మహిళలకు గరుడ ప్రసాదం పంపిణీ చేస్తున్న అర్చకులు
సోషల్ మీడియా ప్రచారంతో భారీగా తరలివచ్చిన మహిళలు
వేలాది వాహనాలతో కిలోమీటర్ల మేర స్తంభించిన ట్రాఫిక్
మొయినాబాద్, బండ్లగూడ: చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుత్మంతుడికి నైవేద్యంగా పెట్టే ప్రసాదాన్ని స్వీకరిస్తే సంతానం లేని మహిళలకు పిల్లలు కలుగుతారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం చేయడంతో శుక్రవారం అనూహ్యంగా భక్తులు పోటెత్తారు. ప్రసాదం కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఢిల్లీ, కర్ణాటక, ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాదిగా తరలివచ్చారు.
ఇందుకు తగిన ఏర్పాట్లు చేయకపోవడంతో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. వేకువ జామున 4 గంటల నుంచే వాహనాలు భారీ సంఖ్యలో రావడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. మూడు నాలుగు గంటల పాటు ట్రాఫిక్‌లో ఇరుక్కుని, ఎండలో కాలినడకన ఆలయానికి చేరుకున్న భక్తులకు క్యూలైన్లు ఎక్కడ ఉన్నాయో..? ప్రసాదం ఎక్కడ పంపిణీ చేస్తున్నారో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఆలయ ప్రాంగణంలోనికి మహిళలను మాత్రమే అనుమతించడంతో పురుషులు బయటే ఉండిపోయారు.
చేతులెత్తేసిన పోలీసులు
ప్రసాదం కోసం పోటెత్తిన మహిళలను నియంత్రించడంలో ఆలయ సిబ్బంది, పోలీసులు చేతులెత్తేశారు. క్యూలైన్లలో తోపులాటలు జరగడంతో పలువురు సొమ్మసిల్లి పడిపోయారు. వీరిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గరుడ ప్రసాదాన్ని పంపిణీ చేశారు. కానీ వచ్చిన వారిలో సగం మందికి కూడా అందలేదు. దీంతో కొంత మంది మహిళలు నిరసన చేపట్టారు. గరుడ ప్రసాదం కొరతపై భక్తుల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమైన నేపథ్యంలో బ్రహ్మోత్సవాలు జరిగే వారం రోజుల పాటు ప్రసాదం ఇస్తామని, వారం రోజుల్లో ఎప్పుడైనా వచ్చి తీసుకోవచ్చని ఆలయ అర్చకులు తెలిపారు. గరుడ ప్రసాదం కోసం ఏటా సుమారు నాలుగు నుంచి ఐదు వేల మంది వచ్చేవారు. ఈసారి రెండింతలు వస్తారని భావించాం.. కానీ ఇంతమంది వస్తారని ఊహించలేదని ఆలయ అర్చకులు రంగరాజన్ తెలిపారు.
కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..
వేలాది వాహనాలు ఒక్కసారిగా రావడంతో సుమారు 25 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ సమస్య నెలకొంది. మెహిదీపట్నం నుంచి నానల్ నగర్, లంగర్‌హౌస్, టిప్‌ఖాన్‌పూల్ బ్రిడ్జ్, సన్‌సిటీ, కాళీమందిర్, టీఎస్‌పీఏ చౌరస్తా మీదుగా చిలుకూరు ఆలయం వరకు పూర్తిగా ట్రాఫిక్‌తో రోడ్డంతా స్తంభించిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment