
రాజమండ్రి నుంచే సీఎం సమీక్షలు, ఆదేశాలు
సాక్షి, రాజమండ్రి : హైదరాబాద్ నుంచి ఆదివారమే విశాఖ చేరుకుని సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించాలనుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం ఉదయం 10 గంటల వరకూ రాజమండ్రిలోనే ఉండి పోవలసి వచ్చింది. విశాఖలో కమ్యూనికేషన్ వ్యవస్థ అస్తవ్యస్తమవడంతో ఆదివారం అర్ధరాత్రి వరకూ రాజమండ్రి ఆర్‌అండ్‌బీ అతిథిగృహం నుంచే అధికారులతో టెలీ సమీక్షలు చేసిన బాబు తిరిగి సోమవారం ఉదయం ఏడు గంటల నుంచి 9.30 వరకూ వివిధ శాఖల అధికారులకు ఫోన్‌లో ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం రాత్రి హైదరాబాద్ నుంచి విమానంలో గన్నవరం వచ్చిన చంద్రబాబు అక్కడి నుంచి కారులో రాజమండ్రి చేరుకున్నారు. రాత్రికి రాత్రే విశాఖ వెళ్లాలనుకున్నా వీలు కాలేదు.
విశాఖ జిల్లా నక్కపల్లి వద్ద 16వ నంబరు జాతీయ రహదారిపై విరిగిపడిన చెట్లను వెంటనే తొలగించడం కష్టమని అధికారులు చెప్పడంతో రాత్రికి రాజమండ్రిలోనే ఉండిపోయారు. సోమవారం ఉదయం 9.00 గంటలకే హెలికాప్టర్ సిద్ధమైనా విశాఖ వెళ్లాక కమ్యూనికేషన్ సమస్య తలెత్తుతుందన్న సందేహంతో రాజమండ్రి నుంచే కీలకమైన అంశాలపై ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఫోన్ చేసి తుపాను పీడిత ప్రాంతాల్లో పర్యటనకు రావాలని కోరారు. అనంతరం ఆర్ అండ్ బీ అతిథిగృహం నుంచి మధురపూడి విమానాశ్రయం చేరుకుని ప్రత్యేక హెలికాప్టర్‌లో విశాఖ బయల్దేరారు. ఆయన వెంట ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వెళ్లగా ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత కార్లలో విశాఖ వెళ్లారు. ఎమ్మెల్యేలు ఆకుల సత్యనారాయణ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పెందుర్తి వెంకటేష్, ముఖ్య కార్యదర్శి జవహర్‌రెడ్డి, కలెక్టర్ నీతూ ప్రసాద్, పోలీసు ఉన్నతాధికారులు సురేంద్రబాబు, రాధ, వెంకటేశ్వరరావు రాజమండ్రిలో సీఎంను కలిశారు.