
ఆఫర్ పేరిట మోసం
‘మీ ఫోన్ నంబర్‌కు ఆఫర్ వచ్చింది’ అంటూ నమ్మబలికి ఫోన్ ద్వారా మోసగించాడు ఓ వ్యక్తి.
గండేపల్లి (జగ్గంపేట) : ‘మీ ఫోన్ నంబర్‌కు ఆఫర్ వచ్చింది’ అంటూ నమ్మబలికి ఫోన్ ద్వారా మోసగించాడు ఓ వ్యక్తి. బాధితుడి కథనం మేరకు.. నీలాద్రిరావుపేట గ్రామానికి చెందిన పరిమి సూరిబాబు ఫోన్ నంబర్‌కు ఈ నెల 14న 89772 02638 నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. మీ నెట్‌వర్క్ నెంబర్‌కు ఆఫర్ వచ్చిందని ఆధార్, డోర్ నెంబర్ చెప్పాలని కోరడంతో సూరిబాబు వివరాలు తెలిపాడు.
ఒక సెల్‌ఫోన్, షుగర్, బీపీ పరీక్షించుకునే వస్తువు, విద్యుత్ ఆదా అయ్యే పరికరం వెరసి రూ.8 వేల విలువ చేస్తాయని, ఆఫర్‌లో రూ.1500కే మీకు ఇస్తామని, వీటిని పోస్టల్‌కు పార్శిల్ ద్వారా పంపిస్తామని సొమ్ములు అక్కడ చెల్లించి వస్తువులు తీసుకోవాలని ఫోన్‌లో చెప్పడంతో అందుకు సూరిబాబు అంగీకరించాడు. మీకు పార్శిల్ పంపించాం తీసుకున్నారా అని శనివారం గతంలో ఫోన్ చేసిన నంబర్ నుంచి అదే వ్యక్తి ఫోన్‌చేడు. కొంత సేపటికే మీ పేరున పార్శిల్ వచ్చిందని జెడ్.రాగంపేట పోస్టల్ కార్యాలయం నుంచి ఫోన్ రావడంతో హడావుడిగా వెళ్లిన సూరిబాబు సొమ్ములు చెల్లించాడు.
పార్శిల్ తెరచి చూడగా సూరిబాబు షాక్‌కు గురయ్యాడు. రబ్బరు పాదుకలు, లక్ష్మీదేవి, తాబేలు తదితర వస్తువులు అందులో ఉన్నాయి. పోస్టల్ కార్యాలయం నుంచి సంబంధిత వ్యక్తికి సూరిబాబు ఫోన్ చేయగా ప్యాకింగ్ పేరు మారిందని పరిశీలించి గంటలో ఫోన్ చేస్తామని చెప్పారని బాధితుడు తెలిపాడు. ఆ వ్యక్తి నుంచి ఎలాంటి సమాధానం రాలేదని మోసపోయినట్టు గుర్తించాడు సూరిబాబు. తనలా ఎవరూ మోసపోవద్దని కోరాడు.