
మాస్టర్ ప్లాన్‌లో మార్పులు!
చంద్రబాబు కనుసన్నల్లో సాగుతున్న డిజైన్
సింగపూర్‌కు నేడు మంత్రి నారాయణ
హైదరాబాద్: ఏపీ రాజధాని మాస్టర్ ప్లాన్‌లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. సీఎం చంద్రబాబు చేసిన సూచనల మేరకు మార్పులు చేర్పులను పరిశీలించడానికి మంత్రి నారాయణ శుక్రవారం సింగపూర్ బయలుదేరుతున్నారు. మంత్రి పర్యటనను ప్రభుత్వం గురువారం వెల్లడించింది. సీఆర్‌డీఏ ప్రణాళికాధికారి జి.నాగేశ్వరరావు, సీఆర్‌డీఏ సంచాలకులు వి.రాముడు, మంత్రి వ్యక్తిగత కార్యదర్శి పి.గోపీనాథ్‌లు కూడా నారాయణ వెంట వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతించింది.
ఈ క్రమంలో ముగ్గురు అధికారులనూ విధుల నుంచి తక్షణమే రిలీవ్ చేయాలని సీఆర్‌డీఏ కమిషనర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. కాగా, రాజధాని మాస్టర్ ప్లాన్ మొత్తం సీఎం కనుసన్నల్లోనే సాగుతోందని, మార్పు చేర్పులు పరిశీలించడానికి మంత్రి నారాయణ త్వరలోనే సింగపూర్ వెళ్లనున్నారని ‘సాక్షి’ ఇటీవలే చెప్పిన విషయం ఈ సందర్భంగా గమనార్హం.
సీడ్ కేపిటల్ పరిధి పెంచే యోచన
రాజధానిలోని 8 చదరపు కిలో మీటర్ల సీడ్ కేపిటల్(ప్రధాన రాజధాని ప్రాంతం) పరిధిని 14 చదరపు కిలోమీటర్లకు పెంచడానికి మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు చేస్తున్నట్టు తెలిసింది. ఆ మార్పులు చేయించడానికే మంత్రి సింగపూర్ వెళుతున్నట్టు సమాచారం.
13న సింగపూర్‌కు సీఎస్ బృందం :ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) కృష్ణారావు నేతృత్వంలోని అధికారుల బృందం కూడా సింగపూర్ పర్యటనకు వెళ్లనుంది. సీఎస్‌తోపాటు ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ పీవీ రమేష్, ప్రణాళిక శాఖ ప్రత్యేక కార్యదర్శి సంజయ్‌గుప్తాలు ఈ నెల 13 నుంచి 15 వరకు సింగపూర్‌లోని ఆర్థికాభివృద్ధి బోర్డు(ఈడీబీ)తోపాటు ముఖ్యమైన ఆర్థిక సంస్థల పనితీరును పరిశీలిస్తారు.
అమెరికాకు అజయ్‌జైన్
ఇంధన శాఖ కార్యదర్శి అజయ్‌జైన్ ఈ నెల 11 నుంచి 13 వరకు అమెరికాలో పర్యటించనున్నారు. వాషింగ్‌టన్ డీసీలో జరగనున్న ఎనర్జీ ఎఫిషియన్సీ గ్లోబల్ ఫోరం సదస్సులో పాల్గొంటారు. ఇక, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ విభాగం కార్యదర్శి బి.శ్రీధర్ ఈ నెల 13 నుంచి 15 వరకు జపాన్‌లో పర్యటించనున్నారు.