సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్రానికి జీవనాధారమైన పోలవరం ప్రాజెక్టును కేంద్రం అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని, దీన్ని సహించబోమని, బుల్డోజర్‌లా దూసుకెళతానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలంలోని పోతార్లంక ఎత్తిపోతల పథకాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులనుద్దేశించి ప్రసంగిస్తూ రైతు సంక్షేమ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం శ్రమిస్తున్నానని చెప్పారు.
రూ.49.68 కోట్లతో నిర్మించిన పోతార్లంక ఎత్తిపోతల పథకం ద్వారా 4,995 ఎకరాలకు నీరు ఇవ్వనున్నట్టు తెలిపారు. కాగా పోతార్లంక సాగునీటి పథకం సమయంలో రైతుల వాటా కింద అప్పట్లో 50 శాతం నగదును సొసైటీల ద్వారా రుణాలు ఇప్పించి ప్రభుత్వం తీసుకుందని, కానీ రుణమాఫీ అవక వడ్డీలు పెరిగిపోతున్నాయని మంత్రి నక్కా ఆనందబాబు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. రూ.10.50 లక్షల రుణం కాస్తా వడ్డీలతో కలుపుకొని రూ.50 లక్షలకు చేరుకుందని చెప్పడంతో.. ప్రభుత్వం ద్వారా రూ.25 లక్షలు చెల్లింపునకు మంజూరు చేస్తామని, మిగిలిన నగదు మాఫీ సొసైటీ ద్వారా జరిగేలా జీవో మంజూరు చేస్తానని సీఎం రైతులకు హామీ ఇచ్చారు.
అనంతరం దోనేపూడిలో గ్రామ దర్శిని, కొల్లూరు జిల్లాపరిషత్ హైస్కూల్‌లో గ్రామ వికాసం కార్యక్రమాన్ని ప్రారంభించి సభలు నిర్వహించారు. చంద్రబాబు మాట్లాడుతూ భవిష్యత్తులో ప్రతిపక్ష పార్టీలను గల్లంతు చేయాలని అన్నారు. దోనేపూడిలో గర్భిణులకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిమ్మగడ్డ రమేష్ రూ.50 వేల చెక్కు, శ్రీలత 2 బంగారు గాజులను ఇచ్చారు.
నన్ను విమర్శించే స్థాయి ఎవరికీ లేదు..
భారతీయ జనతాపార్టీ నమ్మక ద్రోహం చేసిందని బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి ఫలాలు అనుభవిస్తూ, ప్రతిపక్షాలు తమపై బురద జల్లుతున్నాయని విమర్శించారు. తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్న వారి స్థాయి ఏంటని నిలదీశారు. కన్నా లక్ష్మీనారాయణ వైఎస్సార్‌సీపీకి సొంత మైక్, భారతీయ జనతాపార్టీకి అద్దె మైక్‌గా వ్యవహరిస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం బ్యాంకులను దివాళా తీయించిందన్నారు.
పనులు పూర్తి కాకుండానే ‘ఎత్తిపోతల’ ప్రారంభం!
పోతార్లంక ఎత్తిపోతల పథకానికి సంబంధించి పనులు పూర్తి కాకుండానే సీఎం చంద్రబాబు ప్రారంభించడంపై రైతులు పెదవి విరిచారు. ప్రధానంగా డీసీ పాయింట్స్ నుంచి పొలాలకు వెళ్లే పైపులైనులు ఎక్కడా పూర్తి కాలేదన్నారు. ముఖ్యమంత్రి మోటార్లను ఆన్ చేసినప్పటికీ నీళ్లు లీక్ అయితే రైతుల నుంచి ఎక్కడ వ్యతిరేకత వస్తుందోనన్న భయంతో అధికారులు వెంటనే ఆపేశారు.
బుల్డోజర్‌లా దూసుకెళతా!
Published Tue, Jul 17 2018 3:43 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment