టాఫిక్‌ సిగ్నల్‌.. ఇక ఆటోమేటిక్‌! | Traffic Officials Implementing Adaptive Traffic Control System | Sakshi
Sakshi News home page

టాఫిక్‌ సిగ్నల్‌.. ఇక ఆటోమేటిక్‌!

Published Sat, May 28 2022 7:43 AM | Last Updated on Sat, May 28 2022 7:43 AM

Traffic Officials Implementing Adaptive Traffic Control System  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సాధారణంగా ప్రతి ట్రాఫిక్‌ జంక్షన్‌లోనూ నాలుగు రోడ్లు ఉంటాయి... ఒక్కో రోడ్‌కు నిర్ణీత సమయం గ్రీన్‌ లైట్, రెడ్‌ లైట్‌ వెలుగుతూ “సిగ్నల్స్‌ సైకిల్‌’ నడుస్తుంది. అన్ని రోడ్లలోనూ, అన్ని వేళల్లో వాహనాల రద్దీ ఒకేలా ఉండదు... అయినప్పటికీ ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ సైకిల్‌లో మాత్రం మార్పు ఉండట్లేదు. ఫలితంగా గ్రీన్‌ లైన్‌ పడిన రహదారులు ఖాళీగా ఉంటుండగా, రెడ్‌లైన్‌ ఉన్న రోడ్లు కిక్కిరిసిపోతున్నాయి. ఈ ప్రభావం ఆ జంక్షన్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలపై ఉంటోంది.

దీంతో అనేక చౌరస్తాల్లో సిబ్బంది మాన్యువల్‌గా ఆపరేట్‌ చేయాల్సి వస్తోంది. ఈ సమస్యకు పరిష్కారంగా ట్రాఫిక్‌ విభాగం అధికారులు అడాప్టివ్‌ ట్రాఫిక్‌ కంట్రోలింగ్‌ సిస్టం (ఏటీసీఎస్‌) అమలులోకి తీసుకువస్తున్నారు. దీనికి సంబంధించి ట్రాఫిక్‌ చీఫ్‌ ఏవీ రంగనాథ్‌ శుక్రవారం తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ అనుసంధానించి ఉండే సర్వర్‌కు ఏ జంక్షన్‌లోని, ఏ రహదారిలో, ఎంత ట్రాఫిక్‌ ఉంది? అనేది సాంకేతికంగా తెలుసుకుని సిగ్నల్స్‌ సైకిల్‌లోనూ మార్పు తీసుకురానున్నారు.

దీనికోసం ఇంటిగ్రేటెడ్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టంలో(ఐటీఎంఎస్‌) అడాప్టివ్‌ ట్రాఫిక్‌ కంట్రోలింగ్‌ సిస్టం(ఏటీసీఎస్‌) విధానాన్ని అమలు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే గూగుల్‌ సంస్థతో పోలీసు విభాగానికి ఒప్పందం కుదిరింది. ఓలా, ఉబర్, ర్యాపిడో తదితర సంస్థలతోనూ సమన్వయం ఏర్పాటు చేసుకోనున్నారు. ఏటీసీఎస్‌ విధానంలో ఓ మార్గంలో ఉన్న నాలుగైదు జంక్షన్లు అనుసంధానం అవుతాయి. ఆయా చౌరస్తాల్లో ఎటు నుంచి ఎంత ట్రాఫిక్‌ వస్తోందనేది లెక్కించడానికి అవసరమైన పరిజ్ఞానం ట్రాఫిక్‌ కెమెరాల్లో ఉంది.

ఇవన్నీ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌తో అనుసంధానించి ఉంటాయి. అక్కడి సర్వర్‌లో ఉండే సాఫ్ట్‌వేర్‌ ఈ వాహనాల సంఖ్య ఆధారంగా ఏఏ మార్గాల్లో ట్రాఫిక్‌ ఎక్కువగా ఉంటే ఆ రూట్లకు ఎక్కువ సేపు గ్రీన్‌ లైట్‌ పడేలా చేస్తుంది. అయితే గరిష్టంగా 100 సెకన్లు మాత్రమే ఇది ఉంటుంది. ఆపై రోటేషన్‌పై సిగ్నల్‌ సైకిల్‌ మొదలవుతుంది.  ఇప్పటికే గూగుల్‌ మ్యాప్స్‌లో ఆయా మార్గాల్లో ఉన్న రద్దీ కనిపిస్తూ ఉంటుంది. ఈ డేటాతో పాటు వివిధ బైక్‌ ట్యాక్సీ, క్యాబ్‌ సేవలను అందిస్తున్న సంస్థలతోనూ ట్రాఫిక్‌ పోలీసులు అవగాహన కుదుర్చుకోనున్నారు.

వీరి నుంచి నగరంలోని వివిధ మార్గాల్లో ఉన్న వాహనాల రద్దీ వివరాలు అప్‌డేట్‌ చేసుకుంటారు. ఇవన్నీ ట్రాఫిక్‌ పోలీసు విభాగానికి చెందిన సర్వర్‌ అప్లికేషన్‌ ఇంటర్‌ఫేస్‌ (ఏపీఐ) ద్వారా అనుసంధానిస్తారు. ఇలా ఆయా రహదారుల్లో ట్రాఫిక్‌ రద్దీ ఎప్పటికప్పుడు ట్రాఫిక్‌ సర్వర్‌కు చేరుతుంది. దీన్ని ఆటోమేటిక్‌గా గుర్తించే ఆ సర్వర్‌ సిగ్నల్స్‌ సైకిల్‌ను మారుస్తుంది. ఈ ఏటీసీఎస్‌ ద్వారా ట్రాఫిక్‌ జామ్స్‌ తగ్గడంతో పాటు వాహనచోదకుల సమయం సైతం ఆదా అవుతుంది. ప్రస్తుతం ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ను ఐబీఐ గ్రూపు నిర్వహిస్తోంది. శుక్రవారం ఈ సంస్థ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించిన ట్రాఫిక్‌ చీఫ్‌ ఏవీ రంగనాథ్‌ జూలై ఆఖరు నాటికి ఏర్పాటు పూర్తి చేయాలని ఆదేశించారు. ఆపై మరో వారం పాటు ట్రయల్‌ రన్‌ చేసి, ఆగస్టు మొదటి వారం నాటికి ఆటోమేటిక్‌ సిగ్నల్స్‌ను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. 

(చదవండి: తెలివిగా బుల్లెట్‌ వాహనాన్ని కొట్టేశారు...అమ్మేందుకు యత్నిస్తుంటే...)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement