పెదపాడు : చౌక ధరల దుకాణాల ద్వారా ప్రజలకు నిత్యావసరాలు సక్రమంగా అందుతున్నాయో లేదో సమీక్షించేందుకు నియమించాల్సిన పౌరసరఫరాల కమిటీలు కానరావడం లేదు. ప్రతి మూడు లేదా ఆరు నెలలకోసారి మండలస్థాయిలో ఈ కమిటీ సభ్యులు సమావేశమై లబ్ధిదారులకు నిత్యావసర వస్తువులు సక్రమంగా అందుతున్నాయో లేదా సమీక్షించే వారు. లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి వారు చర్యలు తీసుకునేవారు. దాదాపు మూడేళ్లుగా ఆ కమిటీలను నియమించకపోవడంతో రేషన్ దుకాణాల్లో సరుకుల పంపిణీ అస్తవ్యస్తంగా మారింది. డీలర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో సరుకులు పక్కదారిపడుతున్నా అడిగే నాథుడు కరువయ్యాడు.
కుటుంబాల కంటే రేషన్ తీసుకుంటున్న వారే అధికం
జిల్లాలో 11 లక్షల 53 వేల 662 రేషన్ కార్డుదారులు ఉన్నారు. వీరిలో 9 లక్షల 95 వేల 829 తెల్లకార్డులు, 1307 అన్నపూర్ణ కార్డులు, 74 వేల 930 రచ్చబండ కార్డులు ఉన్నాయి. దాదాపు గ్రామానికి 15 మంది చొప్పున నూతన కార్డుల కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు. సుమారు 8 శాతం మంది కార్డుల్లో వారి పిల్లల పేర్లను నమోదు చేయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా జిల్లాలో ఉన్న కుటుంబాల కంటే రేషన్ తీసుకుంటున్న కుటుంబాలు అధికంగా ఉన్నట్టు స్పష్టంగా కన్పిస్తోంది. పేదలకు ప్రభుత్వం సబ్సిడీపై అందించే నిత్యావ సరాలు పక్కదారి పడుతున్నాయని చెప్పడానికి ఇదో ఉదాహర ణ.
ఆవాస ప్రాంతాలకు దూరంగా దుకాణాలు
నివసించే ప్రాంతాలకు దగ్గరలో పౌరసరఫరాల దుకాణాలు లేకపోవడం వల్ల ప్రజలు అవస్థలు పడుతున్నారు. షాపులు కొన్ని ప్రాంతాలలో రెండు నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండడంతో ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ ఆటో, రిక్షా చార్జీల రూపంలో పోతోందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధిక ధరలకు నిత్యావసరాలు
దుకాణాల తనిఖీలు లేకపోవడం, ముడుపులు ఇస్తున్నామనే ధీమా ఉండడంతో డీలర్లు అధిక ధరలకు అమ్ముతున్నారు. కిలో పంచదార రూ.13.50 అమ్మాల్సి ఉండగా కొన్నిచోట్ల దానిని రూ.16కు విక్రయిస్తున్నారు.
డీలర్ల దోపిడీ
కార్డుదారు ఎవరైనా చనిపోతే రేషన్ డీలర్లు వెంటనే వారికి సరుకులను నిలుపుదల చేసి ఆ రేషన్‌ను కాజేస్తున్నారు. ఇలాంటి సమస్యలు జిల్లావ్యాప్తంగా ఉన్నా అధికారులు పట్టించుకోవడంలేదని ప్రజలు విమర్శిస్తున్నారు. డబ్బులు అవసరమైనవారి కార్డులను డీలర్లు తనఖా పెట్టుకుని రేషన్‌ను కాజేస్తున్నారు. జిల్లాలో చాలాచోట్ల షాపులను ఇన్‌చార్జిలు నిర్వహిస్తుండగా కొన్నిచోట్ల బినామీ డీలర్లతో లాగిస్తున్నారు. షాపు యజమాని కొంత సొమ్మును తీసుకుని బినామీలకు అప్పగిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 8 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు అమ్మకాలు చేపట్టాల్సి ఉండగా జిల్లాలోని చాలాచోట్ల ఒక పూట మాత్రమే తెరుస్తున్నారు. దీంతో ఏ సమయంలో రేషన్ ఇస్తారోనని కళ్లలో వత్తులు పెట్టుకుని ఎదురు చూడాల్సిన దుస్థితి ఉంది. రికార్డుల నిర్వహణా అంతంతమాత్రంగానే ఉంది.
కానరాని పౌరసరఫరాల కమిటీలు
Published Sat, Nov 22 2014 3:58 AM | Last Updated on Sat, Sep 2 2017 4:52 PM
Advertisement
Advertisement