మూతపడిన ఎన్టీటీపీఎస్ | Closed LTPS | Sakshi
Sakshi News home page

మూతపడిన ఎన్టీటీపీఎస్

Published Tue, May 27 2014 1:47 AM | Last Updated on Tue, Sep 18 2018 8:28 PM

మూతపడిన ఎన్టీటీపీఎస్ - Sakshi

మూతపడిన ఎన్టీటీపీఎస్

  •   విద్యుత్ సంక్షోభం మరింత తీవ్రం
  •   సిబ్బంది సమ్మెతో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం
  •   ప్లాంట్‌లోని ఏడు యూనిట్లూ మూత
  •   ఒక్కరోజులో 42 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి నిలిచిపోయిన వైనం
  •  విద్యుత్ సంక్షోభం సోమవారం మరింత తీవ్రమైంది. ఎన్టీటీపీఎస్ సిబ్బంది సమ్మెతో ప్లాంట్‌లోని ఏడు యూనిట్లూ మూతపడ్డాయి. దీంతో ఒక్కరోజులోనే 42 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి నిలిచిపోయింది. ఈ ప్రభావం దక్షిణాది గ్రిడ్‌పైనా పడుతుందని అధికారులు చెబుతున్నారు. గతంలో సమైక్యాంధ్ర ఉద్యమంలోనే ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిచిపోయింది. సోమవారం రాత్రికి యాజమాన్యంతో జరిగిన చర్చలు ఫలించటంతో ఉద్యోగుల సమ్మె విరమించారు. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
     
    సాక్షి, విజయవాడ : నిత్యం విద్యుత్ వెలుగులను విరజిమ్మే ఇబ్రహీంపట్నంలోని నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (ఎన్టీటీపీఎస్) సోమవారం ఉదయం మూతపడింది. వేతన సవరణ (పీఆర్‌సీ) అమలుపై యాజమాన్యం నిర్లక్ష్య వైఖరికి నిరసనగా విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఎన్టీటీపీఎస్‌లోని ఇంజినీర్లు, సిబ్బంది ఆదివారం ఉదయం మెరుపు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. ఎన్టీటీపీఎస్‌లో ఏడు యూనిట్లు ఉన్నాయి.

    సిబ్బంది సమ్మెకు దిగడంతో ఆదివారమంతా అధికారులు ఏదోక విధంగా నెట్టుకొచ్చారు. మధ్యాహ్నం నుంచి ఒక్కొక్క యూనిట్ మూతపడుతూ వచ్చింది. సోమవారం ఉదయానికి ఏడు యూనిట్లు మొరాయించడంతో ఇంజినీర్లు చేతులెత్తేశారు. అంతకుముందు చీఫ్ ఇంజినీర్ సమ్మయ్య కార్మిక సంఘాల నేతలతో చ ర్చలు జరిపి విద్యుత్ ఉత్పత్తికి సహకరించాలని కోరినప్పటికీ వారు ససేమిరా అన్నారు.
     
    బొగ్గు కొరతతో సమస్యలు ఉత్పన్నం..

    ప్లాంట్‌లో ఏడు  యూనిట్లు పనిచేయడానికి రోజుకు 25 వేల టన్నుల బొగ్గు అవసరం అవుతుంది. ఈ బొగ్గు రైల్వే వ్యాగన్ల ద్వారా ఒడిశా, తెలంగాణలోని సింగరేణి నుంచి దిగుమతి అవుతుంది. ప్రస్తుతానికి ఆయా ప్రాంతాల నుంచి వ్యాగన్ల ద్వారా వచ్చిన బొగ్గును టిప్పర్లలో ప్లాంట్‌లోని కన్వేయర్ బెల్ట్ పైకి చేర్చుతారు. ప్రస్తుతం ఇంజినీర్లు, కార్మికులు సమ్మెలోకి వెళ్లడంతో బొగ్గు సరఫరా నిలిచిపోయింది. ఆయిల్ ఫైరింగ్ ద్వారా యూనిట్లను ఆదివారం పనిచేయించినా సోమవారం సాధ్యపడలేదు. అధికారులు ప్లాంట్‌ను మూసివేశారు. తొలుత రెండో యూనిట్ మూతపడగా.. చివరగా నాలుగో యూనిట్ మూతపడింది.
     
    రోజుకు 42 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి..

    ఎన్టీటీపీఎస్‌లో ఏడు యూనిట్ల ద్వారా 1760 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. మొదటి ఆరు యూనిట్లు ఒక్కొక్కటి 210 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఏడో యూనిట్ 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. మొదటి ఆరు యూనిట్లు ఒకరోజు పనిచేయడం వల్ల 30 మిలియన్ యూనిట్లు, ఏడో యూనిట్ పనిచేయడం వల్ల 12 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కన ఒక్క సోమవారం విద్యుత్ ఉత్పత్తి ఆగిపోవడం వల్ల సుమారు 42 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి నిలిచిపోయింది.
     
    దక్షిణాది గ్రిడ్‌పై ప్రభావం..
     
    ఎన్టీటీపీఎస్‌లో ఉత్పత్తి అయిన విద్యుత్ రాష్ట్ర గ్రిడ్ ద్వారా దక్షిణాది గ్రిడ్‌కు అనుసంధానం చేస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలోని విద్యుత్ ఉద్యోగులంతా సమ్మెకు దిగడంతో ఉత్పత్తి భారీగా తగ్గిపోయిందని అధికారులు చెబుతున్నారు. దీని ప్రభావం దక్షిణాది గ్రిడ్‌పై పడే అవకాశం ఉంది. ప్రస్తుతానికి గ్రామాలు, పట్టణాల్లో మాత్రమే విద్యుత్ కోతలు విధిస్తున్నారు. సమ్మె కొనసాగిస్తే విద్యుత్ ఉత్పత్తి భారీగా తగ్గిపోయి దాని ప్రభావం రైళ్లు, విమాన సర్వీసులపై కూడా పడుతుందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడుల్లో కూడా విద్యుత్ కోతలు విధించాల్సి వస్తుందని తెలిసింది. ముఖ్యంగా హైదరాబాద్‌కు విద్యుత్ సంక్షోభం పెరిగే అవకాశం ఉంది.
     
    పునరుద్ధరణకు ఒకటిన్నర రోజులు...

    ఎన్టీటీపీఎస్‌లో ఏడు యూనిట్లు ఒకేసారి మూతపడడంతో వీటిని పునరుద్ధరించడం కష్టమే. ఇంజినీర్లు, సిబ్బంది విధులకు హాజరైన తర్వాత ఎన్టీటీపీఎస్ పూర్తిస్థాయి సామర్థ్యంలోకి రావడానికి ఒకటిన్నర రోజులు పడుతుందని ఇంజినీర్లు ‘సాక్షి’కి తెలిపారు. సిబ్బంది అంతా ఒకేసారి విధులకు హాజరయితే ఒకేసారి అన్ని యూనిట్లను ప్రారంభించేందుకు ప్రయత్నించవచ్చు.
     
    ఏడాది వ్యవధిలో రెండోసారి..
     
    జాతీయ స్థాయిలో ఎంతో గుర్తింపు ఉన్న ఎన్టీటీపీఎస్‌లోని అన్ని యూనిట్లూ ఒకేసారి మూతపడడం అదుదైన విషయం. సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున సాగిన సందర్భంగా గత ఏడాది అక్టోబర్ ఏడున ఎన్టీటీపీఎస్ పూర్తిగా మూతపడింది. తాజాగా విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో సోమవారం రెండోసారి మూతపడింది. యాజమాన్యం దిగివచ్చి తమ పీఆర్‌సీని అంగీకరించేవరకు ప్లాంట్‌లోకి అడుగుపెట్టేది లేదని నేతలు స్పష్టం చేశారు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement