హైదరాబాద్: చుండూరు కేసు విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని పలువురు వక్తలు ఆరోపించారు. గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ‘అందరూ నిర్దోషులైతే చుండూరు దళితుల్ని చంపింది ఎవరు?’ అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. హైకోర్టు సీనియర్ అడ్వొకేట్, ఆర్పీఐ అధ్యక్షుడు బొజ్జా తారకం, మాజీ ఐఏఎస్ అధికారి కాకి మాధవరావు, హెచ్‌ఎంటీవీ సీఈవో రామచంద్రమూర్తి తదితరులు ప్రసంగించారు. చుండూరులో దారుణం జరిగిన వెంటనే పోలీసులు చార్జిషీటు దాఖలు చేయలేదని, కనీసం కోర్టులో సరైన ఆధారాలను ప్రవేశపెట్టలేదన్నారు.
దళితులను చంపిన వారికి శిక్షలు పడకపోవటం దుర్మార్గమని విమర్శించారు. న్యాయ సూత్రాలను తుంగలో తొక్కి తీర్పునిచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లకుంటే తామే ప్రైవేటుగా అప్పీల్ చేస్తామని హెచ్చరించారు. చుండూరు కేసులో న్యాయం కోసం జైలుకెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో సామాజికవేత్త సాంబశివరావు, డాక్టర్ వై.బి.సత్యనారాయణ, ఐ.మైసయ్య, ప్రభాకర్, సీడీఎస్ నాయకులు ఆంజనేయులు, కెవీపీఎస్ నాయకులు జాన్‌వెస్లీ తదితరులు పాల్గొన్నారు.
‘చుండూరు’పై పోలీసుల నిర్లక్ష్యం: ప్రజాసంఘాలు
Published Fri, Apr 25 2014 12:41 AM | Last Updated on Tue, Aug 21 2018 7:39 PM
Advertisement