స్థానికతపై ఏపీపీఎస్సీ క్లారిటీ
ఏపీపీఎస్సీ ద్వారా భర్తీకి అనేక మార్గాల్లో స్థానిక, స్థానికేతర నిర్ణయం
- స్థానికతపై అభ్యర్థుల్లో పలు సందేహాలు
- స్పందించిన ఏపీపీఎస్సీ కార్యదర్శి సాయి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే వివిధ పోస్టుల భర్తీలో స్థానిక, స్థానికేతర రిజర్వేషన్లు రాజ్యాంగంలోని ఆర్టికల్–371డీ తో పాటు తత్సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి నిర్ణయాలుంటాయని కమిషన్ కార్యదర్శి వైవీఎస్‌టీ సాయి తెలిపారు. ఏపీపీఎస్సీ నిర్వహించే వివిధ పోస్టుల భర్తీలో స్థానిక, స్థానికేతర అంశంపై అభ్యర్థులనుంచి వ్యక్తమవుతున్న సందేహాలపై ఆయన స్పందిస్తూ పలు అంశాలను ‘సాక్షి’కి వివరించారు. మౌలికంగా ఆర్టికల్–371డీతో పాటు 1975లో ప్రభుత్వం ఇచ్చిన జీఓ నంబర్–674, ఇతర జీఓల ఆధారంగా స్థానికతను గుర్తిస్తుంటారని చెప్పారు. కనీస విద్యార్హతలు నిర్ణయించని పోస్టులకు నివాసం ఆధారంగా, విద్యార్హతలు నిర్ణయించిన పోస్టులకు ఆయా అభ్యర్థులు చదివిన ప్రాంతంతో పాటు, కొన్ని సమయాల్లో నివాసం ఆధారంగా స్థానికతను నిర్ణయిస్తారని వివరించారు. 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అంతరాయం లేకుండా ఒకే ప్రాంతంలో చదివి ఉంటే ఆ ప్రాంతానికి లోకల్ అవుతారని స్పష్టంచేశారు.
10వ తరగతి లోపు వేర్వేరు ప్రాంతాల్లో చదివి ఉంటే
అభ్యర్థులు 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆంధ్ర ప్రదేశ్‌లోనే వేర్వేరు ప్రాంతాల్లో చదివి ఉంటే ఏ ప్రాంతంలో ఎక్కువ సంవత్సరాలు చదివారో ఆ ప్రాంతానికి లోకల్ అవుతారని కార్యదర్శి తెలిపారు. ఒకవేళ ఒకటికన్నా ఎక్కువ ప్రాంతాల్లో సమానమైన కాలం చదివి ఉంటే చివరిగా ఎక్కడ చదివారో ఆ ప్రాంతమే లోకల్ అవుతుందని చెప్పారు. ఇది జిల్లా, జోనల్ స్థాయిని అనుసరించి నిర్ణయిస్తారన్నారు. 4నుంచి 10వ తరగతి మధ్యలో ఒక సంవత్సరం అంతరాయం వచ్చినా దాన్ని పరిగణనలోకి తీసుకోకుండా స్థానికతను నిర్ణయిస్తారని చెప్పారు. 4నుంచి 10వ తరగతి మధ్యలో కొన్నేళ్లు ఖాళీగా ఉండిపోయి, ఆ తరువాత గుర్తింపులేని పాఠశాలలో పదో తరగతి చదివిన వారికి స్థానికత నివాసం ఆధారంగా గుర్తిస్తారని ఆయన తెలిపారు.
స్థానిక, స్థానికేతర పోస్టుల శాతం
ఏపీపీఎస్సీ భర్తీచేసే పోస్టుల్లో స్థానిక, స్థానికేతరులకు వివిధ కేటగిరీల్లో పలురకాల శాతాల మేర ఉద్యోగాలను రిజర్వు చేస్తుంటారని కార్యదర్శి తెలిపారు. సాధారణంగా రాష్ట్ర క్యాడర్‌కు 60 శాతం ఉంటుందని, నాన్‌గెజిటెడ్ ఉద్యోగాలకు 70 శాతం ఉంటుందని చెప్పారు. గ్రూప్–4 ఉద్యోగాల్లో 80 శాతం స్థానిక రిజర్వేషన్ ఉంటుందని వివరించారు. స్థానిక కోటాలో రిజర్వు కాని పోస్టులకు అందరూ అర్హులే అవుతారని, ఈ పోస్టులను మెరిట్ ఆధారంగా భర్తీచేస్తారని స్పష్టంచేశారు.
రాష్ట్ర విభజనతో ఏర్పడిన సమస్యలపై...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు హైదరాబాద్, తెలంగాణ ప్రాంతాల్లో చదువుకున్న అభ్యర్థుల కుటుంబ సభ్యు లు, వారి జన్మ మూలాలు ఆంధ్రప్ర దేశ్‌లోనే ఉన్నప్పటికీ ఏపీకి స్థానిక అభ్య ర్థులు కాబోరని కార్యదర్శి స్పష్టంచేశారు. అలాంటి అభ్యర్థులు 2014 జూన్ 2నుంచి 2017 జూన్1 వ తేదీ లోపల ఏపీకి ప్రవాసం/వలస వెళ్లినట్లయితేనే లోకల్ అభ్యర్థులుగా గుర్తింపు పొందుతా రని చెప్పారు. ఇందుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం జారీచేసిన సర్క్యులర్ మెమో 4136/ఎస్‌పీఎఫ్ అండ్ ఎంసీ/2015–5 ను పరిశీలించుకోవాలని సూచించారు. స్థానిక ధ్రువపత్రం పొందడానికి రెవెన్యూ అధికారులకు అభ్యర్థన ఇవ్వాలని చెప్పా రు. ఏపీ రాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో ఉం టూ రోజూ పక్క రాష్ట్రంలోని స్కూళ్లకు వెళ్లి చదువుకొని వచ్చే వారి విషయంలో ఏపీ ట్రిబ్యునల్ 2015 జనవరి 23న ఇచ్చిన తీర్పును (ఓఏ నంబర్ 6947/2012) అనుసరించి ఏపీకి స్థానికులవుతారని, అయితే ఈ విషయంలో తుది నిర్ణయం రెవెన్యూ అధికారులదేనని చెప్పారు.