నేను గానీ.. ఫోన్ గానీ చేశానంటే.. | cheaters in Vizianagaram | Sakshi
Sakshi News home page

నేను గానీ.. ఫోన్ గానీ చేశానంటే..

Published Sun, Feb 15 2015 3:03 AM | Last Updated on Sat, Sep 2 2017 9:19 PM

cheaters in Vizianagaram

 గుర్ల: పట్టపగలు..నలుగురూ నడయాడే మండల కేంద్రం...సినీ ఫక్కీలో ఓ ఘరానా మోసగాడు.. మహిళ మెడలోని రెండు తులాల  బంగారు తాళిని తీసుకుని  పరారయ్యాడు. గుర్ల పోలీసులు, స్థానికులు, బాధితురాలు అందించిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని గూడెం గ్రామానికి చెందిన రుంకాన పైడితల్లి అలియాస్ తట్టు (52)అనే మహిళ తన మనుమరాలి పేరును రేషన్‌కార్డులో చేర్పించాలనే.. ఉద్దేశంతో మండలం కేంద్రం గుర్లలో ఉన్న మీసేవ వద్దకు ఆధార్‌కార్డు, రేషన్‌కార్డులను పట్టుకుని వెళ్లింది...జనన ధ్రువీకరణ పత్రం లేకపోతే రేషన్‌కార్డులో పేరు నమోదు చేయడం జరగదని ధ్రువీకరణ పత్రం పట్టుకుని సోమవారం రమ్మని మీసేవ ఆపరేటర్ చెప్పాడు.  దీంతో ఆమె సోమవారం వద్దామనుకుని ఆమె అక్కడ నుంచి  గూడెం వెళ్లి పోవాలని నిర్ణయించుకుని ఆటోలో ప్రయాణించి విజయనగరం , పాలకొండ రహదారిపై ఉన్న గూడె జంక్షన్ వద్ద దిగింది.
 
 అక్కడ నుంచి గ్రామానికి కాలినడకన వస్తుండగా అదే రోడ్డుపై ఎదురుగా గుర్తుతెలియని ఓ అపరిచిత వ్యక్తి మోటారు సైకిల్‌పై వచ్చి.. ఆమె ముందు ఆపి ... పెద్దమ్మా  ఏం వచ్చావని పరిచయం ఉన్న వ్యక్తిలా పలకరించాడు.. ఏమీ లేదు నాయనా రేషన్‌కార్డులో నా మనుమరాలి పేరు చేర్పిద్దామని వచ్చాను.. పని అవ్వక తిరుగుముఖమయ్యానని చెప్పింది. నేను ఒక్క ఫోన్‌కాల్ చేస్తే తహశీల్దారు రేషన్‌కార్డులో పేరు చేర్పిస్తాడు... నా బండి ఎక్కు అన్నాడు. నిరక్ష్యరాస్యత, పల్లెటూరి అమాయకత్వం కలిగిన ఆమె  ఘరానా మోసగాడి మాటలు నమ్మి బండి ఎక్కింది. అపరిచిత వ్యక్తి ఆమెను నేరుగా తహశీల్దారు కార్యాలయం వద్దకు తీసుకు వెళ్లి రేషన్‌కార్డుకు జిరాక్స్‌లు  తీయించాడు...అనంతరం ఫొటోలు కూడా తీయించాలని ఆమెతో చెప్పి తీసుకు తీసుకెళ్లాడు. తహశీల్దారు కార్యాలయం నుంచి గుర్ల జంక్షన్‌కు తీసుకెళ్తుండగా మార్గ మధ్యంలో కెల్ల జంక్షన్ వద్ద బండి ఆపి పెద్దమ్మా...  రేషన్ కార్డులు పేదవారికి ఇస్తారు.. బంగారు తాళి మెడలో ఉంటే.. ధనవంతులు అనుకుని ఉన్న రేషన్‌కార్డు కట్ చేస్తారని చెప్పి ఫొటో తీసే ముందు మెడలోని తాడు తీసి పట్టుకో అని చెప్పాడు.
 
 అపరిచిత వ్యక్తి చెప్పిన ప్రకారం ఆమె మెడలోని తాడు తీసి చేత్తో పట్టుకుంది. ఈ లోగా అపరిచిత వ్యక్తి బండిని స్టార్ట్‌చేసి గేరు వేశాడు... పెద్దమ్మా బండెక్కు అన్నాడు.. ఆమె బండి ఎక్కడంలో ఇబ్బంది పడుతుండగా... చేతిలో తాళి పట్టుకుని ఎక్కలేకపోతున్నావు.. ఆ తాడుని నేను పట్టుకుంటాను ఇవ్వు.. అని ఆ వ్యక్తి అన్నాడు. అలాగే నాయనా నువ్వు పట్టుకో అని చెప్పి ఆమె అతని చేతికి బంగారు తాళి  ఇచ్చింది. దీంతో ఆ వ్యక్తి బంగారుతాడు అందుకుని క్షణంలో అక్కడ నుంచి పరారయ్యాడు. ఆ వెంటనే ఆమె పెద్దగా గోల చేయడంతో స్థానికులు చుట్టుముట్టారు. ఈలోగా అపరిచిత వ్యక్తి మోటారు సైకిల్‌పై పరారయ్యాడు. అనంతరం బాధితురాలు స్థానిక పోలీసు స్టేషన్‌కు వచ్చి  ఫిర్యాదు చేయడంతో ఎస్సై నీలకంఠం కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement