పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, రెడ్డెప్ప, బల్లి దుర్గాప్రసాద్
సాక్షి, చిత్తూరు : జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామని కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ మంత్రిత్వ శాఖలకు పార్లమెంటరీ సలహా సంఘ సభ్యులుగా గురువారం ఎంపికైన జిల్లాకు చెందిన ఎంపీలు మిధున్‌రెడ్డి, రెడ్డెప్ప, బల్లి దుర్గాప్రసాద్ తెలిపారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సలహా సంఘం సభ్యునిగా నియమితులైన రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి మాట్లాడుతూ, రాజంపేట పరిధిలోని గ్రామాల్లో ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు చొరవ చూపుతానన్నారు. కేంద్రంతో చర్చించి గ్రామాల అభివృద్ధికి విశేష కృషి చేస్తామని చెప్పారు. పర్యాటక, సాంస్కృతిక పార్లమెంటరీ సలహా సభ్యునిగా ఎంపికైన చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప మాట్లాడుతూ, జిల్లాలోని సాంస్కృతిక, టూరిజం ప్రదేశాలను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానన్నారు.
హార్సిలీహిల్స్, తలకోన, కైగల్, పులిగుండు తదితర పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. షిప్పింగ్ పార్లమెంటరీ సభ్యులుగా ఎన్నికైన తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ, నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం రేవు అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఆ రేవు నుంచి ఇతర దేశాలకు సరుకులు ఎగుమతి చేసేలా ఒప్పందాలు చేసుకునేందుకు చొరవ చూపుతానన్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పనిచేసి ప్రజల సమస్యలను పరిష్కారిస్తామని ఎంపీలు పేర్కొన్నారు. పార్లమెంటరీ సలహా సంఘంలో జిల్లాకు చెందిన ఎంపీలు ఎంపిక కావడం పట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment