మల్లారెడ్డిపేట(గంభీరావుపేట), న్యూస్‌లైన్: నాన్న.. దేశం కాని దేశంలో ఉన్నాడు. అమ్మ.. కనిపించకుండా ఎటో వెళ్లిపోయింది. ఆమె ఎక్కడుందో.. తిరిగి వస్తుందో రాదో..! నాన్న ఎప్పుడొస్తాడో తెలియదు. తల్లిదండ్రుల కోసం ఎదురుచూడలేక.. ఒంటరి జీవితాన్ని భరించలేక.. ఆ పసివాడు నిండు ప్రాణం తీసుకున్నాడు. ఈ హృదయ విదారక సంఘటన గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేటలో ఆదివారం జరిగింది.
గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి గ్రామానికి చెందిన చంద్రం, శ్యామల దంపతులకు రమ్య(13), వెంకటేశం(17) పిల్లలు. జీవనోపాధికోసం చంద్రం రెండేళ్ల క్రితం దుబాయి వెళ్లాడు. ఆయన వెళ్లిన కొద్ది రోజులకే శ్యామల ఇద్దరు పిల్లలను వదిలేసి కనిపించకుండా ఎటో వెళ్లిపోయింది. ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. ఆనాటి నుంచి పిల్లలు ఒంటరిగా మిగిలారు. మల్లారెడ్డిపేటలోని తాత దగ్గర కొన్ని రోజులు, రామక్కపేటలోని బంధువుల ఇంటి దగ్గర కొన్ని రోజులు ఉంటున్నారు.
వెంకటేశం తొమ్మిదోతరగతి మధ్యలో చదువు ఆపేశాడు. నాలుగైదు రోజులక్రితం మల్లారెడ్డిపేటలోని తాత ఎల్లయ్య ద గ్గరికి వెంకటేశం వచ్చి ఉంటున్నాడు. మానసిక వేదనకు గురై జీవితంపై విరక్తి చెంది ఆదివారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు తెలిపారు. సంఘటన సమాచారాన్ని గ్రామస్తులు దుబాయిలోని తండ్రి చంద్రంకు తెలిపారు. ఆయన దుబాయి నుంచి మల్లారెడ్డిపేటకు బయలుదేరాడు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై జాఫర్ షరీఫ్ తెలిపారు.
అమ్మా..నాన్న మీరు రారని..
Published Mon, Feb 17 2014 3:24 AM | Last Updated on Sat, Sep 2 2017 3:46 AM
Advertisement
Advertisement