తీవ్రమైన ఇక్కట్‌లు
విజయనగరం మున్సిపాలిటీ న్యూస్‌లైన్ : విద్యుత్ కోతలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఓ వైపు ఎండ వేడిమితో అల్లాడిపోతున్న జిల్లా వాసులను మరో వైపు విద్యుత్ కోతలు వేధిస్తున్నాయి. ప్రధానంగా రాత్రి వేళల్లో విధిస్తున్న కోతలతో నరకం చూస్తున్నారు. ఇన్వెర్టర్లున్నా ప్రయోజనం లేకుండా పోతోందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. శుక్రవారం రాత్రి జిల్లా వ్యాప్తంగా మొత్తం ఐదు గంట ల పాటు కోత విధించడం ఇందుకు ఉదాహరణ. అదే తరహాలో శ నివారం సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 8. 30 గంటల వరకు కోత విధించారు. అంతేకాకుండా పగటి సమయంలో కూడా కోతలు విధించడంతో ప్రభుత్వ కార్యాలయాల్లో కార్యకలాపాలు స్తంభించిపోతున్నాయి.
డిమాండ్‌కు, కేటాయింపులకు మధ్య భారీ వ్యత్యాసం నెలకొనడంతో కోతలు అనివార్యమవుతున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లాకు 6.036 ఎంయూ(మిలియన్ యూనిట్లు) విద్యుత్ అవసరం కాగా కేటాయింపు 5.011 ఎంయూ మాత్రమే ఉంది. సుమారు ఒక ఎంయూ విద్యుత్ డిమాండ్‌కు కోటా వ్యత్యాసం కనిపిస్తోంది. దీంతో కోతలు అనివార్యమవుతున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభం అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా పడిపోవడంతో ఏపీఈపీడీసీఎల్ అధికారులు ఎడాపెడా కోతల వాతల పెడుతున్నారు. దీంతో ప్రభుత్వ కార్యాలయాల్లో, పారిశ్రామిక వాడల్లో కార్యకలాపాలు స్తంభించి, ప్రగతి కుంటుపడుతోంది. విద్యుత్ కోతలతో చిన్నారులు, మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
జిల్లా కేంద్రంతో పాటు మున్సిపాలిటీలు, మండల కేంద్రాల్లో 4 నుంచి 5 గంటల పాటు పగటి సమయంలో అధికారిక కోతలు ప్రకటించిన అధికారులు గ్రామీణ ప్రాంతాల్లో ఎ-గ్రూప్ కేటగిరికి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, బి-గ్రూప్ కేటగిరీకి ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మొత్తం 8 గంటల పాటు సరఫరా నిలిపివేస్తున్నారు. ఇవి కాకుండా అత్యవసర సమయాల్లో ఈఎల్‌ఆర్ (ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్) పేరుతో కోతలు విధించినున్నట్లు అధికారులు చెబుతున్నారు. గత రెండు రోజులుగా పరిశీలిస్తే రూరల్ ఫీడర్‌పై ఉన్న గృహావసర విద్యుత్ కనెక్షన్‌లకు రాత్రి, పగలు తేడా లేకుండా కోత విధిస్తున్నారు. రాత్రి వేళలలో 2 నుంచి 5 గంటల పాటు విధిస్తున్న కోత కారణంగా అన్ని వర్గాల ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. ఇక పట్టణాల్లో విధించే కోతలతో చిరువ్యాపారులు తీవ్రంగా నష్టాలు చవిచూడాల్సిన పరిస్థితి నెలకొంది.
స్తంభిస్తున్న కార్యకలాపాలు ...
విద్యుత్ కోతల కారణంగా జిల్లా వ్యాప్తంగా కార్యకలాపాలు స్తంభించిపోతున్నాయి. ప్రైవేటు సంస్థలతో పాటు, ప్రభుత్వ సంస్థల్లో ఇదే పరిస్థితి దాపురించింది. దీంతో జిల్లా ప్రగతి పూర్తిగా కుంటుపడుతోంది. జిల్లా పరిపాలన కేంద్రమైన కలెక్టరేట్‌కు కూడా కోతలు తప్పకపోవడంతో ఎక్కడి ఫైళ్లు అక్కడే స్తంభించిపోతున్నాయి. అధికారిక కోతలతో పాటు అనధికారికంగా విధించే ఈఎల్‌ఆర్‌తో విద్యుత్ ఆధారిత చిరువ్యాపారులు తీవ్రంగా నష్టాలు పాలవుతున్నారు.