Traffic signal system
-
హైదరాబాద్ సిటీలో ఈ సమస్యలు తీరేదెన్నడు?
సాక్షి, హైదరాబాద్: ‘పెడస్ట్రియన్ ఈజ్ కింగ్ ఆఫ్ ది రోడ్’ ఈ అంతర్జాతీయ నానుడి నగరంలో మాత్రం మాటలకే పరిమితమవుతోంది. హైదరాబాద్ సిటీలో పాదచారులకు మాత్రం పిటీగా మారింది. ఇక్కడ జరుగుతున్న ప్రమాదాలు, కనిపించని మౌలిక వసతులే దీన్ని స్పష్టం చేస్తున్నాయి. నగరంలో ప్రతి ఏడాదీ రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారిలో పాదచారులది రెండో స్థానం. గత ఏడాది నగర పరిధిలో జరిగిన మొత్తం ప్రమాదాల్లో 94 మంది పాదచారులు మరణించారని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ)–2021 గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా మొత్తం 53 నగరాలకు సంబంధించిన గణాంకాలు విడుదల కాగా... వీటిలో హైదరాబాద్ పాదచారుల మరణాలకు సంబంధించి ఆరో స్థానంలో నిలిచింది. ఈ సమస్యలు తీరేదెన్నడో... రాజధానిలో ఉన్న రహదారులపై పాదచారులు భద్రంగా తిరిగేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు లేవు. పురాతన నగరమైన పాతబస్తీలోనే కాదు... ఇటీవలే రూపుదిద్దుకుని, నానాటికీ అభివృద్ధి చెందుతున్న హైటెక్ సిటీ పరిసరాల్లోనూ ఇవి మచ్చుకైనా కనిపించవు. ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థలోనూ పాదచారులకు అవసరమైన స్థాయిలో ప్రాధ్యానం లభించట్లేదు. ప్రణాళిక లోపం కారణంగా నగరంలో ఉన్న ఫుట్‌పాత్‌ల్లో సగం ఆక్రమణకు గురికాగా... మిగిలిన చోట్ల అనేక అడ్డంకులు వస్తున్నాయి. జంక్షన్స్ వద్ద పెడస్ట్రియన్స్ క్రాసింగ్ కోసం ప్రత్యేకమైన చర్యలు, అందుకు అనుగుణంలో ‘ఆల్ రెడ్స్’ అనే సాంకేతిక అంశం ఏర్పాటు ఇంకా జరుగుతూనే ఉంది. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ (ఎఫ్ఓబీ) నిర్మాణం, అందుబాటులోకి తీసుకురావడం నత్తనడకన సాగుతున్నాయి. చదవండి: (Hyderabad: సెప్టెంబర్ గండం.. గ్రేటర్ వాసుల వెన్నులో వణుకు) భూగర్భ మార్గాలు కనుమరుగు... నగరంలోని రద్దీ ప్రాంతాలు, వాణిజ్య సముదాయాలు ఎక్కువగా ఉన్న చోట్లగతంలో భూగర్భ క్రాసింగ్ మార్గాలు నిర్మించారు. సరైన నిర్వహణ, భద్రతా ప్రమాణాలు లేకపోవడంతో ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, కోఠిల్లో ఏర్పాటు చేసిన భూగర్భ క్రాసింగ్ మార్గాలు ఆదరణకు నోచుకోలేదు. దీంతో ఒకటి పూర్తిగా కనుమరుగు కాగా... మరోటి స్వరూపం మార్చుకుని పాదచారులకు పనికిరాకుండా పోయింది. మెట్రోరైల్ నిర్మాణాల కోసం అప్పట్లో సిటీలోని ఫుట్ఓవర్ బ్రిడ్జ్‌ల్ని తొలగించారు. ఆ తర్వాత జీహెచ్ఎంసీ కొన్నింటిని నిర్మిస్తున్నా... అవసరాలకు తగ్గట్టు మాత్రం ఇవి లేవు. ఈ పరిస్థితుల కారణంగా గతేడాది నగరంలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదాల కారణంగా 590 మంది క్షతగాత్రులుగా కాగా... 94 మంది మరణించారు. ఈ చర్యలు తీసుకోవాల్సిందే... ఫుట్‌పాత్‌లపై చిరు వ్యాపారాలు, కాలిబాటల్ని మింగేసిన బడా మాల్స్ ఇవన్నీ ఒక ఎత్తయితే ప్రభుత్వ విభాగాల అనాలోచిత చర్యలు మరో ఎత్తు. వీటివల్ల మరికొన్ని ఇబ్బందులు వచ్చిపడి కాలిబాటలు బాటసారులకు బాసట కాలేకపోతున్నాయి. ఫుట్‌పాత్‌లపై ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన, పెంచిన చెట్లకు తోడు అధికారులు ఉద్దేశపూర్వకంగా, అనాలోచి ధోరణిలో ఏర్పాటు చేసిన (చేస్తున్న) విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, స్తంబాలు, మూత్రశాలలు ఆ కొద్ది స్థలాన్నీ ఆక్రమించేస్తూ పాదచారులకు పాదం మోపే చోటు లేకుండా చేస్తున్నాయి. రోడ్లకు అనుసంధానంగా ఉన్న క్యారేజ్‌వే ఆధారంగా కాలిబాటలు కనిష్టంగా 4–5 అడుగుల వెడల్పు ఉండేలా విస్తరించాలి. ప్రస్తుతం ఉన్న వాటిపై అడ్డదిడ్డంగా ఉంటున్న చెట్లు, ట్రాన్స్ఫార్మర్లు వంటివి తొలగించాలి. ఈ తొలగింపు ప్రక్రియ సాధ్యం కాని ప్రాంతాల్లో ఉన్న ఫుట్‌పాత్ వెడల్పు కనీసం 2 నుంచి మూడు అడుగులు అధికంగా విస్తరించాలి. ఈ ఫుట్‌పాత్‌లు కేవలం పాదచారులు నడవడానికి మాత్రమే అన్నది అందరికీ అవగాహన కల్పించడంతో పాటు అది కచ్చితంగా అమలు అయ్యేలా చేయాలని సూచించారు. ఆక్రమణలు నిరోధించడానికి జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసులతో కూడిన సంయుక్త ఎన్ఫోర్స్మెంట్ బృందాలను ఏర్పాటు చేయాలి. -
టాఫిక్ సిగ్నల్.. ఇక ఆటోమేటిక్!
సాక్షి, హైదరాబాద్: సాధారణంగా ప్రతి ట్రాఫిక్ జంక్షన్‌లోనూ నాలుగు రోడ్లు ఉంటాయి... ఒక్కో రోడ్‌కు నిర్ణీత సమయం గ్రీన్ లైట్, రెడ్ లైట్ వెలుగుతూ “సిగ్నల్స్ సైకిల్’ నడుస్తుంది. అన్ని రోడ్లలోనూ, అన్ని వేళల్లో వాహనాల రద్దీ ఒకేలా ఉండదు... అయినప్పటికీ ట్రాఫిక్ సిగ్నల్స్ సైకిల్లో మాత్రం మార్పు ఉండట్లేదు. ఫలితంగా గ్రీన్ లైన్ పడిన రహదారులు ఖాళీగా ఉంటుండగా, రెడ్‌లైన్ ఉన్న రోడ్లు కిక్కిరిసిపోతున్నాయి. ఈ ప్రభావం ఆ జంక్షన్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలపై ఉంటోంది. దీంతో అనేక చౌరస్తాల్లో సిబ్బంది మాన్యువల్‌గా ఆపరేట్ చేయాల్సి వస్తోంది. ఈ సమస్యకు పరిష్కారంగా ట్రాఫిక్ విభాగం అధికారులు అడాప్టివ్ ట్రాఫిక్ కంట్రోలింగ్ సిస్టం (ఏటీసీఎస్) అమలులోకి తీసుకువస్తున్నారు. దీనికి సంబంధించి ట్రాఫిక్ చీఫ్ ఏవీ రంగనాథ్ శుక్రవారం తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ అనుసంధానించి ఉండే సర్వర్‌కు ఏ జంక్షన్‌లోని, ఏ రహదారిలో, ఎంత ట్రాఫిక్ ఉంది? అనేది సాంకేతికంగా తెలుసుకుని సిగ్నల్స్ సైకిల్లోనూ మార్పు తీసుకురానున్నారు. దీనికోసం ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టంలో(ఐటీఎంఎస్) అడాప్టివ్ ట్రాఫిక్ కంట్రోలింగ్ సిస్టం(ఏటీసీఎస్) విధానాన్ని అమలు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే గూగుల్ సంస్థతో పోలీసు విభాగానికి ఒప్పందం కుదిరింది. ఓలా, ఉబర్, ర్యాపిడో తదితర సంస్థలతోనూ సమన్వయం ఏర్పాటు చేసుకోనున్నారు. ఏటీసీఎస్ విధానంలో ఓ మార్గంలో ఉన్న నాలుగైదు జంక్షన్లు అనుసంధానం అవుతాయి. ఆయా చౌరస్తాల్లో ఎటు నుంచి ఎంత ట్రాఫిక్ వస్తోందనేది లెక్కించడానికి అవసరమైన పరిజ్ఞానం ట్రాఫిక్ కెమెరాల్లో ఉంది. ఇవన్నీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానించి ఉంటాయి. అక్కడి సర్వర్‌లో ఉండే సాఫ్ట్వేర్ ఈ వాహనాల సంఖ్య ఆధారంగా ఏఏ మార్గాల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే ఆ రూట్లకు ఎక్కువ సేపు గ్రీన్ లైట్ పడేలా చేస్తుంది. అయితే గరిష్టంగా 100 సెకన్లు మాత్రమే ఇది ఉంటుంది. ఆపై రోటేషన్‌పై సిగ్నల్ సైకిల్ మొదలవుతుంది. ఇప్పటికే గూగుల్ మ్యాప్స్‌లో ఆయా మార్గాల్లో ఉన్న రద్దీ కనిపిస్తూ ఉంటుంది. ఈ డేటాతో పాటు వివిధ బైక్ ట్యాక్సీ, క్యాబ్ సేవలను అందిస్తున్న సంస్థలతోనూ ట్రాఫిక్ పోలీసులు అవగాహన కుదుర్చుకోనున్నారు. వీరి నుంచి నగరంలోని వివిధ మార్గాల్లో ఉన్న వాహనాల రద్దీ వివరాలు అప్డేట్ చేసుకుంటారు. ఇవన్నీ ట్రాఫిక్ పోలీసు విభాగానికి చెందిన సర్వర్ అప్లికేషన్ ఇంటర్ఫేస్ (ఏపీఐ) ద్వారా అనుసంధానిస్తారు. ఇలా ఆయా రహదారుల్లో ట్రాఫిక్ రద్దీ ఎప్పటికప్పుడు ట్రాఫిక్ సర్వర్‌కు చేరుతుంది. దీన్ని ఆటోమేటిక్‌గా గుర్తించే ఆ సర్వర్ సిగ్నల్స్ సైకిల్‌ను మారుస్తుంది. ఈ ఏటీసీఎస్ ద్వారా ట్రాఫిక్ జామ్స్ తగ్గడంతో పాటు వాహనచోదకుల సమయం సైతం ఆదా అవుతుంది. ప్రస్తుతం ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ఐబీఐ గ్రూపు నిర్వహిస్తోంది. శుక్రవారం ఈ సంస్థ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించిన ట్రాఫిక్ చీఫ్ ఏవీ రంగనాథ్ జూలై ఆఖరు నాటికి ఏర్పాటు పూర్తి చేయాలని ఆదేశించారు. ఆపై మరో వారం పాటు ట్రయల్ రన్ చేసి, ఆగస్టు మొదటి వారం నాటికి ఆటోమేటిక్ సిగ్నల్స్‌ను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. (చదవండి: తెలివిగా బుల్లెట్ వాహనాన్ని కొట్టేశారు...అమ్మేందుకు యత్నిస్తుంటే...) -
ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద కష్టాలకు చెక్
నూజివీడు, న్యూస్‌లైన్ : దేశవ్యాప్తంగా ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ ఇప్పటి వరకు సమయాధారిత విధానంలో అమలవుతోంది. దీనివల్ల మిగిలిన మార్గాల్లో ట్రాపిక్ లేకపోయినా డిస్ప్లే బోర్డు మీద సెకన్లు పోయి సున్నాకు వచ్చి, పచ్చలైటు వెలిగే వరకూ వాహనాలు నిలిచి ఉండాల్సిందే. ఈ విధానం కారణంగా ఒకే మార్గంలో ఐదారు ట్రాఫిక్ సిగ్నళ్లు ఉంటే సమయం ఎంతో వృథా అవుతుంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద సమయం వృథాను అరికట్టేందుకు నూజివీడు సారథి ఇంజినీరింగ్ కళాశాల ఈఈఈ విద్యార్థులు ‘వాహనాల సాంద్రత ఆధారిత ట్రాఫిక్ నిర్వహణ’ విధానాన్ని రూపొందించారు. ఈ విధానం వల్ల వాహనాలు లేకపోయినా సిగ్నల్ సమయం పూర్తయ్యేవరకు వేచి ఉండాల్సిన అవసరం లేదు. అత్యవసర సర్వీసులు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఎలాంటి ట్రాఫిక్ లేకుండా వెళ్లొచ్చు. మనం వెళ్లే మార్గంలో ట్రాఫిక్ ఎలా ఉందో ముందుగానే మెసేజ్ పంపి తెలుసుకోవచ్చు. ఈ విధానం ప్రస్తుతం ఉన్న విధానం కన్నా మెరుగైనదని విద్యార్థులు చెబుతున్నారు. ఈ నెల 22న ఇబ్రహీంపట్నం లోని నిమ్రా గ్రూపు ఆఫ్ కాలేజెస్లో నిర్వహిం చిన ఆరో జాతీయ స్థాయి టెక్నికల్ సింపోజియంలో ఈ ప్రాజెక్టు ప్రథమస్థానం పొందింది. పనిచేసే విధానం ఇలా.... ఈ విధానంలో 200 మీటర్ల వరకు ట్రాఫిక్ ఐలాండ్ నుంచి అన్ని వైపులా రోడ్లకు సెన్సార్లను అమర్చి, ట్రాఫిక్ కంట్రోల్ వద్ద రిసీవర్ ఏర్పాటు చేస్తారు. వాహనాలు వచ్చినప్పుడు ఈ సెన్సార్లు గుర్తించి గ్రీన్లైటును వెలిగిస్తాయి. మనం సెట్ చేసిన దాని ప్రకారం 10 సెకన్లకు ఒకసారి నాలుగు పక్కలా రౌండ్ ది క్లాక్ క్రమంలో సిగ్నల్ లైట్లు పడతాయి. ఒక మార్గంలో వాహనాలేవీ లేకపోతే వాహనాల ఉన్న మార్గంలోని ట్రాఫిక్ సిగ్నల్ లైట్లు ఆటోమేటిక్‌గా వెలుగుతాయి. దీనివల్ల సమయం ఆదా అవుతుంది. అంబులెన్స్‌లో ట్రాన్స్‌మీటర్‌ను అమరిస్తే, ట్రాఫిక్ సిగ్నల్‌కు 200 మీటర్ల దూరంలో ఉండగానే అంబులెన్స్ డ్రైవర్ ట్రాన్స్‌మీటర్ స్విచ్‌ను ఆన్‌చేస్తే ట్రాఫిక్సిగ్నల్ వద్ద ఉన్న రిసీవర్ దానిని స్వీకరించి ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తుంది. అంబులెన్స్ ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్లిపోవచ్చు. మనం వెళ్లే మార్గంలో ట్రాఫిక్ ఎలా ఉందో కూడా తెలుసుకునే పరికరాన్ని విద్యార్థులు రూపొందించారు. దీనికి గాను ప్రతి ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద జీపీఎస్ ఆధారిత పరికరాన్ని ఏర్పాటు చేసి, అందులో సిమ్‌ను ఏర్పాటు చేయాలి. ఎవరైనా తమ సెల్ నుంచి టీడీ (ట్రాఫిక్ డెన్సిటీ) అని టైప్ చేసి దానికి మెసేజ్ పంపితే అది తిరిగి ట్రాఫిక్ ఏ విధంగా ఉందనేది మెసేజీ రూపంలో పంపుతుంది.