గోదావరి ఒడ్డునే నా రూమ్: చిరంజీవి
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ‘తెలుగు రాష్ట్రాల్లో గోదావరి నది ప్రవహించడం తెలుగువారి అదృష్టం. గోదావరి వల్లనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు భారతదేశపు ధాన్యాగారం అని పేరొచ్చింది. ఇప్పటికీ ఉభయగోదావరి జిల్లాల్లో రికార్డు స్థాయిలో పంటలు పండుతున్నాయంటే.. అది గోదావరి తల్లి చలవే. అటువంటి నదికి వచ్చే పుష్కరాలు అందరి జీవితాల్లో కొత్త కాంతులు తేవాలని ఆకాంక్షిస్తున్నాను’ రాజ్యసభ సభ్యుడు, సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి చెప్పిన మాటలివి. సినీ వినీలాకాశంలో మెగాస్టార్‌గా ఎదిగిన చిరంజీవి స్వస్థలం జిల్లాలోని మొగల్తూరు అనేది అందరికీ తెలిసిందే. పుష్కరాల నేపథ్యంలో ఆయన బాల్యంలోని జ్ఞాపకాలను, గోదావరి నదితో ఉన్న అనుబంధాన్ని, ఆకాంక్షలను ‘సాక్షి’తో ఇలా పంచుకున్నారు.
గోదావరి ఒడ్డునే నా రూమ్
గోదావరి నది గురించిన జ్ఞాపకాలు ఎన్నని చెప్పాలి. అన్నీ మరపురాని.. మధురమైన తీపిగుర్తులు. ఇప్పటికీ కళ్లముందు కదలాడుతున్నాయి. నరసాపురం వైఎన్ కాలేజీలో చదువుకునే రోజుల్లో గోదావరి తీరాన్నే ఒక రూమ్ అద్దెకు తీసుకుని ఉండేవాణ్ణి. అప్పుడే గోదావరి ఒడ్డుకెళ్లడం అలవాటుగా మారింది. నది మీదుగా వీచే చల్లని గాలుల్లో గడిపిన క్షణాలు ఎలా మర్చిపోగలం. అంతర్వేది వెళ్లి.. అక్కడ నదిలో.. ఆ తరువాత సముద్ర స్నానం చేసి.. పక్కనే ఉన్న లక్ష్మీనరసింహస్వామిని దర్శనం చేసుకోవడం మర్చిపోలేని అనుభూతి. గోదారి అందాలు చెప్పడానికి భాష చాలదు. వెన్నెల్లో గోదారి, వర్షంలో గోదారి, పాపికొండల్ని దాటుకుంటూ ఉరికి వచ్చే గోదారి, గలాగలా గోదారి, నిండు గోదారి, అఖండ గోదారి గురించి ఎంతమంది కవులు, రచయితలు ఎంత గొప్పగా వర్ణించారో చెప్పలేం. గోదావరి నది సాహితీ సేద్యానికి మూలధారం అయ్యింది. తెలుగు నేలలతో పాటు సాహితీ క్షేత్రాన్ని సుసంపన్నం చేసింది.
పుష్కరాల గురించి అమ్మ చెప్పేది
పుష్కర కాలంలో నదిలో స్నానం చేసి.. హారతి తీసుకుంటే ఆ పుణ్యం వంశవృక్షానికి చెందుతుందని మా అమ్మ చెప్పేది. సాధారణంగా నాన్న, తాత, ముత్తాత వరకు మనకు గుర్తుంటారు. ఆ పైన పెద్ద లు మనకు తెలిసే అవకాశం ఉండదు. పుష్కరాల్లో నదీ స్నానం చేసి పితృకార్యాలు నిర్వహిస్తే.. ఆ పుణ్యఫలం యావత్ వంశవృక్షానికి దక్కుతుందని.. పెద్దల పట్ల పిల్లలు పాటించాల్సిన ధర్మం అదేనని అంటారు. సత్సంప్రదాయాలు పాటించడం మన బాధ్యత. అందుకే పుష్కర స్నానం ఆచరించడానికి కోట్లాది మంది సన్నద్ధమవుతున్నారు. వారికి ఎటువంటి లోటుపాట్లు లేకుండా.. అపశృతులు దొర్లకుండా నిర్వహించడం ప్రభుత్వాల బాధ్యత. పెద్ద పండగ వాతావరణంలో పుష్కరాలు జరగాలని.. ఇరు రాష్ట్రాల ప్రజలకు మేలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
- మీ చిరంజీవి