సీఎం చంద్రబాబుకు అస్వస్థత
- అమరావతిలో మెడిసిటీ భవనానికి శంకుస్థాపన
అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. రాజధానిలో నిర్మించనున్న మెడిసిటీ భవనానికి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేసి సభలో మాట్లాడుతుండగా ఆయన అనారోగ్యానికి గురయ్యారు. తుళ్లూరు మండలం దొండపాడులో మెడిసిటీకి శంకుస్థాపన అనంతరం ఆయన బహిరంగ సభలో మాట్లాడారు. విద్యా వైద్యానికి అమరావతిని హబ్‌గా మారుస్తామన్నారు. భవిష్యత్తులో అమరావతికి గల్ఫ్ దేశాల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయన్నారు. త్వరలో అమరావతి నుంచి యునైటెడ్ అరబ్ ఎమరైట్స్ (దుబాయి)కు విమాన సర్వీసులు ప్రారంభిస్తామన్నారు.
బహిరంగ సభలో 20 నిమిషాల పాటు మాట్లాడిన అనంతరం ముఖ్యమంత్రి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ప్రసంగాన్ని అర్ధాంతరంగా ముగించి కూర్చుండిపోయారు. రెండు నిమిషాల అనంతరం తేరుకొని యధావిధిగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రికి అలసటగా కనిపించడంతో సీఎంవో అధికారులు అప్రమత్తమయ్యారు. అక్కడే ఉన్న మంత్రి పుల్లారావు సీఎం ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.