టీడీపీ నేతలతోనే వెళ్లండి
‘మా వాళ్లేమి చేసినా చూసీచూడనట్టు వెళ్లిపోండి ... మరీ ముక్కు సూటిగా పోవద్దంటూ’ విజయవాడలో గతంలో జరిగిన కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో హుకుం జారీ చేశారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్న చందంగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మరో ముందడుగు వేశారు.
మంగళవారం నగరపాలక సంస్థలోని పలు విభాగాల సమీక్ష సమావేశంలో అధికారులనుద్దేశించి మాట్లాడుతూ ‘నగరంలో ఏయే పనులు చేస్తారో నివేదిక తయారు చేసుకోండి ... పక్కా ప్రణాళికతో పనులు చేయడానికి డివిజన్లలోకి వెళ్లండి ...అలా వెళ్లే సమయంలో టీడీపీ స్థానిక నేతలను మీ వెంట తీసుకువెళ్లండి ... వారితోనే తిరగండి. వారిని కాదని వీధుల్లో ఏ పనీ చేయవద్దు’ అని ఆదేశించారు. అక్కడికే పరిమితం కాలేదు గత ప్రభుత్వాల్లో ఇచ్చిన పట్టాలు రద్దు చేస్తాం ... ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేస్తే తొలగిస్తాం... కోర్టుకు వెళ్లినా సరే మా పని మేం చేసుకుపోతామంటూ తమ దౌర్జన్య ప్రణాళికనూ వారి ముందుంచారు.
ఒంగోలు అర్బన్: నగరపాలక సంస్థ అధికారులు నగరంలోని సమస్యలపై నివేదిక తయారు చేయాలని, ఆ సమస్యలను గుర్తించేందుకు ఆయా డివిజన్లకు అధికారులు వెళ్ళినపుడు తప్పకుండా తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులను వెంట తీసుకువెళ్ళాలని ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్థన్ నగరపాలక సంస్థ సిబ్బందికి హుకుం జారీ చేశారు. ఈ మేరకు స్థానిక నగరపాలక సంస్థలో విభాగాల వారీగా దామచర్ల సమీక్షా సమావేశం నిర్వహించారు. మార్కెట్ సెంటర్‌లో గతంలో ఇచ్చిన పట్టాలను, ఆక్రమణలను తొలగిస్తామని స్పష్టం చేశారు.
దీనిపై కోర్డుకి వెళ్లినా మరింకేమి చేసినా ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. నీరు వృథాకాకుండా ప్రతి ఇంటిలో నీటి సంపులుండే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. పాత నాయకులు, అధికారులకు అలవాటు పడి చేసే పనులను మానుకొని సజావుగా పూర్తి చేయాలనిన్నారు. నగరంలో ఉన్న అన్నీ ముఖ్య కూడల్లో చెత్త డబ్బాలని ఉంచాలని సూచాంచారు.
జనవరి 7 నుంచి తానుకూడా వార్డుల్లో పరిశీలిస్తానని అన్నారు. సమీక్ష అనంతరం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ పరిశుభ్ర ఒంగోలు కోసం రోడ్లు విస్తరించడం, ఆ రహదారులకు ఇరువైపులా మొక్కలను నాటుతామన్నారు. రోడ్డుకి మధ్యలో డివైడర్లు,సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేసి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
రోడ్ల మధ్యలో అక్కడక్కడా దేశ నాయకుల విగ్రహాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మురుగు కాలువల మరమ్మతులు, నిర్మాణాలతో పాటు సిమెంట్ రోడ్లు, ప్రతిరోజు మంచినీటి సరఫరా అయ్యేలా కృషి చేస్తానన్నారు. ట్రాఫిక్‌కి సంబంధించి సిగ్నల్ వ్యవస్థని పటిష్టంగా ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. 100 రోజుల్లో అభివృద్ధి పనులు శ్రీకారం చుట్టాలని చెప్పారు.
- క్లాక్ టవర్ నిర్మాణానికి అభ్యంతరాలతో స్థలం మార్చాం
నగరంలో క్లాక్‌టవర్ నిర్మాణ విషయంపై విలేకర్లు ప్రశ్నించగా స్థానిక చర్చి సెంటర్‌లో చేపట్టాలని తొలుత అనుకున్నాం... చర్చి ప్రతినిధులు ‘అక్కడ దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహమే ముద్దు క్లాక్ టవర్ వద్దు’ అనే విధంగా అడ్డుకోవడంతో పాత మార్కెట్ సెంటర్, మంగమూరు రోడ్డు భైపాస్ రోడ్డుపై నిర్మించేందుకుమార్పులు చేస్తామని అన్నారు.