గచ్చిబౌలి: తల్లి స్నానం కోసం పెట్టుకున్న వేడి నీళ్ల బకెట్‌ను పట్టుకోవడంతో ప్రమాదవశాత్తు నీళ్లు మీదపడి తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందిన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ సీహెచ్ వెంకన్న తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
వికారాబాద్ జిల్లా దోమ మండలం గొడుగోనిపల్లికి చెందిన దంపతులు మైసం రాజు, సోనీ బతుకు దెరువు కోసం వచ్చి మణికొండలోని శివపురి కాలనీలో నివాసం ఉంటున్నారు. రాజు వాచ్‌మెన్‌గా పని చేస్తూనే కారు డ్రైవింగ్ చేస్తుంటాడు. ఈ నెల 6న సాయంత్రం 4.40 గంటల సమయంలో సోనీ స్నానం చేసేందుకు బకెట్‌లో హీటర్ పెట్టి నీళ్లను వేడి చేసింది. ఆమె కొడుకు ధీరజ్ (04) ఆడుకుంటూ బకెట్‌ను పట్టుకున్నాడు. బకెట్ కిందపడటతో నీళ్లన్నీ శరీరంపై పడి బాలుడికి 60 శాతం కాలిన గాయాలయ్యాయి.
వెంటనే గమనించిన తల్లి హుటాహుటిని సమీపంలోని ఓ ప్రైవేట్ అస్పత్రికి తరలించింది. అక్కడి నుంచి నిలోఫర్‌కు వెళ్లగా ఉస్మానియా ఆస్పత్రికి పంపించారు. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ధీరజ్ శుక్రవారం రాత్రి 11 గంటలకు మృతి చెందాడు. వేడి నీళ్లు మీదపడి ఒక్కగానొక్క మృతి చెందడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment