మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం సోమవారం నుంచి ప్రారంభమైనా తెలుగుదేశం పార్టీ ఇంత వరకు అభ్యర్థులను ప్రకటించలేదు. ఈ విషయంలో తెలుగుతమ్ముళ్లలో అయోమయం నెలకొంది. మున్సిపల్ చైర్మన్ పదవిని ఎవరికి ఇస్తారనే విషయం ఇంకా తేలలేదు. స్థానిక ఎమ్మెల్యే మల్లేల లింగారెడ్డి పార్టీ జిల్లా అధ్యక్షునిగా కూడా పనిచేస్తున్నారు.
2009 ఎన్నికల్లో జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాల్లో ప్రొద్దుటూరు అసెంబ్లీ స్థానం మాత్రమే పార్టీ గెలుచుకుంది. జిల్లా అధ్యక్షుడు ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రొద్దుటూరు మున్సిపాలిటీలోనే పరిస్థితి ఇలా ఉండటం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి తెలుగుదేశంలో చేరాలని నిర్ణయించుకోవడంతో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుతో సంప్రదింపులు జరుపుతున్నారు. నేడో రేపో వరద తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు.
ఎలాంటి హామీ లేకున్నా వరదరాజులరెడ్డి తెలుగుదేశం పార్టీలో బేషరతుగా చేరుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ముందు మున్సిపల్ చైర్మన్‌గా పార్టీ అభ్యర్థిని గెలిపించుకురావాలని చంద్రబాబు ఆదేశించినట్లు సమాచారం. ఈ విషయంపై మంగళవారం వరదరాజులరెడ్డి పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నారు. వరదరాజులరెడ్డి చేరికపై లింగారెడ్డి అయిష్టత వ్యక్తం చేస్తున్నా పార్టీ నేతలు ఈ విషయంలో చొరవ చూపుతున్నారు. ప్రస్తుతం లింగారెడ్డి వెంట ఉన్న తెలుగుతమ్ముళ్లు కౌన్సిలర్ సీట్లను ఆశిస్తున్నారు. వరద రాజులరెడ్డి పార్టీలో చేరుతుండటంతో ఇంత వరకు ఏ వార్డుకు ఏ అభ్యర్థి అనే విషయాన్ని ప్రకటించలేదు. లింగారెడ్డి వరదరాజులరెడ్డితో చర్చించిన తర్వాతే వార్డు అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని చెప్పుకుంటున్నారు.
వైఎస్సార్‌సీపీ నిర్ణయంపై హర్షం
ప్రొద్దుటూరు మున్సిపల్ స్థానానికి సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంతో పలువర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మున్సిపల్ చైర్మన్ స్థానం జనరల్ కేటగిరీకి (అన్‌రిజర్వుడు) కేటాయించినా బీసీలనే ఎంపిక చేయాలని నిర్ణయించారు.
ఇందులో భాగంగా రెండేళ్లపాటు ముక్తియార్‌ను మున్సిపల్ చైర్మన్‌గా కొనసాగిస్తారు. మిగతా మూడేళ్ల చైర్మన్ పదవీకాలాన్ని పట్టణంలో ప్రధానంగా ఉన్న దేవాంగ, తొగట, పద్మశాలీయ వర్గాల్లో ఎవరో ఒకరికి అప్పగించాలని నిర్ణయించారు. వైస్ చైర్మన్ పదవిని ఆర్యవైశ్యులకు కేటాయించారు. దీంతో అన్ని వర్గాలలో హర్షం వ్యక్తమవుతోంది.