సీలపై చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
బాక్సైట్ కోసమే అవుట్ పోస్టులు
మన్యంలో గిరిజనులంతా బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం మాత్రం తవ్వకాల కోసం ప్రయత్నాలు కొనసాగిస్తుందని ఎమ్మెల్యే ఈశ్వరి ఆరోపించారు. బాక్సైట్ తవ్వకాల కోసమే చింతపల్లి, జీకేవీధి మండలాల్లోని మారుమూల ప్రాంతాల్లో కొత్తగా అవుట్ పోస్టుల ఏర్పాటు చేస్తున్నారన్నారు. దీని వల్ల జీవనోపాధి పొందుతున్న భూములను కోల్పోతామని, అక్కడ అవుట్ పోస్టు ఏర్పాటును విరమించాలని రాళ్ళగెడ్డలో గిరిజనులు కోరుతున్నా పట్టించుకోవడం లేదన్నారు.