
26న ఉపరాష్ట్రపతి వెంకయ్యకు పౌర సన్మానం
- 23 కి.మీ. మేర జాతీయ జెండాలతో స్వాగతం
- 2.25 లక్షల ఇళ్లకు శంకుస్థాపన
సాక్షి, విజయవాడ: భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తొలిసారిగా రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా ఈ నెల 26న వెలగపూడిలో ఆయనకు పౌరసన్మానం చేయనున్నారు. ఈ సందర్భంగా గురువారం విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాట్లపై రాష్ట్ర మంత్రులు పి.నారాయణ, దేవినేని ఉమామహేశ్వరరావు, కామినేని శ్రీనివాస్‌లు సమీక్షించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ.. ఉప రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
ఉదయం 9.20 గంటలకు వెంకయ్యనాయుడు గన్నవరం ఎయిర్ పోర్టుకు వస్తారని, అక్కడి నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు సుమారు 23 కి.మీ. మేర రోడ్డుకు ఇరువైపులా జాతీయ జెండాలు పట్టుకుని విద్యార్థులు, ప్రజలు, అభిమానులు ఆయనకు స్వాగతం పలుకుతారని తెలిపారు. కేంద్రమంత్రిగా వెంకయ్యనాయుడు రాష్ట్రానికి 2.25 లక్షల ఇళ్లు మంజూరు చేస్తూ చివరి సంతకం చేశారని, ఆ ఇళ్ల శంకుస్థాపన ఆయన చేతుల మీదుగానే చేయిస్తున్నట్లు మంత్రులు వెల్లడించారు. దీన్ని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు.