హంద్రీ - నీవా ఘనత వైఎస్‌దే
సీఎం చంద్రబాబు విమర్శను తిప్పికొట్టిన శైలజానాథ్
సాక్షి, హైదరాబాద్: ‘హంద్రీ-నీవా’ ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు కృష్జా జలాలు వచ్చాయంటే ఆ ఘనత దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిదేనని కాంగ్రెస్ మాజీ మంత్రి సాకే శైల జానాథ్ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ద్రోహం చేసిందని సీఎం చంద్రబాబు విమర్శించడాన్ని ఆయన తప్పుపట్టారు. దీనిపై నిజా నిజాలను ప్రజల ముందుంచేం దుకు చంద్రబాబు తమతో బహిరంగ చర్చకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు.
వేదిక, సమయం తెలుగుదేశం పార్టీ నాయకులే చెబితే అందుకు తాము సిద్ధమన్నారు. శనివారం ఇందిర భవన్‌లో శైలజానాథ్ మీడియాతో మాట్లాడారు. టీడీపీ హయాంలో పథకాన్ని తాగునీటికే పరిమితం చేసి 1996 మార్చి 11న ఒకసారి, 1999 జూలై 13న మరోసారి శంకుస్థాపన చేసి బాబు చేతులు దులుపుకుంటే, రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిస్థాయిలో ప్రాజెక్టును నిర్మించే విధంగా 2004 జూలై 24న (జీఓ ఎంంఎస్ నం: 731) ఉత్తర్వులు జారీ చేయడమే కాకుండా త్వరితగతిన పూర్తి చేశారని తెలిపారు.