డీజీపీ ఆఫీసును కబ్జా చేయాలనుంది: సీఎం
సాక్షి, అమరావతి: ‘‘డీజీపీ కార్యాలయాన్ని కబ్జా చేయాలనుంది.. ఇక్కడే సీఎం ఆఫీసును పెట్టుకోవాలనుంది’’ అని సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో రూ.40 కోట్లతో నిర్మించిన పోలీస్ హెడ్‌క్వార్టర్స్(డీజీపీ కార్యాలయం)ను సీఎం బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. డీజీపీ కార్యాలయం కబ్జా చేయాలని ఉన్నా చేయనని, తాను అలా చేస్తే ఎవరూ మంచి ఆఫీసు కట్టుకోరని ముక్తాయించారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలకోసం పాటుపడుతున్న పోలీసుల బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుంటుందని, ప్రతీ పోలీసుకూ ఇల్లు కట్టిచ్చే బాధ్యత తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో పోలీస్ ఫోర్స్ రోబోలను మించిపోతోందన్నారు. గుంటూరు జిల్లాలో బోరుబావి నుంచి చిన్నారిని కాపాడటంలో పోలీసుల చొరవ అభినందనీయమన్నారు.
చిన్నా చితకా సంస్థలకు భూములివ్వడం వేస్ట్
చిన్నా చితకా సంస్థలకు భూములిస్తే పెద్దగా ఉపయోగం ఉండదని, అదే పెద్ద పెద్ద సంస్థలకు భూములిస్తే ప్రపంచస్థాయి సంస్థలు అమరావతికి వచ్చే అవకాశముందని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. బుధవారం ఆయన ‘కింగ్స్ కాలేజ్ హాస్పిటల్–ఇండో యూకే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్’ ఏర్పాటులో భాగంగా విజయవాడలోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన పునాదిరాయి కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. కింగ్స్ కాలేజీ యూరప్‌లోనే పెద్ద పేరున్న సంస్థని, భారతదేశంలో 11 ఆస్పత్రులను ఏర్పాటు చేస్తోందని, వీటన్నింటికీ అమరావతిలో నిర్మించే వైద్యకళాశాల హెడ్‌క్వార్టర్స్ కావాలని ఆయన అన్నారు. కింగ్స్ కళాశాల అమరావతిలో రూ.1,600 కోట్లు పెట్టుబడి పెడుతోందని, 1,000 పడకలతో ఆస్పత్రి, కళాశాల నిర్మాణం చేస్తోందన్నారు.