కొలిమిగుండ్ల (కర్నూలు జిల్లా): అప్పటి వరకూ సరదాగా ఆడుతూ, కేరింతలు కొడుతూ కనిపించిన చిన్నారి నోరు మూగబోయింది. ఆడుకుంటూ స్నానాలగదిలోకి వెళ్లిన రెండేళ్ల బాలుడు నీటి బకెట్‌లో తలకిందులుగా పడిపోవడంతో మృతి చెందాడు. ఆలస్యంగా జరిగిన దారుణాన్ని చూసిన ఆ చిన్నారి తల్లిదండ్రులు బాధతో కుప్పకూలిపోయారు. ఈ ఘటన కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం కోటపాడు ఎస్పీ కాలనీలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది.
ఎల్ల కిట్టయ్య, లక్ష్మీదేవి దంపతుల రెండేళ్ల కుమారుడు జితేంద్ర ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. తల్లిదండ్రులు వారి పనుల్లో వారు ఉన్నారు. అయితే, జితేంద్ర స్నానాల గదిలోకి వెళ్లగా కాలు జారి బకెట్‌లో తలకిందులుగా పడిపోవడంతో ఊరిరాడక మృతి చెందాడు. గాలికి బాత్‌రూమ్ డోర్ కూడా మూసుకుపోవడంతో జరిగిన విషయం తల్లిదండ్రులకు తెలియలేదు. చిన్నారి మాట వినిపించకపోవడంతో ఎవరో ఒకరు ఎత్తుకుని ఉంటారులే అనుకున్నారు. కానీ, కొద్దిసేపటికి బాత్‌రూమ్‌లోని నీటి బకెట్‌లో జితేంద్ర విగతజీవిగా కనిపించడంతో... కిట్టయ్య, లక్ష్మీదేవి గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంటే చుట్టుపక్కల వారు కూడా చలించిపోయారు.
నీటి బకెట్‌లో పడి చిన్నారి మృతి
Published Mon, Jun 29 2015 10:49 AM | Last Updated on Sun, Sep 3 2017 4:35 AM
Advertisement