
ఇవేం తనిఖీలండీ బాబూ..
► అలిపిరి టోల్‌గేట్ వద్ద తనిఖీల్లో సిబ్బంది నిర్లక్ష్యం
► పట్టించుకోని టీటీడీ భద్రతాధికారులు
తిరుపతి అర్బన్: టీటీడీ భద్రతా విభాగం నిబంధనల మేరకు తిరుమల కెళ్లే ప్రతి వాహనాన్ని, అందులోని ప్రతి వ్యక్తినీ క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపాలి. అందుకోసం అలిపిరి వద్ద అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన తనిఖీ యంత్రాల టోల్‌గేట్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడ పటిష్ట తనిఖీలు చేపట్టేందుకు వీలుగా టీటీడీ విజిలెన్స్ సిబ్బందిని నియమించారు. వీరు రోజూ వేకువజామున 3 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు షిప్టుల వారీగా పనిచేస్తూ తనిఖీలు నిర్వహిస్తుంటారు. కానీ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకుండా పోవడంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో అలిపిరి టోల్‌గేట్ వద్ద భద్రతా తనిఖీల్లో డొల్లతనం కొట్టొచ్చినట్లు స్పష్టమవుతోంది. ఇందుకు వాహనాల్లోని కొందరు వ్యక్తులను కిందికి దించకుండా అలాగే వాహనాల్లోనే ఉంచడం, మరికొందరిని బలవంతంగా వాహనాల్లో నుంచి కిందికి దింపి మనుషులను, లగేజీలను తనిఖీలు చేస్తుండడం విమర్శలకు తావిస్తోంది.
ఈ విధానంపై గతంలో అనేకసార్లు యాత్రికులు టీటీడీ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండాపోతోంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి యాత్రికు లు కార్లు, ఇతర వాహనాలు, ద్విచక్ర వాహనాలతో పాటు ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో నిత్యం వేలసంఖ్యలో తిరుమలకు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో తిరుమలకు నిషేధిత వస్తువులైన మాంసం, మారణాయుధాలు, మద్యం, గుట్కా, పాన్ ప్యాకెట్లు, పేలుడు పదార్థాలు ఏ మార్గంలోనూ.. ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకెళ్లకుండా కట్టడి చేయడమే ఈ టోల్‌గేట్‌లో చేపడుతున్న తనిఖీల ప్రధాన ఉద్ధేశం. కానీ అధికారుల పర్యవేక్షణా లోపం, సిబ్బంది నిర్లక్ష్యంతో అలిపిరి టోల్‌గేట్ వద్ద తనిఖీలు ఎవరి ఇష్టం వారిదే అన్నట్లు కొనసాగుతోంది. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోకుంటే భ విష్యత్‌లో ఇబ్బందులు తప్పవని పలువురు సూచిస్తున్నారు.
ఎవరైనా తనిఖీ తప్పనిసరి
టీటీడీ భద్రతా నియమాల ప్రకారం టోల్‌గేట్ వద్ద ప్రతి వాహనంలోని ప్రతి వ్యక్తినీ, లగేజీ బ్యాగులను కచ్చితంగా తనిఖీ చేయాల్సిందే. అందుకు భిన్నంగా ఎవరు వ్యవహరించినా ఉపేక్షించబోం. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి తనిఖీలను పటిష్టం చేస్తాం. - నందీశ్వరరావు, అలిపిరి అసిస్టెంట్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్