108కి బ్రేకులు | Chittoor 108 Staff Switch Off Mobiles | Sakshi
Sakshi News home page

108కి బ్రేకులు

Published Thu, Apr 26 2018 9:34 AM | Last Updated on Thu, Apr 26 2018 9:34 AM

Chittoor 108 Staff Switch Off Mobiles - Sakshi

చిత్తూరు అర్బన్‌: మూలిగే నక్కపై తాటిపండు పడితే పరిస్థితి ఎలా ఉంటుంది..? చచ్చి ఊరుకుంటుంది. ప్రస్తుతం జిల్లాలో అత్యవసర సేవలందిస్తున్న 108 అంబులెన్సుల పరిస్థితి ఇలాగే తయారైంది. తమ డిమాండ్లను పరిష్కరించలేదంటూ బుధవారం సాయంత్రం నుంచి 108 అంబులెన్సు సిబ్బంది సెల్‌ఫోన్లు స్విచ్‌ ఆఫ్‌ చేసే శారు. ఇక నుంచి రోజుకు ఎనిమిది గంటలు మాత్రమే పనిచేస్తామంటూ స్పష్టం చేశారు.
సమస్యలు ఇవీ..

దశాబ్దానికి పైగా ప్రజలకు 108 అంబులెన్సుల ద్వారా సిబ్బంది అత్యవసర సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వీటి నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం భారత్‌ వికాస్‌ గ్రూపు (బీవీజీ)కు అప్పగించింది. రిపేర్లలో ఉన్న వాహనాలను బాగు చేయించాలని, రోజుకు 12 గంటల పాటు చేస్తున్న పనులను ఎనిమిది గంటలకు కుదించాలని ఎనిమిది నెలల కాలంగా 108 సి బ్బంది ప్రభుత్వానికి, అధికారులకు చెబుతూనే ఉ న్నారు. పనికి తగ్గ వేతనం ఇవ్వాలని కోరుతున్నారు. ప్రస్తుతం చెల్లిస్తున్న వేతనాలను 50 శాతానికి పెంచాలని డిమాండ్‌ చేస్తున్నారు. పాలకులు, యంత్రాంగం స్పందించకపోవడంతో ఏ క్షణమైనా తాము ఎనిమిది గంటల పని విధానంలోకి దిగుతామని హెచ్చరించారు. తాజాగా బుధవారం విజయవాడలో పుణేకు చెందిన బీవీజే సంస్థ నిర్వాహకులతో రాష్ట్ర 108 వాహన సిబ్బంది భేటీ అయ్యారు. సమస్యలు పరిష్కరించకపోవడంతో తామే సొంతంగా నిర్ణయం తీసుకుంటున్నట్లు సిబ్బంది పేర్కొన్నారు.

జిల్లాలో పరిస్థితి ఇలా...
జిల్లావ్యాప్తంగా 24 గంటల పాటు 45 వాహనాలు సేవలు అందించాల్సి ఉండగా ప్రస్తుతం 35 మాత్రమే పనిచేస్తున్నాయి. ఒక్కో వాహనంలో ఇద్దరు పైలెట్లు, ఇద్దరు టెక్నీషియన్లు ఉన్నారు. వీళ్లంతా బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి సెల్‌ఫోన్లు స్విచ్‌ ఆఫ్‌ చేసేశారు. రాష్ట్ర యూనియన్‌ పిలుపు మేరకు 8 గంటలు మాత్రమే తాము పనిచేస్తామని స్పష్టం చేశారు. ఫలితంగా ఇక నుంచి ఉదయం 4–8 గంటల మధ్య, సాయంత్రం 4–8 గంటల మధ్య తాము పనిచేయమని, ఆ సమయంలో సెల్‌ఫోన్లు సైతం స్విచ్‌ ఆఫ్‌ చేస్తామని పేర్కొన్నారు. రోజుకు సగటున ఒక్కో 108 వాహనం 16 మందికి అత్యవసర సేవలు అంది స్తోంది. ప్రభుత్వ చేతగానితనం వల్ల ఇక అత్యవసర వేళల్లో ఉపయోగించే 108 వాహనాలు 16 గంటలు మాత్రమే పనిచేయనున్నాయి. ఈ క్రమం లో అత్యవసర సేవలు ప్రశ్నార్థకంగా మారాయి.

మేమూ బతకాలి కదా...
మాకు కుటుంబాలు, పిల్లలు ఉన్నారు. 50 శాతం వేతనాలు పెంచాలని, ఎనిమిది గంటలు మాత్రమే పనిచేస్తామని కలెక్టర్, డీఎంఅండ్‌హెచ్‌ఓకు వినతులు ఇచ్చినా పట్టించుకోలేదు. ఇక నుంచి మాకు ఎనిమిది గంటల పని మాత్రమే ఉంటుంది. మిగిలిన సయయంలో సెల్‌ఫోన్లు స్విచ్‌ ఆఫ్‌ చేస్తాం.– శివకుమార్, 108 సిబ్బంది జిల్లా అధ్యక్షుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement