
ప్రజలే నిలదీసే రోజులు దగ్గరలో ఉన్నాయ్..
అనంతపురం అర్బన్:
వంచనచేసి అధికార పీఠం ఎక్కిన టీడీపీ ప్రజాప్రతినిధులను ప్రజలు నిలదీసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి సాకే శైలజానాథ్ అన్నారు. జిల్లాలో రైతులకు పంట నష్టపరిహారం, ఇన్సూరెన్స్, డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు, తదితర డిమాండ్లతో జిల్లా కాంగ్రెస్ కమి టీ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహిం చారు. ధర్నాను ఉద్దేశించి శైలజానాథ్ మా ట్లాడారు. వర్షాభావంతో పంటలులేక సంక్షోభంలో చిక్కుకుని జిల్లా రైతు లు విలవిల లాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పశువులకు గడ్డి కూడా కరువైందన్నారు. అయినా అధికారపార్టీ ప్రజాప్రతినిధులకు చీమకుట్టినట్లైనా లేదన్నారు. ప్రజా సమస్యలను గాలికి వదిలి అక్రమసంపాదనలో మునిగితేలుతున్నారని ఆరోపించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బతికి ఉంటే చంద్రబాబునాయుడు రాజకీయాల నుంచి పూర్తిగా విశ్రాంతి తీసుకునే వారని శైలజానాథ్ ఎద్దేవా చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జీడిపల్లి రిజర్వాయర్‌కు నీళ్లు తెస్తే.. ఆ ప్రాజెక్టుకు ఎన్‌టీఆర్ పేరు పెట్టాలని చంద్రబాబు సూచించారని మంత్రి దేవినేని ఉమా చెప్పడం ఎంతో దౌర్భాగ్యం అని విమర్శించారు.
జిల్లా ప్రధాన కార్యదర్శి బీసీ నాగరాజు మాట్లాడుతూ జిల్లాలో రౌడిషీటర్లకు ఎమ్మెల్యే పదవులు, జెడ్పీ చైర్మన్ పదవులు, ఇస్తుంటే ఈ ప్రభుత్వం పనితీరు ఎలా ఉంటుందో అర్థం అవుతోందన్నారు. నారాయణ, సీఎం రమేష్, సుజనచౌదరి, చంద్రమోహన్ లాంటి ప్రజా దోపిడీదారులకు మంత్రి పదవులు అంటగట్టారని విమర్శించారు. రైతులకు, డ్వాక్రా మహిళాలకు, నేతన్నల రుణాలు వెంటనే మాఫీ చేయాలని, జిల్లా రైతులకు న్యాయం చేయకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదన్నారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు ఆర్డీఓ కార్యాలయం ముట్టడికి యత్నించగా పో లీసులు వారిని అడ్డుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు దాదాగాంధీ, నియోజకవర్గ ఇన్‌చార్జ్ గోవర్ధన్‌రెడ్డి, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ జయచంద్రనాయుడు, గ్రంథాలయ సంస్థ చైర్మన్, కుండ్ల నరసింహరెడ్డి, నాయకులు, కార్యకర్తలు, మహిళ నాయకురాళ్లు లక్ష్మిదేవి, నాగలక్ష్మి, పార్వతమ్మ, తదితరులు పాల్గొన్నారు.