Adaptive Traffic Technology
-
టాఫిక్ సిగ్నల్.. ఇక ఆటోమేటిక్!
సాక్షి, హైదరాబాద్: సాధారణంగా ప్రతి ట్రాఫిక్ జంక్షన్‌లోనూ నాలుగు రోడ్లు ఉంటాయి... ఒక్కో రోడ్‌కు నిర్ణీత సమయం గ్రీన్ లైట్, రెడ్ లైట్ వెలుగుతూ “సిగ్నల్స్ సైకిల్’ నడుస్తుంది. అన్ని రోడ్లలోనూ, అన్ని వేళల్లో వాహనాల రద్దీ ఒకేలా ఉండదు... అయినప్పటికీ ట్రాఫిక్ సిగ్నల్స్ సైకిల్లో మాత్రం మార్పు ఉండట్లేదు. ఫలితంగా గ్రీన్ లైన్ పడిన రహదారులు ఖాళీగా ఉంటుండగా, రెడ్‌లైన్ ఉన్న రోడ్లు కిక్కిరిసిపోతున్నాయి. ఈ ప్రభావం ఆ జంక్షన్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలపై ఉంటోంది. దీంతో అనేక చౌరస్తాల్లో సిబ్బంది మాన్యువల్‌గా ఆపరేట్ చేయాల్సి వస్తోంది. ఈ సమస్యకు పరిష్కారంగా ట్రాఫిక్ విభాగం అధికారులు అడాప్టివ్ ట్రాఫిక్ కంట్రోలింగ్ సిస్టం (ఏటీసీఎస్) అమలులోకి తీసుకువస్తున్నారు. దీనికి సంబంధించి ట్రాఫిక్ చీఫ్ ఏవీ రంగనాథ్ శుక్రవారం తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ అనుసంధానించి ఉండే సర్వర్‌కు ఏ జంక్షన్‌లోని, ఏ రహదారిలో, ఎంత ట్రాఫిక్ ఉంది? అనేది సాంకేతికంగా తెలుసుకుని సిగ్నల్స్ సైకిల్లోనూ మార్పు తీసుకురానున్నారు. దీనికోసం ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టంలో(ఐటీఎంఎస్) అడాప్టివ్ ట్రాఫిక్ కంట్రోలింగ్ సిస్టం(ఏటీసీఎస్) విధానాన్ని అమలు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే గూగుల్ సంస్థతో పోలీసు విభాగానికి ఒప్పందం కుదిరింది. ఓలా, ఉబర్, ర్యాపిడో తదితర సంస్థలతోనూ సమన్వయం ఏర్పాటు చేసుకోనున్నారు. ఏటీసీఎస్ విధానంలో ఓ మార్గంలో ఉన్న నాలుగైదు జంక్షన్లు అనుసంధానం అవుతాయి. ఆయా చౌరస్తాల్లో ఎటు నుంచి ఎంత ట్రాఫిక్ వస్తోందనేది లెక్కించడానికి అవసరమైన పరిజ్ఞానం ట్రాఫిక్ కెమెరాల్లో ఉంది. ఇవన్నీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానించి ఉంటాయి. అక్కడి సర్వర్‌లో ఉండే సాఫ్ట్వేర్ ఈ వాహనాల సంఖ్య ఆధారంగా ఏఏ మార్గాల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే ఆ రూట్లకు ఎక్కువ సేపు గ్రీన్ లైట్ పడేలా చేస్తుంది. అయితే గరిష్టంగా 100 సెకన్లు మాత్రమే ఇది ఉంటుంది. ఆపై రోటేషన్‌పై సిగ్నల్ సైకిల్ మొదలవుతుంది. ఇప్పటికే గూగుల్ మ్యాప్స్‌లో ఆయా మార్గాల్లో ఉన్న రద్దీ కనిపిస్తూ ఉంటుంది. ఈ డేటాతో పాటు వివిధ బైక్ ట్యాక్సీ, క్యాబ్ సేవలను అందిస్తున్న సంస్థలతోనూ ట్రాఫిక్ పోలీసులు అవగాహన కుదుర్చుకోనున్నారు. వీరి నుంచి నగరంలోని వివిధ మార్గాల్లో ఉన్న వాహనాల రద్దీ వివరాలు అప్డేట్ చేసుకుంటారు. ఇవన్నీ ట్రాఫిక్ పోలీసు విభాగానికి చెందిన సర్వర్ అప్లికేషన్ ఇంటర్ఫేస్ (ఏపీఐ) ద్వారా అనుసంధానిస్తారు. ఇలా ఆయా రహదారుల్లో ట్రాఫిక్ రద్దీ ఎప్పటికప్పుడు ట్రాఫిక్ సర్వర్‌కు చేరుతుంది. దీన్ని ఆటోమేటిక్‌గా గుర్తించే ఆ సర్వర్ సిగ్నల్స్ సైకిల్‌ను మారుస్తుంది. ఈ ఏటీసీఎస్ ద్వారా ట్రాఫిక్ జామ్స్ తగ్గడంతో పాటు వాహనచోదకుల సమయం సైతం ఆదా అవుతుంది. ప్రస్తుతం ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ఐబీఐ గ్రూపు నిర్వహిస్తోంది. శుక్రవారం ఈ సంస్థ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించిన ట్రాఫిక్ చీఫ్ ఏవీ రంగనాథ్ జూలై ఆఖరు నాటికి ఏర్పాటు పూర్తి చేయాలని ఆదేశించారు. ఆపై మరో వారం పాటు ట్రయల్ రన్ చేసి, ఆగస్టు మొదటి వారం నాటికి ఆటోమేటిక్ సిగ్నల్స్‌ను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. (చదవండి: తెలివిగా బుల్లెట్ వాహనాన్ని కొట్టేశారు...అమ్మేందుకు యత్నిస్తుంటే...) -
బెజవాడ ట్రాఫిక్‌కు విముక్తి!
బెజవాడ నగరంలో పద్మవ్యూహంలా మారిన ట్రాఫిక్‌కు విముక్తి లభించబోతోంది. ఇరుకు రోడ్లు, వెల్లువెత్తుతున్న వాహనాల రద్దీతో విజయవాడ ట్రాఫిక్ రోజురోజుకూ నరకంలా మారింది. ప్రధానమైన జంక్షన్లలో నిత్యం ట్రాఫిక్‌తో వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. దీన్ని ఛేదించడానికి నగర పోలీసులు నిత్యం నానా తంటాలు పడుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి పోలీసు అధికారులు సాంకేతిక సాయం తీసుకోబోతున్నారు. ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఐటీఎంఎస్) ప్రాజెక్ట్ ద్వారా ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థలో భారీ మార్పులు చేయబోతున్నారు. సాక్షి, అమరావతి : విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పాత సిగ్నలింగ్ వ్యవస్థ బదులు ప్రయోగాత్మకంగా 17 కూడళ్లలో ఏటీసీఎస్ (అడాప్టివ్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్) ను ఏర్పాటు చేయనున్నారు. నగరంలో దాదాపు 180 కూడళ్లు ఉన్నాయి. వీటిలో ప్రధానంగా తొలి దశలో ప్రకాశం బ్యారేజీ నుంచి బెంజి సర్కిల్ వరకు వారధి నుంచి ఎయిర్‌పోర్టు వరకు వినాయక టెంపుల్, గద్ద బొమ్మ, ప్రకాశం విగ్రహం, ఓల్డ్ బస్టాండ్, బందర్ లాకులు, గోల్డెన్ పెవిలియన్, రాఘవయ్య పార్క్, రాజ్‌భవన్, స్టేట్ గెస్ట్ హౌస్, డీసీపీ బంగ్లా, ఆర్టీఏ సర్కిల్‌తోపాటు బాలాజీ నగర్, స్క్రూ బ్రిడ్జి, బెంజి సర్కిల్, రామవరప్పాడు రింగ్ రోడ్, న్యూ ఆటోనగర్ కూడళ్లను ఏటీసీఎస్‌కు అనుసంధానం చేస్తారు. ఆయా కూడళ్లలో వాహన చోదకులు తరచూ ఇబ్బందులు పడుతున్నారు. అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకున్న ఉన్నతాధికారులు తక్కువ సమయంలో నలువైపులా వాహనాలు వేగంగా వెళ్లేలా చర్యలు చేపట్టనున్నారు. సమీకృత ఇంటెలిజెంట్ సిగ్నలింగ్ వ్యవస్థ ద్వారా అన్ని సిగ్నళ్లను ఒకదానితో ఒకటి అనుసంధానిస్తారు. ఇవి కేంద్రీకృత నియంత్రిత విధానం ద్వారా పని చేస్తాయి. వీటికి ప్రత్యేక కెమెరాలను ఏర్పాటు చేస్తారు. ఇవి వాహనాలను లెక్కించి, వాటిని వర్గీకరించి సమాచారాన్ని కమాండ్ కంట్రోల్ కేంద్రానికి పంపిస్తాయి. వాహనాల రద్దీని బట్టి సిగ్నల్ పడుతుంది. ఎక్కువ వాహనాలు ఉండే మార్గంలో ట్రాఫిక్‌ను క్లియర్ చేయడానికి అధిక సమయం ఆకుపచ్చ లైట్ వస్తుంది. సిగ్నలింగ్ వ్యవస్థ అంతా సౌరశక్తితో పని చేస్తుంది. ఇక నిరీక్షణ ఉండదు!.. పోలీస్ కంట్రోల్ రూం నుంచి బెంజి సర్కిల్ వరకు దాదాపు 4 కిలోమీటర్లు ఉంటుంది. పాత పద్ధతిలో సిగ్నల్స్ ఒకదానితో మరొకటి సంబంధం లేదు. దీనివల్ల ఈ కొద్ది దూరానికే ఒక్కొక్క సిగ్నల్ వద్ద చాలా సమయం నిరీక్షించాల్సి వస్తోంది. కొత్త వ్యవస్థ వస్తే ఎక్కడా ఆగాల్సిన పని లేదు. అత్యవసర వాహనాలకు ప్రత్యేక ట్యాగ్లు బిగిస్తారు. ఈ వాహనాలు వచ్చే సమయంలో ఆ మార్గంలో అకుపచ్చ లైట్లు వెలుగుతాయి. సిగ్నళ్ల స్తంభాలకు బిగించిన కెమెరాలు వాహనాల నెంబరు ప్లేట్లను గుర్తిస్తాయి. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే నేరుగా చలానా జారీ అవుతుంది. వీటికి సెన్సార్లు ఉంటాయి. అలాగే ముఖ్యమైన కూడళ్లలో పబ్లిక్ అడ్రస్ సిస్టం ఉంటుంది. ఎల్ఈడీ బోర్డులను ఏర్పాటు చేస్తారు. వీటిపై ట్రాఫిక్ నిబంధనలు, ముఖ్యమైన సూచనలు, వాతావరణం, తదితర వివరాలు వస్తుంటాయి. అత్యవసర వాహనాలకు గ్రీన్ సిగ్నల్.. ఈవీపీ (ఎమర్జెన్సీ వెహికల్ ప్రయార్టీ) : ఇప్పటి వరకు అత్యవసర సమయాలు, అంబులెన్స్‌లు వెళ్లేటప్పుడు, వీవీఐపీల రాకపోకల సమయంలో మాన్యువల్ విధానాన్ని ట్రాఫిక్ పోలీసులు పాటించేవారు. ఆయా వాహనాల రాకపోకల సమయాల సమాచారం తెలియగానే... ట్రాఫిక్ కానిస్టేబుల్ టైమర్లను నిలిపిసేవారు. ఆ తర్వాత మాన్యువల్ పద్ధతిలో రాకపోకలను నియంత్రించేవారు. ఈవీపీ పద్ధతిలో ఇకపై మాన్యువల్ విధానం అవసరం ఉండబోదు. అంబులెన్స్, ఫైర్ ఇంజిన్స్ వస్తున్న సమయంలో ఆ మార్గంలో ఆకుపచ్చ లైట్లు వెలుగుతాయి. ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం.. విజయవాడ నగర ట్రాఫిక్ సమస్యకు ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమే సరైన పరిష్కారం. ఈ ప్రాజెక్టు పూ ర్తిస్థాయిలో అమల్లోకి వస్తే ప్రజలకు ఎం తో మేలు జరుగుతుంది. ఈ ప్రాజెక్టు సా కారం కావడానికి చాలా కష్టపడ్డాం. త్వరలో పనులు ప్రారంభం అవుతాయి. ప్రయోగాత్మకంగా కొన్ని ప్రాంతాల్లో ఏటీసీ ఎస్ సిగ్నలింగ్ వ్యవస్థను అమలు చేస్తాం. – సీహెచ్ ద్వారకా తిరుమలరావు, పోలీసు కమిషనరు, విజయవాడ -
ఖాకీలకు ‘ఐటీ’ సాయం
సాక్షి, హైదరాబాద్: నగర శివారులో పట్టపగలు నడిరోడ్డులో హత్యో, రోడ్డు ప్రమాదమో జరిగితే.. ఫుల్ ట్రాఫిక్ జాం.. పోలీసులు వెళ్లేందుకు ఆలస్యమవుతుంది.. అక్కడేం జరిగిందో తెలియదు.. ఇక ముందు అలాంటి చోట ఎయిర్ కాప్ వాలిపోతుంది. అక్కడ జరుగుతున్నది ఫోటోలు, వీడియోలు తీసి వాయిస్ రికార్డ్‌తో సహా కంట్రోల్ రూం సర్వర్‌కు పంపుతుంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఇలాంటివెన్నో ఐటీ నిపుణులు రూపొందించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీసులకు తెలియజేసేందుకు శనివారం గచ్చిబౌలిలోని కమిషనరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ‘డేవ్థాన్’ సదస్సులో ప్రయోగాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడారు. ఐటీ నిపుణులు రూపొందించిన కాప్కామ్, రిపోర్ట్ యాప్, అడాప్టివ్ ట్రాఫిక్, ఎయిర్కాప్, చలాన్ అలర్ట పోలీసులకు ఎంతో ఉపయోగపడుతాయన్నారు. ఐటీ నిపుణులు ప్రజల భద్రతపై దృష్టి సారించడం శుభపరిణామమన్నారు. అడాప్టివ్ ట్రాఫిక్ టెక్నాలజీని ఐటీ నిపుణులు కునాల్, చందన్‌లు రూపొందించారన్నారు. ఎయిర్ కాప్‌ను నిరంజన్ తయారు చేశాడని తెలిపారు. సంఘటన జరిగిన వెంటనే పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయలేని వారు ఒకే ఒక్క మొబైల్ యాప్‌తో పోలీసులకు రిపోర్టు చేయవచ్చన్నారు. ఈ యాప్‌ను ఐటీ నిపుణులు హిమబిందు, నితిన్‌రెడ్డి రూపొందించారని తెలిపారు. ఈ యాప్‌ను సద్వినియోగం చేసుకుంటే ప్రజలతోపాటు పోలీసులకు కూడా మేలు చేకూరుతుందని చెప్పారు. కార్యక్రమంలో జాయింట్ పోలీసు కమిషనర్ శశిధర్‌రెడ్డి, డీసీపీలు ఎ.ఆర్.శ్రీనివాసులు, రామారాజేశ్వరి, కార్తికేయతో పాటు పలువురు ఐటీ నిపుణులు ఉన్నారు.