జిల్లాలోని వివిధ కోర్టుల్లో ఎన్‌ఐ యాక్ట్ సెక్షన్ 138 కింద ఉన్న చెక్ బౌన్స్ తదితర కేసుల విచారణను కేంద్రీకరిస్తూ ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయడాన్ని నిలిపివేయాలని ఆల్ ఇండియా లాయర్స్
ఏలూరు(ఆర్‌ఆర్ పేట) : జిల్లాలోని వివిధ కోర్టుల్లో ఎన్‌ఐ యాక్ట్ సెక్షన్ 138 కింద ఉన్న చెక్ బౌన్స్ తదితర కేసుల విచారణను కేంద్రీకరిస్తూ ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయడాన్ని నిలిపివేయాలని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్(ఐలు) జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఐలు జిల్లా కార్యవర్గ సమావేశం ఏలూరులో ఆదివారం నిర్వహించారు. జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి.రాజగోపాల్, కేసిరెడ్డి భాస్కరరావు మాట్లాడుతూ ప్రత్యేక కోర్టు ఏర్పాటు వల్ల న్యాయవాదులకు, కక్షిదారులకు తీరని నష్టం జరుగుతుందన్నారు.
ఈ ప్రత్యేక కోర్టును భీమవరంలో ఏర్పాటు చేయాలనే ప్రయత్నాన్ని హైకోర్టు విరమించుకోవాలని కోరారు. జిల్లా కోర్టు విచారణ పరిధిని వికేంద్రీకరిస్తూ వివిధ ప్రాంతాల్లో జిల్లా కోర్టులు, కొత్తగా మున్సిఫ్ కోర్టులు ఏర్పాటు చేయటంవల్ల ఆయా ప్రాంతాలకు న్యాయం అందుబాటులోకి వస్తుందన్నారు. కేవలం చెక్ బౌన్స్ కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ నిర్ణయం కారణంగా ఆయా కోర్టుల పరిధిలోగల న్యాయవాదులు వృత్తిపరమైన ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని వివరించారు. ఐలు జిల్లా కార్యదర్శి ఎస్‌ఎన్ కట్టా, కోశాధికారి వి.శైలజ, సభ్యులు పి.వేణుగోపాలచౌదరి తదితరులు పాల్గొన్నారు.