ఉపాధికి దూరం చేసిపొట్టకొట్టారన్న కూలీలు
రహదారిపై మహిళల బైఠాయింపు, రాస్తారోకో
మున్సిపల్ కమిషనర్ ఘెరావ్
యలమంచిలి : ‘యలమంచిలిని మునిసిపాలిటీగా మార్చడంతో మా తలరాతలు మారిపోయాయి. రెండు పూటలా తిండికి నోచుకోని దుర్భర పరిస్థితిలో పనుల్లేక ఆకలితో అలమటిస్తున్నాం. మా గ్రామాలను మునిసిపాలిటీ నుంచి తొలగించి పుణ్యం కట్టుకోండి. ఎంత మంది అధికారుల చుట్టూ తిరిగినా ఎవరూ మా బాధ పట్టించుకోవడంలేదు. మూకుమ్మడిగా ఆత్మహత్యలే శరణ్యం..’ అంటూ పట్టణం పరిధిలోని సోమలింగపాలెం, కొక్కిరాపల్లి, వెంకటాపురం, వి.ఎన్.పేట, గొల్లలపాలెం మహిళలు బుధవారం మునిసిపల్ కార్యాలయం ఎదుట ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. ఒకవైపు ఉపాధి హామీ పథకానికి దూరమై అవస్థలు పడుతుంటే, మరోవైపు ఆస్తిపన్ను మోతతో రెండు వైపులా ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ మహిళలు వాపోయారు. ఇందుకు నిరసనగా మున్సిపల్ కార్యాలయం వద్ద కమిషనర్ శ్రీనివాసరావును ఘెరావ్‌చేశారు. పేదలమైన తమకు ఉపాధి హామీ పథకం ఆకలితీర్చేదని, దానికి దూరం చేసి రోడ్డున పడేశారంటూ బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.
తమ గ్రామాలను మునిసిపాలిటీ నుంచి తొలగించాలని మహిళలు మున్సిపల్ కమిషనర్‌ను కోరారు. ఆస్తిపన్ను కూడా తగ్గించాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకానికి ప్రత్యామ్నాయం చూపుతామని, మీఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని మునిసిపల్ కమిషనర్ వారికి చెప్పారు. మరోసారి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఆందోళనకారులు ప్రధాన రహదారిపై బైఠాయించి వాహనాల రాకపోకలు అడ్డుకోవడంతో గంటకుపైగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులకు నచ్చజెప్పి కమిషనర్‌తో చర్చలు జరిపేందుకు ఆహ్వానించారు. ఈ చర్చల్లో మహిళలు ఉపాధి హామీ పథకం అమలుకాకపోవడంతో తాము ఎలా ఇబ్బంది పడుతున్నదీ వారు కమిషనర్‌కు వివరించి కన్నీటి పర్యంతమయ్యారు.
ఆకలి కేకలు
Published Wed, Feb 17 2016 11:49 PM | Last Updated on Sun, Sep 3 2017 5:50 PM
Advertisement