ఛీ నువ్వు మోసగాడివి: ఆగిన పెళ్లి | cheater bride groom | Sakshi
Sakshi News home page

ఛీ నువ్వు మోసగాడివి: ఆగిన పెళ్లి

Published Sat, Jun 17 2017 8:48 AM | Last Updated on Tue, Sep 5 2017 1:52 PM

ఛీ నువ్వు మోసగాడివి: ఆగిన పెళ్లి

ఛీ నువ్వు మోసగాడివి: ఆగిన పెళ్లి

► విదేశాల్లో ఉద్యోగాల పేరిట రూ.లక్షలు వసూలు చేసిన పెళ్లి కుమారుడు
► పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు
► సమాచారం తెలుసుకొని గంట ముందు పెళ్లి నిరాకరించి వెళ్లిపోయిన వధువు, ఆమె తల్లిదండ్రులు


ఒంగోలు క్రైం:  విదేశాల్లో ఉద్యోగం.. నెలకు మూడు లక్షల జీతం. మంచి సంబంధం...బిడ్డ సుఖపడుతుందనుకున్నారు. భారీ కట్నం, అధిక మొత్తంలో లాంఛనాలు..వధువు, వరుడి తరఫు వారు అన్ని ఒప్పందాలు కుదుర్చుకున్నారు. శుక్రవారం ఒంగోలు నగరంలోని దక్షిణ బైపాస్‌లో ఖరీదైన కల్యాణ మండపంలో పెళ్లి. ఉదయం 11 గంటలకు ముహూర్తం. పెళ్లికి ఒక గంట ముందు ఎన్‌ఆర్‌ఐ అల్లుడి బాగోతం బట్టబయలైంది.

విదేశాల్లో ఉద్యోగాలిప్పిస్తానంటూ లక్షలు వసూలు చేసి మోసగించిన అతని వ్యవహారం తెలుసుకొని వధువు తల్లిదండ్రులు విచారించుకున్నారు. వారికి వచ్చిన సమాచారం వాస్తవమేనని తెలుసుకొని ముందు ఇచ్చిన అడ్వాన్స్‌లు, లాంఛనాల సంగతి దేవుడెరుగు..ఆడపిల్ల భవిష్యత్తు ముఖ్యమనుకుని పీటల మీద పెళ్లిని అర్ధంతరంగా ఆపేసి వెళ్లిపోయారు.

వివరాల్లోకి వెళ్తే.. ఒంగోలు నగరంలోని భాగ్యనగర్‌ నాలుగో లైన్‌లో నివాసం ఉంటున్న పులిచర్ల కళ్యాణ్‌రెడ్డి మలేషియాలో ఉద్యోగం చేస్తున్నానంటూ చీమకుర్తికి చెందిన ఓ యువతితో వివాహం కుదుర్చుకున్నాడు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఒంగోలు నగరంలోని దక్షిణ బైపాస్‌లోని ఓ కళ్యాణ మండలంలో వివాహం. అయితే గురువారమే పులిచర్ల కళ్యాణ్‌రెడ్డి సింగపూర్, మలేషియాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ  ఐదుగురు వద్ద రూ.10 నుంచి రూ.15 లక్షల వరకు తీసుకొని ఉద్యోగాలు ఇప్పించకుండా మోసం చేశాడంటూ ఒంగోలు వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు.

దీంతో అదేరోజు సాయంత్రం వన్‌టౌన్‌ పోలీసులు కళ్యాణ్‌రెడ్డిని, అతని కుటుంబ సభ్యులను స్టేషన్‌కు పిలిపించారు. అతని పాస్‌పోర్ట్, ఏఏ దేశాలు తిరిగింది అన్ని వివరాలు ఒంగోలు వన్‌టౌన్‌ సీఐ ఎండ్లూరి రామారావు రాబట్టారు. బాధితుల్లో ఒంగోలుకు చెందిన మున్నా, శ్రీకాంత్, అశోక్‌ రెడ్డి, శ్యామ్యూల్, దౌలత్‌లు ఉన్నారు. వీరితో పాటు మరికొంతమంది కూడా బాధితులు ఉన్నారని అతని చేతిలో మోసపోయిన వారు చెబుతున్నారు. గురువారం నుంచి పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే మరో గంటలోపే పెళ్లి ఉందనగా శుక్రవారం ఈ సమాచారం పెళ్లి మండపంలోని పెళ్లి కుమార్తెకు, ఆమె తల్లిదండ్రులకు తెలిసింది.

అప్పుడు హడావిడిగా అసలు ఏం జరిగిందోనని పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి వధువు తండ్రి విచారించుకున్నారు. విషయం తెలుసుకుని పెళ్లి ఆపేసి  కుమార్తెను తీసుకుని స్వగ్రామం చీమకుర్తికి వెళ్లిపోయారు. లక్షల రూపాయల డబ్బులిచ్చిన మోసపోయిన బాధితుల పక్షాన వైఎస్సార్‌ సీపీ నాయకులు నిలిచి వారికి న్యాయం చేయాలని పోలీసులను కలిసి విజ్ఞప్తి చేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement