రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ శాఖలకు నూతన నాయకత్వాన్ని ఎన్నుకునేందుకు సీపీఐ సన్నాహాలు చేస్తోంది.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ శాఖలకు నూతన నాయకత్వాన్ని ఎన్నుకునేందుకు సీపీఐ సన్నాహాలు చేస్తోంది. ఇందుకు పార్టీ రాష్ట్ర సమితి హైదరాబాద్‌లో ఈ నెల 23 లేదా 24 తేదీల్లో భేటీ కానుంది. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ఎన్నికల్లో పార్టీ పనితీరు, పార్టీ పునర్నిర్మాణం ఎజెండాగా జరిగే ఈ సమావేశాల్లో ఇప్పటివరకు ఉమ్మడి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న నారాయణ స్థానంలో ఉభయ రాష్ట్రాలకు కొత్త కార్యదర్శులు ఎన్నికవుతారు. నారాయణ ఇంతకుముందే తనను పదవీ బాధ్యతల నుంచి విముక్తం చేయమని పార్టీ కార్యదర్శివర్గాన్ని కోరినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగే జూన్ 2 వరకు వాయిదా వేశారు. ఈలోపు జరిగిన పరిణామాలు నారాయణను బాగా కలచివేశాయి. ఖమ్మం లోక్‌సభ స్థానంలో తన ఓటమి, రెండు రాష్ట్రాల్లోనూ పేలవమైన పార్టీ పనితీరుతో కలత చెందిన ఆయన త్వరగా పార్టీ పదవి నుంచి తప్పుకోవాలని భావిస్తున్నారు. కొత్తగా వచ్చే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో సీపీఐకి ప్రాతినిధ్యం లేకపోవడం పార్టీ నేతల్ని ఆవేదనకు గురిచేస్తోంది. శాసనమండలిలో మాత్రం ఏకైక సభ్యుడు పీజే చంద్రశేఖర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో జరగనున్న పార్టీ రాష్ట్ర సమితి సభ్యుల సమావేశం కొత్త నాయకత్వాన్ని ఎన్నుకోనుంది.
నారాయణతో క్షమాపణ చెప్పించండి: రాఘవులు
తనను ఓడించేందుకు సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పి.శ్రీనివాసరెడ్డి నుంచి కోట్ల రూపాయలు తీసుకున్నారని ఖమ్మం ప్రజలు చెప్పుకుంటున్నారంటూ ఆరోపించిన నారాయణపై చర్య తీసుకోవాల్సిందిగా సీపీఐ జాతీయ నాయకత్వాన్ని సీపీఎం కోరింది. ఈ మేరకు సీపీఎం పాలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు.. సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డికి లేఖ రాశారు. నిరాధార ఆరోపణ చేసినందుకు నారాయణతో క్షమాపణ చెప్పించి ఈ వివాదానికి ఇంతటితో ముగింపు పలకాలని అందులో కోరారు. లేఖ ప్రతిని నారాయణకు, సీపీఎం కేంద్ర కమిటీకి కూడా పంపారు.