రాజాం: వర్షాలు తక్కువుగా పడతాయని తనకు ముందే తెలుసని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం పొగిరి గ్రామంలో శనివారం జరిగిన జన్మభూమి–మా ఊరు గ్రామసభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ ఏడాది 32 శాతం తక్కువుగా వర్షపాతం నమోదైందని, నదుల అనుసంధానంతో రైతులకు ఇబ్బందులు లేకుండా చేశామన్నారు. సాగునీటి వనరులను అభివృద్ధి చేస్తుంటే కేంద్రం రెండు రాష్ట్రాల మద్య వివాదం పెడుతోందని విమర్శించారు. తోటపల్లి ప్రాజెక్ట్ ప్రారంభించామని, మడ్డువలస ప్రాజెక్ట్ జలగం వెంగళవారం శంకుస్థాపన చేసి వదిలేస్తే తానే పూర్తిచేశానన్నారు. నాగావళి, వంశధార నదులను కలిపానని, గోదావరి నది నీటిని శ్రీకాకుళం తెస్తామని చెప్పారు. 10 శాతం వడ్డీ చెల్లించి రైతుల రుణాలు మాఫీ చేస్తున్నామని, సంక్రాంతి అనంతరం మొత్తం మాఫీ అవుతుందని పేర్కొన్నారు. రూ. 24 వేల కోట్లుతో రుణమాఫీ చేశామన్నారు. రాష్ట్రంలో 67 సాగునీటి ప్రాజెక్ట్‌లు ఏర్పాటు చేసిన ఘనత తనదేనన్నారు. సేంద్రియ ఎరువులతో రైతులకు ఎరువుల కొరత లేకుండా చేస్తున్నామని తెలిపారు. రైతుల కోసం ఓబురైజేషన్ యాప్ తీసుకొస్తున్నామని చెప్పారు.
మోదీ మోసగిస్తున్నారు..
కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం రాష్ట్రాన్ని మోసగిస్తోందని సీఎం పునరుద్ఘాటించారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీలను అడిగితే సీబీఐ పేరుతో భయపెడుతున్నారని చెప్పారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కూడా సీబీఐ కారణంగానే మోదీకి వత్తాసుగా ఉన్నారన్నారు. జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ)కు అప్పగించడం సబబుకాదన్నారు. తమ వద్ద అన్ని రికార్డులు ఉండగా కేంద్రం జోక్యం చేసుకోవడంతో తనపై కుట్రజరుగుతోందనే అనుమానం కలుగుతోందన్నారు. త్రిపుల్ తలాక్‌ను తెరపైకి తీసుకొచ్చి తమకు నచ్చినట్లుగా చట్టాన్ని మార్చుకుంటున్నారని, కేరళలో ఒక విధానం, ఆంధ్రాలో ఇంకో విధానం అమలుచేస్తున్నారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో అవినీతి జరిగిందని ఆరోపించడం కక్షసాధింపేనన్నారు. జగన్‌పై సీబీఐ కేసు విషయంలో ఏడాదిలోగా అరెస్టు చేస్తామని మోదీ హామీ ఇచ్చి ఆ తరువాత పక్కనపెట్టేశారని, ఇప్పుడు మళ్లీ మొదటినుంచి దర్యాప్తు చేస్తే కేసుకు ఆధారాలు ఉండవని అన్నారు.
మహిళల ఆగ్రహం..
చంద్రబాబు ప్రసంగిస్తుండగా మధ్యలో పలువురు మహిళలు గట్టిగా కేకలు వేసి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ చేశాను, ఇళ్లు ఇచ్చానని చెప్పి చప్పట్లు కొట్టమని ప్రజలను కోరగా సంతకవిటి మండలం తాలాడకు చెందిన పలువురు మహిళలు తమకు పక్కా ఇళ్లు ఎక్కడ ఇచ్చారని తిరిగి ప్రశ్నించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు తమకు అందలేదని నినదించారు. రాజాం మండలానికి చెందిన మహిళలు పసుపు కుంకుమ నిధులు రాలేదని చేతులను అడ్డంగా ఊపుతూ నిరసన తెలిపారు. వీరిలో కొంతమందిని అక్కడ పోలీసులు బలవంతంగా బయటకు తరలించారు. రైతు రుణమాఫీ పూర్తిగా చేయాలని రైతులు గట్టిగా అరుస్తూ నిరసన తెలిపారు. చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో కొంతమంది మహిళలు నిరసనగా లేచి వెళ్లిపోయారు. సభకు జనాల్ని తరలించడానికి 120 బస్సుల్ని వినియోగించినా.. సభలో జనం పలుచగానే ఉన్నారు.
విఫలమైన ప్రతిపక్షనేత చంద్రబాబు!
నోరుజారిన కోండ్రు
‘‘రాష్ట్ర ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు అన్ని విధాలా విఫలమయ్యారు. ప్రజాస్వామ్యమంటే కనీస గౌరవం లేని నాయకుడు చంద్రబాబు. ఈ నాలుగున్నరేళ్లలో ఒక్కసారి కూడా అసెంబ్లీకి వెళ్లలేదు. పెద్దలంటే కనీసం గౌరవం లేదు. ఎమ్మెల్యేలను అసెంబ్లీకి పంపించడంలేదు. అసెంబ్లీలో ఒక ప్రజా సమస్యను కూడా పరిష్కరించలేదు’’ అంటూ మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్ ప్రసంగం ప్రారంభించారు. కోండ్రు మాట్లాడుతున్న తీరు చూసి చంద్రబాబు సైతం విస్తుపోయారు. ఇంతలో శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు కోండ్రును అప్రమత్తం చేయగా తేరుకున్న ఆయన చెంపలేసుకున్నారు. అనంతరం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విమర్శలు చేశారు. చంద్రబాబు ప్రపంచ మేధావి అంటూ ఆకాశానికెత్తారు. కోండ్రు మాటలు విని ప్రజలు నవ్వు ఆపుకోలేకపోయారు.
Comments
Please login to add a commentAdd a comment