8 రోజులుగా సమ్మె చేస్తున్నా పట్టించుకోరా? | ysrcp leader Parthasarathi fires on ap govt | Sakshi
Sakshi News home page

8 రోజులుగా సమ్మె చేస్తున్నా పట్టించుకోరా?

Published Sun, Jul 19 2015 1:45 AM | Last Updated on Tue, Oct 16 2018 7:36 PM

8 రోజులుగా సమ్మె చేస్తున్నా పట్టించుకోరా? - Sakshi

8 రోజులుగా సమ్మె చేస్తున్నా పట్టించుకోరా?

♦  ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ నేత పార్థసారథి మండిపాటు
♦  మున్సిపల్ కార్మికుల్ని ప్రభుత్వం మనుషులుగా కూడా చూడట్లేదు
♦  వారికి బాసటగా ఏ కార్యక్రమం చేపట్టేందుకైనా వైఎస్సార్‌సీపీ సిద్ధం

 సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ కార్మికులు ఎనిమిది రోజులకుపైగా సమ్మెలో ఉన్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండిపడింది.

కార్మికుల్ని ప్రభుత్వం మనుషులుగానే చూస్తున్నట్టు లేదని దుయ్యబట్టింది. పార్టీ అధికార ప్రతినిధి కె.పార్థసారథి శనివారమిక్కడ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు చేతిలో మోసపోయినవారి జాబితాలో రైతులు, మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థుల సరసన ఇప్పుడు కొత్తగా మున్సిపల్ కార్మికులు చేరిపోయారన్నారు.

ఎన్నికలకు ముందు మున్సిపల్ కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి వారి ఓట్లన్నింటినీ దండుకుని, అధికారంలోకొచ్చాక దీనిపై మంత్రివర్గ ఉపసంఘం పేరుతో కాలయాపన చేయడమేగాక జీతాలు పెంచాలంటూ వారు సమ్మె చేస్తున్నా పట్టించుకోవడం మానేశారని విమర్శించారు. సీఎం, మంత్రులు పుష్కరాలకే పరిమితమై అక్కడ ఏర్పాట్లు బాగున్నాయని యాత్రికుల్ని అడగడం కాదు.. ఊళ్లోకొచ్చి చెత్త ఇబ్బందులెలా ఉన్నాయని ప్రజలనడిగితే సమస్య తీవ్రత తెలుస్తుందన్నారు.

పట్టిసీమ ప్రాజెక్టులో 26 శాతం అధికంగా కాంట్రాక్టర్లకు డబ్బులిచ్చేందుకు సిద్ధపడిన ప్రభుత్వం.. కార్మికుల జీతాల పెంపువల్ల పడే రూ.200 కోట్ల అదనపు భారాన్ని భరించడానికి ముందుకు రాకపోవడం శోచనీయమని, కార్మికులపట్ల ప్రభుత్వ వైఖరిని ఇది తేటతెల్లం చేస్తోందని స్పష్టంచేశారు. ప్రభుత్వ చట్టాల ప్రకారమే కనీస వేతనం రూ.15,400గా నిర్ణయించగా.. చంద్రబాబు ప్రభుత్వం కార్మికుల జీతాన్ని రూ.6,700 నుంచి పెంచేందుకు సుముఖంగా లేదని ఆయన దుయ్యబట్టారు.
 
లాఠీచార్జి అమానుషం: సమ్మెలో ఉన్న కార్మికులు విజయవాడ వచ్చిన సీఎంను కలిసేందుకు వెళితే మహిళలని కూడా చూడకుండా లాఠీచార్జి చేయడం అమానుషమని పార్థసారథి అన్నారు. కార్మికుల సమ్మెకు తమ పార్టీ పూర్తి సంఘీభావం ప్రకటిస్తోందన్నారు. తెలంగాణలో మాదిరి రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తారా అన్న ప్రశ్నకు.. కార్మికులతో చర్చించి అన్నివిధాలా వారికి బాసటగా నిలవడానికి తమ పార్టీ సిద్ధమేనని ఆయన బదులిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement