ప్రజల జీవితాల్లో వెలుగు నింపే క్రిస్మస్ | Christmas is the light that fills the lives of the people | Sakshi
Sakshi News home page

ప్రజల జీవితాల్లో వెలుగు నింపే క్రిస్మస్

Published Thu, Dec 19 2013 1:48 AM | Last Updated on Sat, Sep 2 2017 1:45 AM

ప్రజల జీవితాల్లో వెలుగు నింపే క్రిస్మస్

ప్రజల జీవితాల్లో వెలుగు నింపే క్రిస్మస్

విజయవాడ, న్యూస్‌లైన్ : క్రైస్తవ భక్తిగీతాలు... నృత్య ప్రదర్శనలు... కొవ్వొత్తుల వెలుగుల మధ్య క్రిస్మస్ వేడుకలు, సిటీ క్యాండిల్ లైట్ కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహంగా జరిగింది. క్రైస్ట్ కల్వరీ టెలివిజన్ శాటిలైట్ చానల్-విజయవాడ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి స్వరాజ్ మైదానంలో జరిగిన ఈ వేడుకల్లో నగరంలోని వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొని క్రైస్తవ భక్తి గీతాలు ఆలపించారు. నృత్యరూపకాలను ప్రదర్శించారు. ఏసుక్రీస్తు జననం, జీవిత విశేషాలను వివరిస్తూ చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శన సభికులను ఆకట్టుకుంది.

మేరీమాత, బాలఏసు, దేవదూతల వేషధారణలతో చిన్నారులు క్రీస్తు జీవిత విశేషాలను కళ్లకు కటినట్టు చూపించారు. వేదికపై విద్యుత్ దీపాలతో అలంకరిం చిన క్రిస్మస్ ట్రీని ఏర్పాటుచేశారు. వేలాదిగా హాజరైన భక్తులు కొవ్వొత్తులతో భారీ ప్రదర్శన నిర్వహించారు. కరుణామయుడికి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కొవ్వొత్తుల వెలుగుతో స్వరాజ్ మైదానం శోభాయమానంగా మారింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పౌరసరఫాల శాఖ డెరైక్టర్, నగరపాలక సంస్థ మాజీ కమిషనర్ జి.రవిబాబు ‘క్రైస్ట్ కల్వరీ టెలివిజన్ శాటిలైట్ చానల్’ను లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనిషి జీవితంలో చీకటిని పారదోలి వెలుగులు నింపడమే క్రిస్మస్ సందేశమని అన్నారు. అనంతరం ఏఈ మిషన్ డెరైక్టర్ రెవరెండ్ డాక్టర్ లంకా కరుణాకర్‌దాస్ వాక్యోపదేశం చేశారు. క్రీస్తు బోధనలు, సందేశాలను నిరంతరం ప్రజలకు అందించేందుకే చానల్ ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. చానల్ సేవలు జనవరి నుంచి అందుబాటులోకి వస్తాయని తెలి పారు. మనుషులను పాపముల నుంచి రక్షించేందుకే ఏస్తుక్రీస్తు మానవరూపంలో జన్మించాడని కొనియాడారు. క్రీస్తు జననంతో లోకానికి వెలుగు వచ్చిందన్నారు. దానికి సూచికగానే భారీ క్యాండిల్ ప్రదర్శన నిర్వహించినట్లు చెప్పారు.

అనంతరం వైఎస్సార్ సీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త పూనూరు గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ ఏసుక్రీస్తు చూపిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలన్నారు. శాంతి, సహనం, క్షమాగుణం వంటి గొప్ప లక్షణాలను క్రీస్తు మానవాళికి బోధించారని తెలిపారు. ఆ గొప్ప లక్షణాలను  మానవులు అందిపుచ్చుకోవాలని సూచించారు. రాష్ట్ర గ్రామీణాభివృద్ది శాఖా మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ పాల్గొని ప్రజలకు క్రిస్మస్ సందేశాన్ని వివరించారు.

ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.  మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్, డీఎం అండ్ హెచ్‌వో సరసిజాక్షి, జి.స్టెల్లా రవి బాబు, మాజీ డెప్యూటీ మేయర్ ఎస్‌పీ గ్రిటన్, క్రైస్తవ ప్రముఖులు కొడాలి ఏలియా, డేవిడ్ బెన్‌హామ్, డి.ప్రసాదరావు, పచ్చిగోళ్ల ఆనందరావు, పాలపర్తి జయకర్, వివిధ క్రైస్తవ సంఘాల ప్రతినిధులు, పాస్టర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement