traffic control system
-
టాఫిక్ సిగ్నల్.. ఇక ఆటోమేటిక్!
సాక్షి, హైదరాబాద్: సాధారణంగా ప్రతి ట్రాఫిక్ జంక్షన్‌లోనూ నాలుగు రోడ్లు ఉంటాయి... ఒక్కో రోడ్‌కు నిర్ణీత సమయం గ్రీన్ లైట్, రెడ్ లైట్ వెలుగుతూ “సిగ్నల్స్ సైకిల్’ నడుస్తుంది. అన్ని రోడ్లలోనూ, అన్ని వేళల్లో వాహనాల రద్దీ ఒకేలా ఉండదు... అయినప్పటికీ ట్రాఫిక్ సిగ్నల్స్ సైకిల్లో మాత్రం మార్పు ఉండట్లేదు. ఫలితంగా గ్రీన్ లైన్ పడిన రహదారులు ఖాళీగా ఉంటుండగా, రెడ్‌లైన్ ఉన్న రోడ్లు కిక్కిరిసిపోతున్నాయి. ఈ ప్రభావం ఆ జంక్షన్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలపై ఉంటోంది. దీంతో అనేక చౌరస్తాల్లో సిబ్బంది మాన్యువల్‌గా ఆపరేట్ చేయాల్సి వస్తోంది. ఈ సమస్యకు పరిష్కారంగా ట్రాఫిక్ విభాగం అధికారులు అడాప్టివ్ ట్రాఫిక్ కంట్రోలింగ్ సిస్టం (ఏటీసీఎస్) అమలులోకి తీసుకువస్తున్నారు. దీనికి సంబంధించి ట్రాఫిక్ చీఫ్ ఏవీ రంగనాథ్ శుక్రవారం తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ అనుసంధానించి ఉండే సర్వర్‌కు ఏ జంక్షన్‌లోని, ఏ రహదారిలో, ఎంత ట్రాఫిక్ ఉంది? అనేది సాంకేతికంగా తెలుసుకుని సిగ్నల్స్ సైకిల్లోనూ మార్పు తీసుకురానున్నారు. దీనికోసం ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టంలో(ఐటీఎంఎస్) అడాప్టివ్ ట్రాఫిక్ కంట్రోలింగ్ సిస్టం(ఏటీసీఎస్) విధానాన్ని అమలు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే గూగుల్ సంస్థతో పోలీసు విభాగానికి ఒప్పందం కుదిరింది. ఓలా, ఉబర్, ర్యాపిడో తదితర సంస్థలతోనూ సమన్వయం ఏర్పాటు చేసుకోనున్నారు. ఏటీసీఎస్ విధానంలో ఓ మార్గంలో ఉన్న నాలుగైదు జంక్షన్లు అనుసంధానం అవుతాయి. ఆయా చౌరస్తాల్లో ఎటు నుంచి ఎంత ట్రాఫిక్ వస్తోందనేది లెక్కించడానికి అవసరమైన పరిజ్ఞానం ట్రాఫిక్ కెమెరాల్లో ఉంది. ఇవన్నీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానించి ఉంటాయి. అక్కడి సర్వర్‌లో ఉండే సాఫ్ట్వేర్ ఈ వాహనాల సంఖ్య ఆధారంగా ఏఏ మార్గాల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే ఆ రూట్లకు ఎక్కువ సేపు గ్రీన్ లైట్ పడేలా చేస్తుంది. అయితే గరిష్టంగా 100 సెకన్లు మాత్రమే ఇది ఉంటుంది. ఆపై రోటేషన్‌పై సిగ్నల్ సైకిల్ మొదలవుతుంది. ఇప్పటికే గూగుల్ మ్యాప్స్‌లో ఆయా మార్గాల్లో ఉన్న రద్దీ కనిపిస్తూ ఉంటుంది. ఈ డేటాతో పాటు వివిధ బైక్ ట్యాక్సీ, క్యాబ్ సేవలను అందిస్తున్న సంస్థలతోనూ ట్రాఫిక్ పోలీసులు అవగాహన కుదుర్చుకోనున్నారు. వీరి నుంచి నగరంలోని వివిధ మార్గాల్లో ఉన్న వాహనాల రద్దీ వివరాలు అప్డేట్ చేసుకుంటారు. ఇవన్నీ ట్రాఫిక్ పోలీసు విభాగానికి చెందిన సర్వర్ అప్లికేషన్ ఇంటర్ఫేస్ (ఏపీఐ) ద్వారా అనుసంధానిస్తారు. ఇలా ఆయా రహదారుల్లో ట్రాఫిక్ రద్దీ ఎప్పటికప్పుడు ట్రాఫిక్ సర్వర్‌కు చేరుతుంది. దీన్ని ఆటోమేటిక్‌గా గుర్తించే ఆ సర్వర్ సిగ్నల్స్ సైకిల్‌ను మారుస్తుంది. ఈ ఏటీసీఎస్ ద్వారా ట్రాఫిక్ జామ్స్ తగ్గడంతో పాటు వాహనచోదకుల సమయం సైతం ఆదా అవుతుంది. ప్రస్తుతం ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ఐబీఐ గ్రూపు నిర్వహిస్తోంది. శుక్రవారం ఈ సంస్థ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించిన ట్రాఫిక్ చీఫ్ ఏవీ రంగనాథ్ జూలై ఆఖరు నాటికి ఏర్పాటు పూర్తి చేయాలని ఆదేశించారు. ఆపై మరో వారం పాటు ట్రయల్ రన్ చేసి, ఆగస్టు మొదటి వారం నాటికి ఆటోమేటిక్ సిగ్నల్స్‌ను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. (చదవండి: తెలివిగా బుల్లెట్ వాహనాన్ని కొట్టేశారు...అమ్మేందుకు యత్నిస్తుంటే...) -
స్మార్ట్ ట్రాఫిక్
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ట్రాఫిక్నియంత్రణకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అందజేసేందుకు ప్రముఖ క్యాబ్ సంస్థ ఓలా ముందుకొచ్చింది. ఈ మేరకు సోమవారం ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఓలా అందజేసే ‘స్మార్ట్ ట్రాఫిక్ సొల్యూషన్స్’ ద్వారా ట్రాఫిక్ నియంత్రణచర్యలను చేపడతారు. ఈ ఒప్పందంతో ఓలా రూపొందించిన ‘ఇంటెలిజెంట్ ఇన్ సైట్స్’ను షేర్ చేసుకునేందుకు అవకాశం లభిస్తుంది. దీంతో నగరంలో మొబిలిటీ సేవలనుమరింత పటిష్టంగా అమలు చేయొచ్చు. ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, ఓలా రీజినల్ హెడ్ సందీప్ ఉపాధ్యాయ్లు ఈ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. రవాణా సంబంధిత పాలనా వ్యవహారాలను బలోపేతం చేసేందుకు అవసరమైన మొబిలిటీ డేటా, ఉపకరణాల సృష్టికి ఓలా చేస్తున్న ప్రయత్నాల్లో ఇదో మైలురాయిగా నిలుస్తుందని జయేశ్‌రంజన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నగర అభివృద్ధిలో మొబిలిటీ కీలక పాత్ర పోషిస్తుందని, సమగ్ర స్మార్ట్ సిటీ ప్లాన్ రూపొందించడంపై దృష్టి సారించామని చెప్పారు. ఓలా అందించే విలువైన డేటా ఇన్ సైట్స్ భవిష్యత్ అవసరాలకు ఎంతో దోహదం చేస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం, ఓలాల ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ట్రాఫిక్, ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ను సరళీకృతం చేస్తుందన్నారు. డైనమిక్ మ్యాపింగ్ రూపకల్పన... ఈ అవగాహన ఒప్పందంలో భాగంగా పైలట్ ప్రాజెక్ట్ కింద ఓలా సంస్థ భాగస్వామ్యంలోని వాహనాల నెట్వర్క్ ద్వారా నగరంలోని ప్రధాన రహదారులపై మెరుగైన ప్రయాణ సదుపాయాలను చేపట్టేందుకు కావాల్సిన డైనమిక్ మ్యాపింగ్‌ను రూపొందిస్తారు. ఆ డేటాను నగరంలో రహదారుల నాణ్యతను పర్యవేక్షించే, నిర్వహించే సంబంధిత ప్రభుత్వ విభాగాలకు అందజేస్తారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ ద్వారా వచ్చే ఫలితం గుంతల కారణంగా జరిగే ప్రమాదాలను తగ్గించేందుకు, రోడ్డు నిర్మాణాల నాణ్యతను పర్యవేక్షించేందుకు అవకాశం కల్పిస్తుంది. ఈ సందర్భంగా ఓలా రీజినల్ హెడ్ సందీప్ ఉపాధ్యాయ్ మాట్లాడుతూ... ఓలాకు అనుసంధానంగా ఆరేళ్లుగా నగరంలో లక్షల కిలోమీటర్లు తిరిగిన కార్లు, ఆటోలు, ద్విచక్రవాహనాల ద్వారా విలువైన సమాచారాన్ని సేకరించినట్లు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వంతో తాము కుదుర్చుకున్న ఒప్పందం ప్రజోపయోగం కోసం వినియోగంచడంలో ఒక ముందడుగు అని పేర్కొన్నారు. ట్రాఫిక్ మేనేజ్మెంట్లో సాంకేతికతక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంలో తెలంగాణ అగ్రగామిగా ఉందన్నారు. ఇంటెలిజెంట్ ట్రాఫిక్ సిస్టమ్, ఆటోమేటెడ్ ట్రాఫిక్ చలాన్స్ వంటివి ఇప్పటికే అమల్లో ఉన్నాయని, ఇప్పుడు ఈ భాగస్వామ్యం స్మార్ట్ హైదరాబాద్‌ను నిర్మించేందుకు దోహదం చేస్తుందన్నారు. -
ధ్రువపత్రాలు లేకుంటే చర్యలే..!
గజ్వేల్ సిద్ధిపేట: గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో పార్కింగ్ సమస్యలు, ట్రాఫిక్ నియంత్రణపై అధికారులు చర్యలు చేపట్టారు. ఈ నెల 1న ‘సాక్షి’లో ‘గజ్వేల్...గజిబిజి’ శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందించిన సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ బాలాజీ గురువారం ఇక్కడ పర్యటించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సమస్యలను, రాంగ్ పార్కింగ్ పరిస్థితిని పరిశీలించారు. మున్సిపల్ పరిధిలోని ప్రజ్ఞాపూర్ చౌరస్తా, గజ్వేల్ పట్టణంలోని ఇందిరాపార్క్ చౌరస్తా, ఆంధ్రాబ్యాంక్ వద్ద అడ్డదిడ్డంగా పెట్టిన ద్విచక్ర వాహనదారులను, ఆటోడ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలు, రాంగ్ పార్కింగ్, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బస్టాండ్ వద్ద రోడ్డుపై పార్కింగ్ లేని ప్రాంతాల్లో వాహనాలను నిలపకూడదన్నారు. ప్రతి ఒక్కరు డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ పొల్యూషన్ పత్రాలు కలిగి ఉండాలని..వాహనానికి సంబంధించి ధ్రువపత్రాలు లేకుండా ఎవరైనా వాహనం నడిపితే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆటోలను రోడ్డుపై నిలపడం వల్ల ఇతర వాహనాలు రోడ్డుపై నిలిచి ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందన్నారు. ఆటోలను రోడ్డు కింద ఆపాలన్నారు. సెల్‌ఫోన్ మాట్లాడుతూ.. డ్రైవింగ్ చేయవద్దని, మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. రాంగ్ పార్కింగ్ చేసిన వారిపై 20కేసులు నమోదు చేసి రూ. 3750 జరిమానా విధించినట్లు తెలిపారు. గజ్వేల్ ట్రాఫిక్ ఎస్ఐ ఆనంద్‌గౌడ్, సిబ్బంది పాల్గొన్నారు. -
ట్రాఫిక్ చిక్కులకు డ్రోన్లతో చెక్!
ముంబై: ప్రయాణికుల్ని తరలించే డ్రోన్ల తయారీతో రోడ్లపై భారీగా ట్రాఫిక్‌ను తగ్గించవచ్చని కేంద్ర విమానయాన సహాయమంత్రి జయంత్ సిన్హా తెలిపారు. ఐఐటీ విద్యార్థులు ఈ డ్రోన్లకు సంబంధించి అధునాతన పరికరాలను అభివృద్ధి చేయవచ్చని వెల్లడించారు. ఆదివారం ఐఐటీ–బాంబే నిర్వహించిన టెక్‌ఫెస్ట్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. దేశంలో డ్రోన్ల తయారీరంగం వేగంగా విస్తరించేందుకు త్వరలోనే మార్గదర్శకాలు రూపొందించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రయాణికుల్ని తీసుకెళ్లే డ్రోన్ల రూపకల్పనపై పలువురు దృష్టి సారించారనీ.. ఈ రంగంలో భారీ వాటా పొందేందుకు మనం కూడా దేశీయంగా ఆ తరహా డ్రోన్ల అభివృద్ధిపై దృష్టిసారించాలని సూచించారు. సమర్థవంతంగా డ్రోన్లను తయారుచేయగలిగితే వాటి రవాణా వ్యయం ఆటో ప్రయాణానికయ్యే స్థాయిలోనే ఉంటుందని అభిప్రాయపడ్డారు. దేశంలో ఎలక్ట్రానిక్, ఫైనాన్షియల్ టెక్నాలజీ రంగాల్లో భారీ అవకాశాలు ఉన్నాయన్నారు. తగిన చర్యలు తీసుకుంటే త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఎలక్ట్రానిక్ వాహనాలను ఎగుమతి చేసే దేశంగా భారత్ నిలుస్తుందని సిన్హా తెలిపారు. -
ద్రోన్ల ట్రాఫిక్ నియంత్రణకు కొత్త ఏటీసీ వ్యవస్థ!
న్యూయార్క్: గగనతలంలో విమానాలు, హెలికాప్టర్ల ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్(ఏటీసీ) ఉంది. మరి గగనతలంలో పక్షుల్లా వీరవిహారం చేస్తున్న ద్రోన్ల సంగతేంటి? భవిష్యత్తులో ద్రోన్లు ఎక్కడపడితే అక్కడ ప్రత్యక్షమవుతూ ఎటుపడితే అటు దూసుకెళ్లడం చాలా సాధారణం కానుంది కూడా. అందుకే అమెరికా అంతరిక్ష సంస్థ నాసా శాస్త్రవేత్తలు ద్రోన్ల నియంత్రణ కోసం ప్రత్యేక ‘ద్రోన్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్’ను రూపొందిస్తున్నారు. భూమిపై 400-500 అడుగుల ఎత్తులో ఎగిరే ద్రోన్ల నియంత్రణకు వారు ద్రోన్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్‌ను అభివృద్ధిపరుస్తున్నారు. ద్రోన్లు ఒకదానిని ఒకటి ఢీకొట్టకుండా, హెలికాప్టర్ల దారికి అడ్డువెళ్లకుండా, భవనాల్లోకి దూసుకుపోకుండా ఉండేందుకు వీలుగా ఈ కొత్త ఏటీసీని రూపొందిస్తున్నారు. ఆయా ద్రోన్లు ఎంత ఎత్తులో, ఏ దిశలో వెళ్లాలి? అన్నది ఈ కంప్యూటర్ ఆధారిత ఏటీసీ వ్యవస్థ ఆటోమేటిక్‌గా నియంత్రిస్తుందట.