నూజివీడు, న్యూస్‌లైన్ : దేశవ్యాప్తంగా ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ ఇప్పటి వరకు సమయాధారిత విధానంలో అమలవుతోంది. దీనివల్ల మిగిలిన మార్గాల్లో ట్రాపిక్ లేకపోయినా డిస్‌ప్లే బోర్డు మీద సెకన్లు పోయి సున్నాకు వచ్చి, పచ్చలైటు వెలిగే వరకూ వాహనాలు నిలిచి ఉండాల్సిందే. ఈ విధానం కారణంగా ఒకే మార్గంలో ఐదారు ట్రాఫిక్ సిగ్నళ్లు ఉంటే సమయం ఎంతో వృథా అవుతుంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద సమయం వృథాను అరికట్టేందుకు నూజివీడు సారథి ఇంజినీరింగ్ కళాశాల ఈఈఈ విద్యార్థులు ‘వాహనాల సాంద్రత ఆధారిత ట్రాఫిక్ నిర్వహణ’ విధానాన్ని రూపొందించారు.
ఈ విధానం వల్ల వాహనాలు లేకపోయినా సిగ్నల్ సమయం పూర్తయ్యేవరకు వేచి ఉండాల్సిన అవసరం లేదు. అత్యవసర సర్వీసులు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఎలాంటి ట్రాఫిక్ లేకుండా వెళ్లొచ్చు. మనం వెళ్లే మార్గంలో ట్రాఫిక్ ఎలా ఉందో ముందుగానే మెసేజ్ పంపి తెలుసుకోవచ్చు. ఈ విధానం ప్రస్తుతం ఉన్న విధానం కన్నా మెరుగైనదని విద్యార్థులు చెబుతున్నారు. ఈ నెల 22న ఇబ్రహీంపట్నం లోని నిమ్రా గ్రూపు ఆఫ్ కాలేజెస్‌లో నిర్వహిం చిన ఆరో జాతీయ స్థాయి టెక్నికల్ సింపోజియంలో ఈ ప్రాజెక్టు ప్రథమస్థానం పొందింది.
పనిచేసే విధానం ఇలా....
ఈ విధానంలో 200 మీటర్ల వరకు ట్రాఫిక్ ఐలాండ్ నుంచి అన్ని వైపులా రోడ్లకు సెన్సార్లను అమర్చి, ట్రాఫిక్ కంట్రోల్ వద్ద రిసీవర్ ఏర్పాటు చేస్తారు.
వాహనాలు వచ్చినప్పుడు ఈ సెన్సార్లు గుర్తించి గ్రీన్‌లైటును వెలిగిస్తాయి.
మనం సెట్ చేసిన దాని ప్రకారం 10 సెకన్లకు ఒకసారి నాలుగు పక్కలా రౌండ్ ది క్లాక్ క్రమంలో సిగ్నల్ లైట్లు పడతాయి.
ఒక మార్గంలో వాహనాలేవీ లేకపోతే వాహనాల ఉన్న మార్గంలోని ట్రాఫిక్ సిగ్నల్ లైట్లు ఆటోమేటిక్‌గా వెలుగుతాయి. దీనివల్ల సమయం ఆదా అవుతుంది.
అంబులెన్స్‌లో ట్రాన్స్‌మీటర్‌ను అమరిస్తే, ట్రాఫిక్ సిగ్నల్‌కు 200 మీటర్ల దూరంలో ఉండగానే అంబులెన్స్ డ్రైవర్ ట్రాన్స్‌మీటర్ స్విచ్‌ను ఆన్‌చేస్తే ట్రాఫిక్‌సిగ్నల్ వద్ద ఉన్న రిసీవర్ దానిని స్వీకరించి ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తుంది. అంబులెన్స్ ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్లిపోవచ్చు.
మనం వెళ్లే మార్గంలో ట్రాఫిక్ ఎలా ఉందో కూడా తెలుసుకునే పరికరాన్ని విద్యార్థులు రూపొందించారు. దీనికి గాను ప్రతి ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద జీపీఎస్ ఆధారిత పరికరాన్ని ఏర్పాటు చేసి, అందులో సిమ్‌ను ఏర్పాటు చేయాలి.
ఎవరైనా తమ సెల్ నుంచి టీడీ (ట్రాఫిక్ డెన్సిటీ) అని టైప్ చేసి దానికి మెసేజ్ పంపితే అది తిరిగి ట్రాఫిక్ ఏ విధంగా ఉందనేది మెసేజీ రూపంలో పంపుతుంది.
ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద కష్టాలకు చెక్
Published Wed, Mar 26 2014 4:11 AM | Last Updated on Sat, Sep 2 2017 5:09 AM
Advertisement
Advertisement