న్యూయార్క్: గగనతలంలో విమానాలు, హెలికాప్టర్ల ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్(ఏటీసీ) ఉంది. మరి గగనతలంలో పక్షుల్లా వీరవిహారం చేస్తున్న ద్రోన్‌ల సంగతేంటి? భవిష్యత్తులో ద్రోన్‌లు ఎక్కడపడితే అక్కడ ప్రత్యక్షమవుతూ ఎటుపడితే అటు దూసుకెళ్లడం చాలా సాధారణం కానుంది కూడా. అందుకే అమెరికా అంతరిక్ష సంస్థ నాసా శాస్త్రవేత్తలు ద్రోన్‌ల నియంత్రణ కోసం ప్రత్యేక ‘ద్రోన్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్’ను రూపొందిస్తున్నారు.
భూమిపై 400-500 అడుగుల ఎత్తులో ఎగిరే ద్రోన్‌ల నియంత్రణకు వారు ద్రోన్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌ను అభివృద్ధిపరుస్తున్నారు. ద్రోన్‌లు ఒకదానిని ఒకటి ఢీకొట్టకుండా, హెలికాప్టర్ల దారికి అడ్డువెళ్లకుండా, భవనాల్లోకి దూసుకుపోకుండా ఉండేందుకు వీలుగా ఈ కొత్త ఏటీసీని రూపొందిస్తున్నారు. ఆయా ద్రోన్‌లు ఎంత ఎత్తులో, ఏ దిశలో వెళ్లాలి? అన్నది ఈ కంప్యూటర్ ఆధారిత ఏటీసీ వ్యవస్థ ఆటోమేటిక్‌గా నియంత్రిస్తుందట.